తీవ్రమైన పగటి కలలతో విసిగిపోయారా? నియంత్రణ ఎలా? | How to control daydreaming and why? full deets inside | Sakshi
Sakshi News home page

తీవ్రమైన పగటి కలలతో విసిగిపోయారా? నియంత్రణ ఎలా?

Published Thu, Feb 27 2025 11:07 AM | Last Updated on Thu, Feb 27 2025 11:20 AM

How to control daydreaming and why? full deets inside

డాక్టరు గారూ! నేను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నాను. నాకీ మధ్య పగటి కలలు ఎక్కువగా వస్తున్నాయి. క్లాసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నడుస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏవేవో పగటి కలలు వస్తున్నాయి. కలెక్టర్‌ను చూస్తే కలెక్టర్‌ అయినట్లు, పోలీస్‌ అఫీసర్‌ను చూస్తే ఎస్‌.పి. ని అయినట్లు, సినిమాలో హీరోయిన్‌ను చూస్తే నేను కూడా హీరోయిన్‌ అయినట్లు, ఇలా రకరకాలుగా పగటి కలలు, ఊహలు వస్తున్నాయి. ఆటోలో బస్సులో వెళుతున్నప్పుడు ఇవి మరీ ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చినప్పుడల్లా చాలా హాయిగా ఉంటుంది. దాంట్లోంచి బయట పడగానే అయ్యో! ఇది నిజం కాదా అని చాలా బాధ కలుగుతుంది. క్లాసులో ఇలా కలలు రావడం వల్ల చదువు కూడా దెబ్బతింటోంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. ఈ ఊహల్లోంచి బయట పడే మార్గం చెప్పండి – ప్రణీత, మహబూబ్‌ నగర్‌

ఇలా కలలు, పగటి కలలు కనడం మనిషికి చాలా సహజం. ఈ ప్రపంచంలో అసలు కలలు–పగటి కలలు ఎప్పుడో ఒకసారి కనని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇలా పగటి కలలు... అంటే ‘డే డ్రీమింగ్‌’ యుక్త వయసులో చాలా సహజం. మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైనవారు, ‘ఎ.డి.హెచ్‌.డి.’ అంటే నిలకడ, ఏకాగ్రత లేకుండా ఓవర్‌ యాక్టివ్‌గా ఉండేవారిలో కూడా ఈ పగటి కలలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. 

మనం అనుకున్నవన్నీ నిజ జీవితంలో సాధించలేనప్పుడు, కొంత సేపైనా ఊహాలోకంలో విహరించి, నిజజీవితంలో పొందలేనివి ఇలా ఊహల్లోనైనా పొంది మనిషి తృప్తి పొందాలనుకుంటాడు. ఎడారిలాంటి మన జీవితాలకు పగటి కలలు ఒక ‘ఒయాసిస్‌’ లాగా పనిచేస్తాయి. అసంతృప్తితో ఉన్న మనసుకు ఈ పగటికలలు కొంత ఊరట కలిగించి, మన బాధలకు సమస్యలకు ఒక ‘ఔట్‌లెట్‌’ లాగా పనిచేసి మనల్ని సంతృప్తి పరుస్తాయి. మరికొందరికి పగటికలలు, వారిలో ‘క్రియేటివిటీ’ పెరిగేందుకు, జీవిత సమస్యలనుండి కొన్ని పరిష్కారాలు పొందేందుకు కూడా తోడ్పడతాయి. 

చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్‌ మహిళ వీడియో వైరల్‌
ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్‌: భారతీయ మత్స్య కన్య సక్సెస్‌ స్టోరీ!

కానీ ‘అతి సర్వత్రా వర్జయేత్‌!’ అన్నట్లు ఏదైనా అతిగా ఉంటేనే ఇబ్బంది. వాస్తవాన్ని పూర్తిగా మరచి, పగలంతా పగటి కలల్లో, విహరించడమనేది అంత మంచిది కాదు. దీనివల్ల మీ చదువు, ఇతర పనులు దెబ్బతింటాయి. మీరు మీ జీవిత గమ్యాలను ప్రతిరోజు స్మరించుకుంటూ, వాటిని సాధించేందుకు, మీ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించండి. ఏకాగ్రత నిగ్రహ శక్తి, పెంచుకునేందుకు సరైన నిద్ర, ధ్యానం,  ప్రాణాయామం, మైండ్‌ఫుల్‌నెస్, ఉపయోగపడతాయి. మీకిష్టమైన వేరే వ్యాపకాలపై ధ్యాస పెట్టండి. జీవితంలో పగటి కలలు ఒక భాగమే తప్ప పగటి కలలే జీవితం కారాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement