National Nutrition Week: నీరసమూ నిద్ర వదలగొట్టండి | National Nutrition Week: Housewives are lethargic due to malnutrition | Sakshi
Sakshi News home page

National Nutrition Week: నీరసమూ నిద్ర వదలగొట్టండి

Published Sat, Sep 3 2022 12:11 AM | Last Updated on Sat, Sep 3 2022 12:11 AM

National Nutrition Week: Housewives are lethargic due to malnutrition - Sakshi

సోఫా కనిపిస్తే నడుము వాల్చాలనిపిస్తోందా? ఏ పనీ చేయలేని నీరసం ముంచుకు వస్తోందా? ఇదేమైనా పోస్ట్‌ కోవిడ్‌ లక్షణమా? మరేదైనా సమస్యా? ఇటీవల గృహిణులు నీరసాన్ని ఫిర్యాదు చేస్తున్నారు. పని మాని నిద్ర పోవడానికి ఇష్టపడుతున్నారు. దీనికి పోషకాహార లోపం ఒక కారణం. ఇతర కారణాలు కూడా ఉంటాయి. గృహిణి నీరసంగా ఉంటే ఇల్లు నడవదు. లేవండి. చలాకీగా మారండి.

‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌’ అన్నాడు మహాకవి గురజాడ. ఆయన బాధపడింది తగినంత పౌష్టికాహారం లేని తన కాలపు మనుషులను చూసే. సరైన ఆహారమే శక్తి. సరికాని ఆహారం నీరసం. ఫుల్లుగా తిన్నా అసలు తినకపోయినా విలోమ ప్రతిఫలం వస్తుంది. అతి నిద్ర, నీరసం ఇంటి సభ్యులకు ముఖ్యంగా గృహిణులకు ఉంటే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

కోవిడ్‌ తర్వాత చాలా ఇళ్లల్లో స్త్రీలు నీరసం అని అంటూ ఉన్నారు. కోవిడ్‌ బారిన పడ్డ పిల్లలు కూడా అప్పుడప్పుడు నీరసం అని అనువుగాని సమయాలలో నిద్ర అని అంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ తగిన పౌష్టికాహారంతో ఎదుర్కొనవచ్చు. ఇప్పుడు దేశంలో పౌష్టికాహార చైతన్యం కోసం కోసం సెప్టెంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు ‘పౌష్టికాహార వారోత్సవం’ జరుగుతుంది. సరిౖయెన ఆహారంతో నీరసాన్ని ఎదుర్కోవడం ముఖ్యం.

సమతుల ఆహారం: మధుమేహం, గుండె, బి.పి, స్థూలకాయం... వీటిని అదుపు చేసే ఆహారం తినడం గురించి కొందరు శ్రద్ధ పెడతారు. కాని సమగ్రంగా శరీరాన్ని చురుగ్గా ఉంచే ఆహారాన్ని పట్టించుకోరు. అసమతుల ఆహారం శరీరానికి నీరసం తెస్తుంది. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం అతిగా తింటే మందకొడితనం వస్తుంది. అది కూడా ఒక రకమైన అలసట కలిగిస్తుంది. కేల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్లు ఇవన్నీ తగినంతగా తీసుకుంటే సరైన నిద్ర పడుతుంది. తిన్నది ఒంటికి పట్టి ఉదయానికి హుషారు వస్తుంది. లేకుంటే నిద్ర సరిగ్గా పట్టదు. మరుసటి రోజు మత్తు, అలసట, నీరసం ఉంటాయి.

జొన్నలు, కొర్రలు, గ్రీన్‌ టీ: నిదానంగా జీర్ణమయ్యే జొన్నలు, కొర్రలు మంచివి. చికెన్, చేపలు మేలు చేస్తాయి. పాలు, పెరుగు, గుడ్డు, సోయా, పెసలు, అలసందలు ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరెంజ్, జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీలు నీరసాన్ని, కీర మలబద్ధకాన్నీ తొలగిస్తాయి. అరటిపండు నీరసానికి బద్ధ విరోధి. బ్రొకోలి, క్యాప్సికమ్, క్యారెట్, కాలిఫ్లవర్, టొమాటోలు ఇవి ఉన్న కూరలు ముఖ్యం. ఆకుకూరలు పెంచాలి.  మజ్జిగ బాగా తీసుకోవాలి.  జొన్న రొట్టె, జొన్న రవ్వ ఒక పూట అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పోషకాలనిస్తాయి. గ్రీన్‌ టీ మిమ్మల్ని ఎనర్జిటిక్‌ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచడంతో పాటు అలసటను తొలగిస్తుంది.

మందులు: కొన్ని రకాల మందులు కూడా నిద్ర లేమికి, నీరసానికి కారణం అవుతాయి. బి.పి, యాంగ్జయిటీ, యాంటీ డిప్రెసెంట్లు వంటివి నిద్రకు విఘాతం కలిగిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు డాక్టర్‌ను కలిసి వాడుతున్న మందులు చెక్‌ చేయించి వాటి మోతాదును సరి చేసుకోవాలి. నిద్ర సమస్యలు ఉంటే మందులు మార్చే వీలుంటే మార్చుకోవాలి.
ఆహారం, అలవాట్లు ఇవే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గృహిణి ఆరోగ్య బాధ్యత గృహిణిది మాత్రమే కాదు. కుటుంబానిది. అందరూ కలిసి ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి.                           

తగినంత నీరు, నిద్ర:
జీవక్రియలకు నీరు అవసరం. జీవక్రియలు జరిగే కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు నీరు తీసుకోవాలి. లేదంటే శరీరంలో రసం పోయి నీరసం వస్తుంది. అలాగే సరిౖయెన నిద్ర కోసం పూర్తిగా ప్రయత్నించాలి. అలజడి, ఒత్తిడి, అనవసర ఆలోచనలు నిద్రకు దూరం చేస్తాయి. నిద్ర లేకపోతే ఆరోగ్యం ఉండదు. కనుక రోజంతా ఎంత పని, చికాకులు ఉన్నా నిద్రా సమయంలో మంచి సంగీతం వింటూ, కుటుంబ సభ్యులతో మంచి మాటలు చెబుతూ, శుభ్రమైన పక్క మీద నిద్ర పోవాలి. అదే నీరసానికి సరైన విరుగుడు. నిద్ర పోయే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగితే మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement