హైదరాబాద్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం
యాంటీ ఆక్సిడెంట్లు పెరిగినట్టు గుర్తింపు
యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురణ
సాక్షి, సిటీబ్యూరో: శాకాహారంతో ఎన్నో లాభాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.. అయితే మానసిక ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు తేలి్చచెప్పారు. శాకాహారంతో మెదడు పనితీరు మెరుగు పడుతుందని, డిప్రెషన్ తగ్గుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని గుర్తించారు. వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మంచన నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం వివరాలు యురోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
40 ఏళ్లు దాటిన 304 మందిపై 6 నెలల పాటు వర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేశారు. శాకాహారులు, మాంసాహారులు మధ్య మానసిక, జ్ఞాపకశక్తి అంశాలలో ఉన్న తేడాలను పరిశోధించారు. శాకాహారం తిన్నవారిలో ప్రొటీన్,
కాల్షియం, ఫోలేట్, విటమిన్ సీ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాకపోతే వీరిలో విటమిన్ బీ–12 స్థాయి చాలా తక్కువగా ఉందని
గుర్తించారు. ఇక, మాంసాహారం తిన్నవారిలో కార్బొహైడ్రేట్స్, సోడియం, రైబోఫ్లావిన్, ఇనుము, విటమిన్ బీ ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.
విరివిగా యాంటీ ఆక్సిడెంట్లు..
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషించే యాంటీ ఆక్సిడెంట్లు.. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవారిలో విరివిగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా మానసిక ఒత్తిడి భారీగా తగ్గిందని, వీరిలో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. మెదడు పనితీరులో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు అధికంగా తీసుకోవడంతో మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడిందని వెల్లడించారు.
లాభాలు ఎన్నో
శాకాహారం తీసుకోవడం వల్ల మానసికపరమైన లాభాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి లాభాలు చేకూరుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులను మన ఆహారంలో భాగం చేస్తే డిప్రెషన్, యాంగ్జయిటీ దరిచేరవని చెప్పొచ్చు.
– డాక్టర్ వరలక్ష్మి మంచన, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment