దీపావళి తారాజువ్వ ఒకటి అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లి, అక్కడున్న సునీతా విలియమ్స్‌ని ఎక్కించుకుని తిరిగి భూమి మీదకు చేరుకుంటే ఎంత బాగుంటుంది! వారంలో తిరిగొచ్చేందుకు వెళ్లి, అవాంతరం వల్ల అక్కడే చిక్కుకుపోయారు సునీత, ఆమె సహవ్యోమగామి విల్మోర్. వారిని స్పేస్‌లోకి మోసుకెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి, భూమి పైకి తిరిగొచ్చి కూడా రెండు నెలలు అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో గానీ మరో కొత్త వ్యోమనౌకలో సునీత భూమి పైకి వచ్చే అవకాశాలు లేవు.
సునీత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ‘నాసా’కు సంకేతాలు అందుతున్నాయి. కానీ అవి సునీత పంపుతున్న సంకేతాలు కావు. నాసా అంచనాలు మాత్రమే. నిజానికి ఆమె ధైర్యంగా ఉన్నారు. భూమిపైకి సందేశాలు పంపుతున్నారు. సోమవారం వైట్‌హౌస్‌లో దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు.. ‘‘అంతరిక్ష కేంద్ర నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ వీడియోలో శుభాకాంక్షలు పంపారు! ఇది కదా ఈ ఏడాది అసలైన దీపావళి. భూమికి 260 మైళ్ల ఎత్తులో, నక్షత్రంలా మెరుస్తున్న మన సునీతను కళ్లారా చూడ్డం, ఆమె స్వరాన్ని చెవులారా వినటం.. ఇది కదా నిండైన దీపావళి.
‘‘ఇంత ఎత్తు నుండి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు మాత్రమే లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గొప్పతనం గురించి చిన్నప్పుడు నాన్న మాకు చెప్పేవారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నందుకు అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌కు సునీతా విలియమ్స్ కృతజ్ఞతలు’’ అని సునీత తన సందేశాన్ని వినిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ధీరులు మాత్రమే ఇతరుల సంతోషాలలో పాల్పంచుకోగలరు. తమ కష్టాన్ని దాచి పెట్టి చిరునవ్వుల మతాబులను వెలిగించగలరు.
Comments
Please login to add a commentAdd a comment