అసలు నా మరో పేరు ఆనంద విహారి | Kerala's Nidhi Kurian Book On Women Security InThe Country | Sakshi
Sakshi News home page

అసలు నా మరో పేరు ఆనంద విహారి

Published Thu, Feb 25 2021 11:12 PM | Last Updated on Fri, Feb 26 2021 3:50 AM

Kerala's Nidhi Kurian Book On Women Security InThe Country - Sakshi

నిధి కురియన్‌

కేరళకు చెందిన నిధి కురియన్‌ ప్రస్తుతం కోల్‌కతాలో ఉంది. ఆమె తమిళనాడులో పొలంగట్లన నిలబడింది. ఆంధ్రాలో చేపల చెరువులను చూసింది. ‘ఈ దేశం స్త్రీలకు ఎంత భద్రత ఇవ్వగలదో తెలుసుకోవాలి’ అని ఒంటరిగా సొంత కారులో సొంత డ్రైవింగ్‌ చేసుకుంటూ దేశాటనకు బయలుదేరింది. అర్ధరాత్రి తర్వాత సంగతి పట్టపగలు తిరగడమే స్త్రీకి కష్టం అని చెప్పే ఈ దేశంలో ఇష్టమైన విహారం మనమూ చేయొచ్చు అని తన అనుభవాలను రికార్డు చేస్తోంది నిధి.

33 ఏళ్ల నిధి కురియన్‌ రాయబోయే పుస్తకం కచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఎంచుకున్న వస్తువు అలాంటిది. ‘ఈ దేశమూ... ఈ దేశ స్త్రీలూ’... ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉన్నారో తను తెలుసుకోదలిచింది. అయితే అందుకు కంప్యూటర్‌ ఎదురుగా కూచుని గూగుల్‌ చేయలేదు. కారు తీసుకొని బయలుదేరింది. దానికి ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సోలో ట్రిప్‌’ అని పేరు పెట్టింది.

సోలో ట్రిప్
నిధి కురియన్‌ది కొట్టాయం. కొచ్చిలో నివసిస్తోంది. ట్రావెల్‌కు సంబంధించిన బ్లాగ్‌ ద్వారా కొత్త కొత్త ప్రాంతాల గురించి తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ చిన్న చిన్న యాత్రల కంటే ఒక భారీ యాత్ర చేయాలని నిశ్చయించుకుంది. దేశం మొత్తం తిరుగుతూ ఆ దేశంలోని ప్రదేశాలలో స్త్రీలు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తున్నారో నలుగురితో పంచుకోవాలనుకుంది. పుస్తకం రాయాలనుకుంది. అనేక ఆలోచనల తర్వాత 100 రోజుల్లో 25 వేల కిలోమీటర్లు సొంత కారులో సోలో ట్రిప్‌ చేయాలనుకుంది. తనకు రెనాల్ట్‌ కారు ఉంది. ఆ కారులో ఫిబ్రవరి 7, 2021న బయలుదేరింది.

తమిళనాడు మీదుగా
కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచ్చేరి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి విశాఖ మీదుగా ఒరిస్సా చేరుకుని ‘పూరి’ దర్శించుకుని ప్రస్తుతం కోల్‌కతా చేరుకుంది. ‘తమిళనాడు పంటపొలాల్లో స్త్రీలను కలిశాను. విశాఖలో చేపల మీద ఆధారపడి జీవించే స్త్రీల కష్టాన్ని చూశాను. ఒరిస్సా ఆవాల చేలలో స్త్రీలు పిలిచి తాము తెచ్చుకున్న ఆహారంలో పెట్టింది తిన్నాను. ఒరిస్సాలోనే ఒక ఊరు ఊరు హస్తకళలు చేయడంలో నిమగ్నం కావడం గమనించాను. స్త్రీలే ఎక్కువగా ఈ కళాఖండాలు చేస్తున్నారు. వారే కుటుంబానికి ఆధారం’ అని చెప్పిందామె. పూరిలో ప్రసాదాలు తయారు చేసి పంచే స్త్రీలతో ఆమె సంభాషించింది. ప్రస్తుతం కోల్‌కతా దారుల్లో అనంతంగా కనిపించే స్త్రీలలో తాను ఒక స్త్రీగా తిరుగుతోంది. ఆ స్త్రీల ప్రతిధ్వని ఏదో ఉంటుంది. ఆ ప్రతిధ్వనిని ఆమె తన పుస్తకంలో రాస్తుంది.

టూర్‌ కాదు ట్రావెల్‌...
టూర్‌ చేయడం అంటే ఏవో ముఖ్య ప్రదేశాలను చూడటం... ట్రావెల్‌ చేయడం అంటే జన జీవనంలో భాగమై కలిసి తిరుగుతూ ఆ ప్రదేశాలను అనుభూతి చెందడం అంటుంది నిధి. ‘ఈ ప్రయాణం ఒక ధ్యానం కంటే తక్కువ కాదు నాకు’ అంటుందామె. కొత్త ప్రదేశాలను చూడటం వల్ల మనం లోకాన్ని తెలుసుకుంటాము. స్త్రీలు ప్రయాణాలు చేయాలి. ఒంటరిగా ప్రయాణం చేస్తే మనం మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటాం... అంతే కాదు, మన అనుభవాలు మిగిలిన స్త్రీలతో చెప్పగలుగుతాం అంటుందామె. ప్రస్తుతం నిధి తెల్లవారుజామునే తన ప్రయాణం మొదలుపెట్టి సాయంత్రానికి ఆ రోజుకు నిర్దేశించిన గమ్యానికి చేరుకుంటుంది. ఎక్కువగా యూత్‌ హాస్టల్స్‌లో దిగుతోంది. లేదంటే ముందే బుక్‌ చేసుకున్న హోటళ్లలో.

అయితే ఆమె తన డిక్కీలో ఒక చిన్న సిలిండర్, వంట సామాగ్రి కూడా పెట్టుకుంది. ‘నేను తినడానికి ఈ దేశ యాత్ర చేయడం లేదు. ఏదో అవసరమైనది వండుకుంటా. లేదంటే స్ట్రీట్‌ఫుడ్‌ తింటా’ అని చెబుతోంది నిధి. ఆమె తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌డేట్‌ చేస్తోంది. ‘నీ ప్రయాణాన్ని నీతోపాటు మేమూ చేస్తున్నాం’ అంటున్నారు ఆమె ఫాలోయెర్స్‌. నిధి ఇప్పుడు కోల్‌కతా నుంచి ఉత్తర భారతదేశంలోకి వెళ్లనుంది. పంజాబ్, కాశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌ల మీదుగా ప్రయాణిస్తూ దేశం తిరుగుతుంది. ఆమె యాత్ర కన్యాకుమారిలో ముగుస్తుంది. నిధిలా తిరిగే అదృష్టం అందరికీ లేకపోవచ్చు. కాని ఆమె యాత్ర సేఫ్‌గా సఫలం అవ్వాలనుకునే హృదయం మనందరికీ ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement