పూలు ఘుమఘుమలాడటం సహజం. మరి పూలకు మిలమిలలు ఎక్కడివని కోప్పడిపోకండి. రాత్రివేళ మిణుగురుల్లా మిలమిల మెరిసే పూలను ఒక శాస్త్రవేత్త సృష్టించాడు. అమెరికా ప్రాంతాల్లో విరివిగా కనిపించే పిటూనియా మొక్కలకు జన్యుమార్పిడి చేసి, పిటూనియా పూలు మిణుగురుల్లా మిలమిలలాడేలా చేశాడు.
అమెరికన్ కంపెనీ ‘లైట్ బయో’లో పనిచేస్తున్న డాక్టర్ కీత్ వుడ్ అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని సాధించాడు. మాలిక్యులర్ అండ్ కెమికల్ బయాలజీలో విస్తృత పరిశోధనలు సాగిస్తున్న డాక్టర్ కీత్ వుడ్, తొలుత పొగాకు మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టాడు.
పొగాకు మొక్క చిన్నది కావడంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. తర్వాత పీటూనియా మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టి, అద్భుత ఫలితాలను సాధించాడు. పీటూనియా మొక్క ఎదిగిన తర్వాత దానికి పూసే పూలు రాత్రివేళ అచ్చంగా మిణుగురుల్లా మిలమిలలాడుతూ కనిపించాయి.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘లైట్ బయో’ కంపెనీ పెరటి తోటల్లో పెంచుకునేందుకు వీలుగా రాత్రివేళ మిలమిల వెలుగులు వెదజల్లే పీటూనియా మొక్కలకు ‘ఫైర్ ఫ్లై పీటూనియా’గా నామకరణం చేసి, వాటిని అమ్మడం ప్రారంభించింది. అమెరికన్ జనాలు ఈ మిణుగురు పూలమొక్కలను ఎగబడి మరీ కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment