Karthika Masam 2022: Start and End Date, Bali Padyami, Vaikuntha Chaturdashi - Sakshi
Sakshi News home page

Karthika Masam 2022: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం

Published Wed, Oct 26 2022 3:16 PM | Last Updated on Wed, Oct 26 2022 4:02 PM

Karthika Masam 2022: Start and End Date, Bali Padyami, Vaikuntha Chaturdashi - Sakshi

హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం (అక్టోబర్‌ 26) నుంచి ప్రారంభమైంది. నవంబర్‌ 23 వరకు కొనసాగే ఈ మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. అన్ని ఆలయాలు, నదీతీరాలు, ఇళ్లల్లో సైతం దీపాలను వెలిగించడం పుణ్యప్రదమని కార్తీక పురాణం చెబుతోంది. దీపదర్శనం, దీపదానం, దీప ప్రకాశనం అనే మూడు ఈ మాసంలో ఎంతో పుణ్యాన్నిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయాలు కార్తీక సందడికి సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక సోమవారాలు, ఏకాదశి, శనివారంతో పాటు ఈ నెలరోజులూ పుణ్యదినాలేనని అర్చకులు చెబుతున్నారు. 


విశిష్టత ఇలా.... 

కార్తిక శుద్ధ పాడ్యమికి బలి పాడ్యమి అని పేరు. ఈ రోజున బలిచక్రవర్తిని పూజించి దానం చేస్తే సంపదలు తరగవని చెబుతారు. మరుసటి రోజు ‘భగినీ హస్త భోజనం’ చేస్తారు. దీన్నే యమ ద్వితీయ, భ్రాత ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజున మహిళలు సోదరులు, సోదర వరసైన వారిని ఇంటికి పిలిచి స్వయంగా వంటచేసి భోజనం వడ్డిస్తారు. శుద్ధ చవితిని నాగుల చవితిగా చేసుకుంటారు. శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజుకు క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు. శుద్ధ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజున మహావిష్ణువు పరమశివుణ్ని పూజించారని నానుడి. కార్తికపౌర్ణమిని పరమశివుడు త్రిపురాసులను సంహరించిన రోజుగా చెబుతారు. ఈ రోజున శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు.  


దీపమే దైవం...
 
‘దీపం జ్యోతి పరబ్రహ్మం’ అన్నారు. దీపమే దైవ స్వరూపమని అర్థం. అందుకే లోకాల్లో చీకట్లను తొలగించే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, విప్పనూనె వంటి వాటితో కూడా దీపారాధనలు చేస్తారు. నదీ స్నానం, దానధర్మాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములకు కూడా ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.. దీనివల్ల కష్ట నష్టాలు పోవడంతో పాటు పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. 


మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు 

అక్టోబర్‌ 26వ తేదీ నుంచి వచ్చేనెల 23వ తేదీ వరకు కార్తీక  మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు వచ్చాయి. ఈనెల 31వ తేదీ మొదటి కార్తీక సోమవారం, నవంబర్‌ 4న ఏకాదశీ, 7న రెండో  కార్తీక సోమవారం, అదే రోజు కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, 8న చంద్ర గ్రహణం, నవంబర్‌ 14న మూడో సోమవారం, 21న నాల్గోవ సోమవారం.  


ఆకాశదీపం ప్రత్యేకం 

ఆయా ఆలయాల వద్ద ద్వజస్తంభాలకు ఈ నెల రోజుల పాటు సాయంత్రం వేళ ఆకాశదీపాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి దీపాలను ధ్వజస్తంభాలకు వేలాడదీస్తుంటారు. ఈ దీపాన్ని చూసిన, నమస్కరించిన దోషాలు తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఏటేటా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. (క్లిక్ చేయండి: కేదారేశ్వర వ్రతం ఎందుకు చేసుకుంటారంటే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement