అకస్మాత్తుగా వచ్చే పంటి నొప్పితో ఎంతటి వారైనా విలవిల్లాడిపోతారు. ఎక్కువగా రాత్రుళ్లు మొదలయ్యే పంటినొప్పి కొన్ని గంటల పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ సమయంలో తక్షణం నొప్పి నుంచి ఉపశమనం అందించే మందు కోసం చూస్తాం. ఆ తర్వాత వైద్యుడి వద్దకు వెళతాం.
తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు...
పంటినొప్పి బాధిస్తున్నప్పుడు తక్షణం నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ రిలీఫ్ జెల్స్ ఉపయోగపడతాయి. ఇందులో ఇజినాల్, కర్పూరం, పుదీనా ఉంటాయి. ఈ జెల్‌ను పన్ను నొప్పి ఉన్న చోట ఒక చుక్క వేసి కాసేపు మర్ధన చేసినట్లయితే మూడు నిమిషాల్లోనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇజినాల్ అనస్థెటిక్‌గా, యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. అయితే తక్షణ ఉపశమనం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. చికిత్స కాదు. చికిత్స కోసం దంతవైద్యుని సంప్రదించి కారణం తెలుసుకుని చికిత్స తీసుకోవాలి.
►పంటినొప్పి ఉన్నవారు ఒక గ్లాసు వేడినీటిలో చెంచా ఉప్పును కలిపి, ఆ నీటితో నోటిని బాగా పుక్కిలిస్తే పంటి నొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతాయి. ఉప్పునీరు ఒక సహజమైన మౌత్ వాష్‌లా బ్యాక్టీరియాపై దాడిచేసి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
►కొన్ని మిరియాలను లేదా లవంగాలను మెత్తగా నూరి దానికి కొన్ని నీళ్ళు చేర్చి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుని కొద్దిగా తీసుకొని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పిని తగ్గిస్తుంది.
►లవంగాల్ని మెత్తగా నూరి దానిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పి తగ్గిపోతుంది. లవంగాల బదులుగా లవంగ నూనె తీసుకొని దానిని దూదికి అడ్డుకొని ఆ దూదిని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.
►క్లోవ్ ఆయిల్ పేరుతో లవంగనూనె చిన్న చిన్న సీసాలలో మెడికల్ షాపుల్లోనూ, సూపర్ బజార్‌లలోనూ కూడా దొరుకుతుంది.
►కొంచెం దూదిని తీసుకొని దానిని నీటిలో తడిపి తరువాత బేకింగ్ సోడాలో ముంచి నొప్పి ఉన్న పంటిపైన ఉంచితే నొప్పి తగ్గిపోతుంది.
పంటి నొప్పి బాధించకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా డెంటిస్ట్ చెకప్ చేసుకోవాలి. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు దంతాలను క్లీన్ చేయించుకోవాలి. రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలను తిన్న తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించి ఉమ్మేయడం వల్ల దంతసమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment