రక్తదానం చేయాలనుకునేవారు తాము డొనేట్ చేస్తున్న బ్లడ్‌బ్యాంకులో... రక్తాన్ని కాంపోనెంట్స్‌ను విడదేసే సౌకర్యం ఉందా, లేదా అని ముందుగా వాకబు చేయాలి. అలా విడదీసే సౌకర్యం ఉంటేనే రక్తదానం చేయాలి. లేదంటే ఎక్కువ మందికి ఉపయోగపడాల్సిన రక్తం... కేవలం ఒకరికే ఉపయోగపడుతుంది. రక్తంలో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా... వంటి అనేక కాంపోనెంట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇవన్నీ కలగలసి ఉన్న రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. గతంలో పేషెంట్స్‌కు ఏ కాంపొనెంట్ అవసరం ఉన్నా మొత్తం హోల్ బ్లడ్ ఎక్కించేవారు.
కానీ ఇప్పుడు బ్లడ్‌లోని కాంపొనెంట్స్‌ను విడదీసి... అవసరమున్న దాన్ని మాత్రమే ఎక్కించే వీలుంది. అంటే... ఒక వ్యక్తికి హోల్‌బ్లడ్ ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. అలా కాకుండా ఏ కాంపొనెంట్ అవసరమో, అదే ఎక్కిస్తే ఒక హోల్ బ్లడ్‌ను అనేక మందికి సర్దుబాటు చేయవచ్చు. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఓ వ్యక్తికి ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీతన (అనీమియా)తో బాధపడుతున్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్‌బీసీ ఎక్కువగా అవసరం.
అలాగే డెంగీ సోకి ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి ప్లేట్‌లెట్లు మాత్రమే అవసరం. రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు, వాటిని విడదీసి రకరకాల అవసరాలు ఉన్న అనేకమంది రోగులకు ఎక్కించవచ్చు. అలా ఒకరి రక్తం ఒకే వ్యక్తి కంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు రక్తాన్ని కంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులోనే రక్తదానం చేయడం వల్ల ఏకకాలంలో అనేక మందికి రక్తదానం చేసిన ప్రయోజనం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment