గాంధీగారు తప్పు చేస్తే? | Mahatma Gandhi Jayanti 2024 | Sakshi
Sakshi News home page

గాంధీగారు తప్పు చేస్తే?

Published Sat, Sep 28 2024 1:01 PM | Last Updated on Sat, Sep 28 2024 1:01 PM

Mahatma Gandhi Jayanti 2024

(పిల్లలూ... గాంధీగారు తన ఆత్మకథలో రాసిన ఒక ముఖ్య ఘట్టం ఇది. చదవండి) 

‘‘ప్రపంచంలో సిగరెట్ల కోసం ఇంత మోజెందుకో నాకు అర్థం కాదు. పోగ త్రాగేవాళ్లతో రైలు ప్రయాణం నేను చేయలేను. నాకు ఊపిరాడదు. అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయసులో మొదట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుంచి కొంచెం దొంగిలించాలని అతను అంటే నేను సరే అన్నాను. దానికి కారణం మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం. 

ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.

చివరికి ఒక చీటీమీద చేసిన తప్పంతా రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్లి మా తండ్రిగారికి ఇచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమనీ, ఇక ముందు దొంగతనం చేయననీ శపథం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారు. ఆయన బల్లమీద పడుకుని ఉన్నారు. చీటీ వారి చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను. వారు చీటీ అంతా చదివారు. వారి కండ్లనుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. 

ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషం సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడా ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజు కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.’’

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement