కార్తీకమాసం సందర్బంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన మయూర నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరు గాంచింది. మాయవరంలోని మయూర నాథ ఆలయం. శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు అనేకం
ఉన్నాయి, అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమింటంటే... పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఇదెక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుందాము...
తమిళనాడు లోని, నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలిచే మాయవరంలో మయూరనాథ దేవాలయం వుంది.ప్రస్తుతమున్న మైలాడుతురైనే మాయవరం అని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్థులలో నిర్మితమైంది.దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి.
స్థలపురాణం
ఇక్కడ దక్షప్రజాపతి శివపార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి, పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో... జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి, అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి, ఒడిలో ఉన్న నెమలిపిల్ల కూడా ఆహుతైపోతుంది.
అలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో, తర్వాత నెమలి రూపంలో జన్మించి, జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి, శివుణ్ణి ప్రార్థించి, ఆయనలో లీనమైనట్లు స్థల పురాణం చెబుతోంది. పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి, ఈ ఆలయానికి మయూర నాథ దేవాలయం అని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక, అభయ ప్రధాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.ఈ ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది.ఈ మర్రి చెట్టుకిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లు భక్తులు భావిస్తారు.
ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. దీనిని వృషభా తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో, ప్రతీ పౌర్ణిమ రోజున తమ తమ గంగ యమునలతోపాటు ఇక్కడికి వచ్చి తమ అంశలతో కూడిన నదులు ఇక్కడికి వచ్చి, తమ జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు తలుస్తుంటారు.మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పురాతన ఆలయం
శాసనాల ప్రకారం క్రీ.శ 9 వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందని చెబుతారు.చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment