దేవుడి రూపంలో ఎవరైనా వచ్చి, ఎవరో ఎందుకు.. దేవుడే వచ్చి.. పక్కింట్లో అద్దెకు దిగి.. ‘మా ఇంట్లో ఉండిపోతావా బాబూ.. మంచి మంచి తుపాకీ బొమ్మలున్నాయి, ఎల్.ఇ.డి. టీవీలో మంచి మంచి టెర్రరిస్ట్ సినిమాలు వస్తాయి, వారానికి రెండుసార్లు స్వర్గానికి ట్రిప్పులు వుంటాయి’ అని పిలిస్తే చిన్న పిల్లలు అయితే నేరుగా వెళ్లిపోయి దేవుడి అద్దింటి హాల్లో కూర్చుంటారు. పొద్దు పోతున్నా అమ్మానాన్న తమని వెతుకుతుంటారని లేకుండా అక్కడి ఆడి, అక్కడే నిద్రపోతారు. పెద్ద పిల్లలు అలాక్కాదు. అద్దెకు దిగిన దేవుడొచ్చి ‘ఆటాడుకుందాం రా..’ అని పిలవగానే ఆలోచిస్తారు. ‘దేవుడేంటి అద్దిల్లేంటి, అదీ మన పక్కిల్లేంటి?’ అని యోచిస్తారు. అది మొదటి స్టెప్ ఆలోచన. రెండో స్టెప్ లో ‘దేవుడేంటి తుపాకులేంటి, మంచి టెర్రరిస్ట్ సినిమాలేంటి?’ అని థింక్ చేస్తారు. నిజంగా దేవుడేనా అని అనుమానిస్తారు.
నిజంగా దేవుడే అని రూఢీ అయినా.. ‘సారీ అంకుల్ నాకు మా ఇల్లే బాగుంటుంది’ అని చెప్పే ధైర్యం చేస్తారు. దేవుడు వెంటనే... ‘హ హ హ.. నేనూ మనిషినే’ అని ముసుగు తీసిపారేసి, ‘అయినా మీ ఇంట్లో ఏముందోయ్? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, కరోనా వ్యాక్సిన్ ఉందా, కనీసం ఎవరైనా వస్తే కూర్చోమనడానికి రాజ్ కమల్ ప్లాస్టిక్ కుర్చీ ఉందా?!’ అని ఇంటిని తీసిపారేస్తే.. ‘అవేమీ లేవంకుల్. కానీ నా ఫ్యామిలీ మెంబర్స్’ ఉన్నారు అని చెప్పి వచ్చేస్తారు. ఈమధ్య బారాముల్లాలో అబిడ్, మెహ్రాజ్ అనే ఇద్దరు యువకులు భారత భద్రతాదళాలకు ఎదురు పడ్డారు. అల్ బద్ర్ ఉగ్రవాద సంస్థలో కొత్తగా రిక్రూట్ అయినవాళ్లు ఆ ఇద్దరు. లొంగిపొమ్మంటే వినడంలేదు. ఎన్ కౌంటర్ సైట్ అది. ఆర్మీ ఇలాంటప్పుడు అస్సలు టైమ్ తీసుకోదు. కానీ అబిడ్, మెహ్రాజ్ ముఖాలు చూసి ఆగింది. పిల్లలు వాళ్లు. గవర్మమెంట్ కి సమాచారం పంపారు.
వెంటనే ఆ ఇద్దరు యువకుల తల్లిదండ్రులను వెంటబెట్టుకుని స్పాట్‌కి చేరుకున్నారు కశ్మీర్ ఐ.జి.పి. విజయ్. పేరెంట్స్ ని చూడగానే తపాకుల్ని పక్కన పడేసి, పరుగున వెళ్లి అమ్మానాన్నల్ని హత్తుకుపోయారు అబిడ్, మెహ్రాజ్. గత నెల (అక్టోబర్) 16 న కూడా ఇలాగే జహంగీర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఇండియన్ ఆర్మీ ఎన్ కౌంటర్ చేయకుండా వదిలేసింది. అతడి తండ్రిని పిలిపించి కొడుకును సరెండర్ చేయించింది. ఆ తండ్రి ఆర్మీ అధికారి కాళ్లకు దండం పెట్టాడు. ఆయనకు ఆ అధికారిలో దేవుడు కనిపించి ఉంటాడు. పక్కింట్లో అద్దెకు దిగుతున్న ‘దేవుళ్ల’ నుంచి పిల్లల్ని కాపాడటానికి దేవుడే కొత్తగా ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అయి ఉన్నాడా?!
Comments
Please login to add a commentAdd a comment