కావేరీ జలపాతం కనిపించదు... వినిపిస్తుంది. కిలోమీటరు దూరం నుంచే జలపాతం సవ్వడి సందడి చేస్తుంటుంది. నీరు నేల మీదకు దూకుతున్న చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ మనం జలపాతం దగ్గరకు వెళ్తున్నామని అర్థం. జలపాతం దగ్గరకు వచ్చిన తర్వాత కొద్ది క్షణాల పాటు ఏమీ అర్థం కాదు. ఎటు చూసినా నీటి పాయలు... ఒకటి కాదు రెండు కాదు. పదుల సంఖ్యలో జలధారలు నురగలు చిమ్ముతుంటాయి. సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తు నుంచి నీటి ధారలు ఒక్కసారిగా నేల మీద పడుతుంటే ఆ దృశ్యాన్ని చిత్రీకరించడానికి మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లు సరిపోవు.
నీటి తుంపరలు ఇరవై అడుగుల పైకి లేస్తాయి. దూరానికి పొగమంచు ఆవరించినట్లు ఉంటుంది. ఆకాశంలో మేఘాలతో మమైకమై కనిపిస్తుంది. ఇంతకీ ఇంత అందమైన జలపాతం ఎక్కడుంది? అంటే... తమిళనాడులో ఉందనే చెప్పాలి. ఎలా వెళ్లాలి అంటే! బెంగళూరు నుంచి వెళ్లాలని చెప్పక తప్పదు. మరో విషయం!! మనం చెప్పుకుంటున్న భారీ కావేరీ జలపాతం ఉన్నది హోగెనక్కల్ అనే గ్రామంలో. అందుకే హోగెనక్కల్ జలపాతం అంటారు. హోగెనక్కల్ వాళ్లు కావేరీ జలపాతం అంటారు.
సాహసమే ఆనందం
కావేరీ జలపాతం పాయలు మలిగెరె కొండల మధ్య, కొండలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంటాయి. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణమే పెద్ద సాహసం. పెద్ద వాళ్లు దూరం నుండి చూసి ఆనందిస్తారు, పడవలో నీటి అలల మీద తేలుతూ దగ్గరకు వెళ్లి కొండను తాకితే కలిగే ఆనందం మాటలకందదు. ఈ పడవలు వెదురుతో వలయాకారపు బుట్టలు. అడుగున తారు పూస్తారు. లోపలి వైపు పాలిథిన్ షీటు వేసి కుడతారు. జలపాతం దగ్గరకు వీటిలో వెళ్లడమే క్షేమమని చెబుతారు స్థానికులు. ఈ నీటిలో ప్రయాణించి ముందుకు పోతే ఇసుకతిన్నెలాంటి చిన్న ద్వీపాలకు వెళ్లవచ్చు. జలపాతం హోరు చూసి పర్యాటకులు కొండ దగ్గరకు వెళ్లడానికే భయపడతారు. ఆ ఊరి పిల్లలు కొండ అంచుల వరకు ఎక్కి ఒక్కసారిగా ప్రవాహంలోకి దూకుతారు. ప్రాణాలకు తెగించే డైవ్ చేయవద్దన్నా వినరు.
పడవలోకే చిరుతిళ్లు
పర్యాటకులు ఒక పడవలో వెళ్తుంటే చిరుతిళ్లు అమ్ముకునే వాళ్లు మరో పడవలో వచ్చి అందిస్తారు. చిన్న పెద్ద జలపాతాలన్నింటినీ చూడాలంటే ఇక్కడ ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జి మీదకు ఎక్కాలి. సరదాగా లెక్కపెడదామన్నా కూడా తెల్లటి నీటి ధారలను తదేకంగా చూడడంతో కళ్లు చెదురుతుంటాయి, జలపాతాల లెక్క తేలదు. పడవ విహారం ముగించి ఒడ్డుకు రాగానే చేపలను కాల్చి ఇచ్చేవాళ్లు సిద్ధంగా ఉంటారు. నీటిలో పట్టిన తాజా చేపలను పర్యాటకుల కళ్ల ముందే కాల్చి ఇస్తారు. ఈ ఊరు తమిళనాడు– కర్నాటక సరిహద్దులో తమిళనాడు, సేలమ్ పట్టణానికి 114 కి.మీల దూరాన ఉంది. ఇక్కడ ఎక్కువగా కన్నడమే మాట్లాడతారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదమే కాదు, కావేరీ జలపాతాల పర్యాటక వినోదం కూడా ఉంది.
చదవండి: Jodeghat Museum: జోడెన్‌ఘాట్ వీరభూమి
Comments
Please login to add a commentAdd a comment