నా కూతురు లోకం చూడాలి | Blogger Silky Puri Investing In Her Daughter Travels | Sakshi
Sakshi News home page

నా కూతురు లోకం చూడాలి

Published Mon, Nov 30 2020 11:52 AM | Last Updated on Mon, Nov 30 2020 11:52 AM

Blogger Silky Puri Investing In Her Daughter Travels - Sakshi

నాలుగేళ్ల క్రితం కూతురు పుట్టింది ఆమెకు. ‘అమ్మో.. అమ్మాయి పుట్టింది... ఇప్పటి నుంచే పెళ్లికి ఏదైనా దాచి పెట్టు’ అనడం మొదలెట్టారు అత్తామామలు. తల్లి సిల్కీ పూరి తన కూతురికి డబ్బు బదులు ప్రపంచాన్ని ఇవ్వదలుచుకుంది. ‘నా కూతురు లోకం చూడాలి’ అని నాలుగేళ్లు వచ్చేలోపు ఆరుదేశాలు చూపించింది. ఇక దేశంలో ముఖ్య టూరిస్ట్‌ ప్లేసులు కూడా చూపెట్టింది. ‘నేను నా కూతురి కోసం రూపాయి దాచను. దాచాల్సిన డబ్బుతో సమానంగా లోకం చూపిస్తా. ఆడపిల్లకు లోకం తెలియాలి.’ అంటుంది సిల్కీ పూరి. భర్త గగన్‌ కూడా ఇదే అంటున్నాడు. సిల్కీ పూరి తన కుమార్తెతో తిరిగే ప్రదేశాల డైరీని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మమ్మీ ట్రావెల్‌ స్టోరీస్‌’ పేరుతో రాస్తోంది. పిల్లల పెంపకంలో ‘పర్యటన కూడా పాఠమే’ అని చెబుతున్న సిల్కీ పూరి ఆలోచనలు...

‘నా కూతురు ఏ ప్రాంతానికీ చెందదు. ఏ భాషకూ చెందదు. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలూ తనవే. అన్ని భాషలూ తనవే’ అంటుంది సిల్కీ పూరి. 32 ఏళ్ల ఈ కార్పొరేటర్‌ ప్రొఫెషనల్‌ నాలుగేళ్ల క్రితం కూతురు పుడితే ‘ఖ్వాయిష్‌’ అని పేరు పెట్టుకుంది. ఖ్వాయిష్‌ అంటే ఇచ్ఛ అని అర్థం. లోకం చూడాలనే ఇచ్ఛ తన కూతురికి ఉండాలి అని సిల్కీపూరి అనుకుంది. అందుకే నాలుగేళ్లు వచ్చేసరికి ఆరు దేశాలు చూపించింది. ఇంకా చూపుతాను అంటోంది.

ఆడపిల్లకు ఇచ్చే ధనం
గుర్‌గావ్‌ (ఢిల్లీ)కి చెందిన సిల్కీ పూరికి కూతురు పుట్టాక అంతవరకూ ఆమెకు సలహాలు పెద్దగా ఇవ్వని అత్తా మామలు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘ఆడపిల్ల పుట్టింది. ముందు ముందు చాలా ఖర్చు ఉంటుంది. కొంత ఆ అమ్మాయి పేరున దాచి పెట్టు’ అనడం మొదలెట్టారు. ఇదే విషయాన్ని సిల్కీ తన భర్త గగన్‌కు చెప్పింది. ఇద్దరికీ ఈ ఆలోచన నచ్చలేదు. ‘ఇద్దరం అమ్మాయి పేరున రూపాయి కూడా దాచొద్దు అనుకున్నాం. దాచాలనుకున్న డబ్బుతో లోకాన్ని చూపిద్దాం అని నిశ్చయించుకున్నాం’ అంటుంది సిల్కీ పూరి. ఆమె తనకు కాన్పయిన రెండు నెలలకే భర్తను, కుమార్తెను తీసుకున్న మిగిలిన డెలివరీ లీవులోని రోజులను సద్వినియోగం చేయడానికి దుబాయ్‌ వెళ్లింది. ‘చంటి పిల్లలతో విదేశీ యాత్రలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కాని చంటి పిల్లలతో దుబాయ్‌ వంటి ప్రాంతాలు తిరగడం చాలా సులువు. అన్నీ చోట్లా బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూములు దొరుకుతాయి. పాప రెండు మూడు గంటల పాటు తిరిగినా కిక్కురు మనేది కాదు’ అంటుంది సిల్కీ.

ఎన్నో ప్రశ్నలు
తల్లులు అందరూ పిల్లలకు బర్త్‌డే ప్రెజెంటేషన్లు ఇస్తుంటారు. కాని సిల్కీ పూర్తి టూర్‌ టికెట్లను ప్రెజెంట్‌ చేస్తుంది. ‘మేము ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్నాం. అద్దె ఇంట్లో ఉంటూ డబ్బు ఖర్చు చేస్తూ ఈ తిరుగుళ్లు ఎందుకు అంటారు ఎందరో. కొంతమంది ఇంత చిన్న వయసులో తిరిగితే పిల్లలకు ఏమీ గుర్తుండవు అని కూడా అంటారు. కాని నాకు తెలుసు. నా కూతురు మిగిలిన వారికి ఎంత భిన్నమో. ఈ కూతురు ఐఫిల్‌ టవర్‌ చూసింది పీసా టవర్‌ ఎదుట ఫొటో దిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో గడ్డ కట్టే మంచులో ఉంది. కేరళ బ్యాక్‌ వాటర్స్‌ పడవ మీద తిరిగింది. ఇప్పటికే ఆరు దేశాల ప్రజలను చూసింది. వారి రకరకాల భాషలు వింది. లోకం చాలా ఉంటుంది అని తెలుసుకున్న నా కూతురు మిగిలిన పిల్లల కంటే భిన్నంగా నిలబడుతుంది. తన వొకాబులరీ అద్భుతంగా ఉండటం మేము గమనిస్తున్నాం. తనకు చాలా విషయాలు తెలుసని కూడా అనిపిస్తూ ఉంటుంది’ అంటుంది సిల్కీ. ‘ఇంతకు మించిన పిల్లలకు ఇవ్వదగ్గ పెంపక పాఠం ఏముంటుంది?’ అంటుంది సిల్కీ.

భర్తతో కలిసి
‘నా భర్త నేను పర్యటనలంటే ఇష్టపడే బృందాలలోనే పరిచయమయ్యాం. అతనికి కూడా యాత్రలు ఇష్టం. పెళ్లయ్యాక కూడా తిరగాలి అనే పెళ్లి చేసుకున్నాం. సాధారణంగా భారతీయ స్త్రీలు పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఇక తమ కలలు ముగిసినట్టే అనుకుంటారు. నేను మాత్రం నా కలలను నా కుమార్తెతో పాటు కొనసాగించాలని నిశ్చయించుకున్నాను. ఆడపిల్లకు లోకం తెలియాలి. నా కూతురు ఇలా విహారాల వల్ల అన్ని రకాల ప్రాంతాలకి, ఉష్ణోగ్రతలకి, వాతావరణాలకి తట్టుకుని నిలబడే శక్తి పొందింది. భిన్న ఆహారాలకు మెల్లగా అలవాటు పడటం నేర్చుకుంది. పెద్దయితే తను ఎలాగైనా ఎక్కడైనా బతకగలదు ఇలాంటి ఎక్స్‌పోజర్‌ వల్ల’ అంటుంది సిల్కీ.

చిన్న పిల్లలతో పర్యటనలను చాలామంది తల్లులు వద్దనుకుంటారు కాని సిల్కీ కొన్ని బేసిక్‌ ఆహార పదార్థాలను తనతో పాటు తీసుకెళుతుంది. వంట గది ఇచ్చే గదులనే బుక్‌ చేసుకుంటుంది. కొద్దిపాటి ఆహారం వండుకుంటుంది. అంతే కాదు అన్ని చోట్ల దొరికే ఉడకబెట్టిన గుడ్ల వంటి పదార్థాలని కూతురికి అలవాటు చేసింది. కనుక పాప ఆకలి సమస్య పెద్దగా ఉండకుండా చూసుకుంటుంది. ‘లుఫ్తాన్సా, ఎమిరేట్స్‌ వంటి ఫ్లయిట్‌లు పిల్లలు లోపల ఆడుకోవడానికి కొన్ని గేమ్స్‌ ఇస్తాయి. అలాంటి ఫ్లయిట్స్‌లో ప్రయాణం పెట్టుకుంటాను. పాప నిద్రను దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట ఫ్లయిట్‌లే తీసుకుంటాను. దిగే హోటల్‌కు దగ్గరగా పార్కులు ఉంటే పాపను తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. పిల్లలకు మనం చెప్పేది అర్థం కాదనుకుంటాం కాని వాళ్లు అర్థం చేసుకుంటారు. మనం ప్రయాణం చేస్తున్నాం అని చెప్తే సహకరిస్తారు’ అంటుంది సిల్కీ.

పెద్దలు తాము ఎక్కడో ఆగిపోయి పిల్లలను ముందుకు పంపించాలని చూస్తారు. కాని సిల్కీ పూరి వంటి తల్లులు నిరంతరం తాము, తమ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చలనంలో ఉండాలని భావించడం ఒక వినూత్న విషయంగా అనిపిస్తుంది. ప్రయాణాలు చేసే శక్తి ఉన్నా దేశంలోని మూడు నాలుగు ప్రదేశాలు కూడా చూడని పిల్లలు ఉంటారు మన దగ్గర. వారి ఎక్స్‌పోజర్‌ను మనం నిరోధిస్తున్నట్టే. సిల్కీ చెబుతున్న కొత్త పెంపక పాఠం పెద్దలు కూడా వినొచ్చేమో చూడండి.
– సాక్షి ఫ్యామిలీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement