ఆకాశమంత కల | The Inspiring journey of Dr Srimathy Kesan: Space Kidz India | Sakshi
Sakshi News home page

ఆకాశమంత కల

Oct 6 2024 3:41 AM | Updated on Oct 6 2024 3:41 AM

The Inspiring journey of Dr Srimathy Kesan: Space Kidz India

‘పిల్లల రేపటి భవిష్యత్‌ కోసం ఈ రోజు త్యాగం చేద్దాం’ అన్నారు అబ్దుల్‌ కలాం. ఆయన పుట్టిన రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో పుట్టిన శ్రీమతి కేశన్‌కు ఆ  క్షిపణి యోధుడి మాటలు అక్షరాలా సరిపోతాయి. ఎంత ప్రతిభ ఉన్నా సరే పెళ్లయిన తరువాత ‘ఇక చాలు’ అని చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టే 
మహిళలు ఉన్నారు. చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నా సరే ఇంటిపనులకే పరిమితమై నిరుత్సాహంలో మునిగిపోయేవారు ఉన్నారు. ఇలాంటి మహిళలకు శ్రీమతి కేశన్‌ స్ఫూర్తి. పద్దెనిమిది సంవత్సరాలు గృహిణిగా ఇంటికే పరిమితం అయినప్పటికీ ‘ఇప్పుడు చదువు ఏమిటి!’ అనుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతరిక్ష రంగం వైపు అడుగులు వేసింది.‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ ద్వారా ఎంతో మంది పిల్లలను శాస్త్రరంగానికి దగ్గర చేస్తూ ‘శభాష్‌’ అనిపించుకుంటుంది...

శ్రీమతి పుట్టింది తమిళనాడులో అయినా పెరిగింది, చదివింది మాత్రం హైదరాబాద్‌లో. తమిళనాడుకు చెందిన కేశన్‌తో వివాహం తరువాత 18 సంవత్సరాలు గృహిణిగా ఇంటికే పరిమితమైంది. అయితే చదువుకోవాలనే తపన ఆమెను డిగ్రీ పూర్తి చేసేలా చేసింది. ఓపెన్‌ వర్సిటీ ద్వారా ఎంబీఏ చేసింది. ముంబైలోని  తన స్నేహితురాలు రీమా కోరిక మేరకు ఒక సైన్స్‌ సెమినార్‌కు హాజరైంది. ఈ సదస్సుకు హాజరు కావడం తన జీవితానికి టర్నింగ్‌పాయింట్‌ అనుకోవచ్చు. క్రమంగా శ్రీమతి ఆసక్తి అంతరిక్ష పరిశోధనల వైపు మళ్లింది. ఎన్నో వర్క్‌షాప్‌లకు హాజరైంది. ఎంతోమంది పిల్లలను సొంత డబ్బులతో ‘నాసా’కు తీసుకువెళ్లింది.

శాస్త్రవేత్తలుగా ఎదగాలనే తపనతో ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు బాసటగా నిలవడం కోసం  2011లో చెన్నై కేంద్రంగా ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’కు శ్రీకారం చుట్టింది. ఏడుగురు హైస్కూల్‌ విద్యార్థులతో కలిసి 64 గ్రాముల బరువుతో అబ్దుల్‌ కలాం శాటిలైట్‌ తయారుచేసి చేసి ‘నాసా రాకెట్‌ కాంపిటీషన్‌’కు పంపించింది. ఈ శాటిలైట్‌కు ‘నాసా’ గుర్తింపు ఇచ్చి ప్రయోగించింది. ఈ ఉత్సాహంతో టెక్సాస్‌లోని ఓ స్పేస్‌ సంస్థ కోసం మరో శాటిలైట్‌ తయారు చేశారు. 2019లో ఇస్రో ఇచ్చిన అవకాశంతో తమిళనాడులోని ప్రభుత్వ బడులలోని ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి ఆరు రోజుల వ్యవధిలో ఒక శాటిలైట్‌ తయారు చేశారు. 

గత ఏడాది కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వపాఠశాలలోని 750 మంది విద్యార్థినులను ఎంపికచేసి, శిక్షణ ఇచ్చి ‘ఆజాది శాటిలైట్‌’ తయారు చేశారు. 75వ భారతస్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో ద్వారా దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. అక్టోబరు 4న మొదలై 10వ తేదీ వరకు జరిగే  ‘వరల్డ్‌ స్పేస్‌ వీక్‌’ సందర్భంగా భారత్, శ్రీలంకలోని పేద, మధ్యతరగతి విద్యార్థులు ‘స్పేస్‌ కిడ్జ్జ్‌’తో కలిసి ఓ శాటిలైట్‌ తయారు చేయనున్నారు.

మొదట్లో ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టినా నాలుగేళ్లుగా ఒక సంస్థ అందించిన సహకారంతో విద్యార్థులతో కలిసి శాటిలైట్‌ పరిశోధనలను వేగవంతం చేసిన శ్రీమతి త్వరలో ప్రపంచంలోని హైస్కూల్‌ స్థాయి విద్యార్ధినులను ఒకే తాటిపైకి తెచ్చే  ‘సైంటిఫిక్‌ ఒలింపిక్‌’కు సిద్ధమవుతోంది. 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది విద్యార్థినులను ఎంపిక చేసి వారి ద్వారా సరికొత్త శాటిలైట్‌ తయారుచేసి నింగిలోకి ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందించుకున్నారు.‘దశాబ్దకాలంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ప్రతి సవాలును విజయంగా మలుచుకున్నాను. నింగిలో భారతనారీ శక్తి దేదీప్యమానంగా వెలగాలనేదే నా విజన్, మిషన్‌. స్పేస్‌ రీసెర్చ్‌పార్కు, స్పేస్‌ యూనివర్సిటీ భారత్‌లో రావాలని కోరుకుంటున్నాను’ అంటుంది శ్రీమతి.

సైన్స్‌లో ప్రతిభ ఉన్నవారే ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తి చూపుతారనేది అపోహ మాత్రమే అని నిరూపించింది శ్రీమతి కేశన్‌. డాక్టర్‌ కావాలనేది ఆమె కల. అయితే ఇంటర్మీడియెట్‌లో సైన్స్‌లో తక్కువమార్కులు రావడంతో బీకామ్‌లో చేరాల్సి వచ్చింది. అలా అని కామ్‌గా ఉండలేదు. శాస్త్రరంగంపై తన ఆసక్తికి ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’గా నిర్మాణాత్మక రూపం ఇచ్చింది. ఇప్పుడు ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ అనేది ఆమె కలల రూపం మాత్రమే కాదు సైంటిస్ట్‌ కావాలని కలలు కనే ఎంతోమంది పేద విద్యార్థుల ఆత్మీయ నేస్తం... దారి చూపే దీపస్తంభం. – అస్మతీన్‌ మైదీన్, సాక్షి, చెన్నై

ఆ దృశ్యం మరచిపోలేను!
చెన్నై వేళచ్చేరిలోని పేదకుటుంబంలో పుట్టిన కుష్భు అనే అమ్మాయి ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’తో కలిసి అడుగుల వేసింది. ఇప్పుడు ఖుష్బు ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తి ఇస్తోంది. ఇస్రో ద్వారా ‘ఆజాది శాట్‌’ ప్రయోగించిన అనంతరం  ఢిల్లీలో డీఆర్‌డీఓ నిర్వహించిన కార్యక్రమం లో ఖుష్బు ప్రసంగం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలాంటి అమ్మాయిల ప్రతిభను కళ్లారా చూసినప్పుడు మరింత కష్టపడాలనిపిస్తుంది. ‘ఆజాది శాట్‌’ నింగిలోకి ఎగిరిన క్షణంలో అమ్మాయిల కంట్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ దృశ్యాన్ని ఎప్పటికీ మరవలేను.  – శ్రీమతి కేశన్‌ ‘స్పేస్‌ కిడ్స్‌ ఇండియా’ ఫౌండర్, సీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement