కథ: అమ్మమ్మని పంపించెయ్యాలి! | Olluri Vijayakumar Ammammani Pampincheyyali Telugu Short Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

కథ: అమ్మమ్మని పంపించెయ్యాలి!

Published Sun, Oct 24 2021 1:52 PM | Last Updated on Sun, Oct 24 2021 2:36 PM

Olluri Vijayakumar Ammammani Pampincheyyali Telugu Short Story In Funday Magazine - Sakshi

శేఖరం మావగారు వుత్తరం రాశారు.
‘అమ్మాయి పురుడోసుకుని ఇంటికొచ్చేసిందన్నమాట. సంతోషం. ఇంతకీ పాపెవరి పోలికో. 
రెండో కాన్పు కదా, పెద్దాడితో పాటు, చంటిదాన్ని చూసుకోడం కష్టమేనోయ్‌. రేపు దశమినాడు సర్కారుకి బయల్దేరుతుంది మీ అత్తగారు. స్టేషన్‌లో దింపుకో. కొన్నాళ్ళు సాయం మీకు. పొలం పనులు అవీ అయాక మనవరాలిని చూడ్డానికొస్తాను’ చదువుకొని ‘అమ్మయ్యా’ అనుకుంటూ  భార్యా భర్తలిద్దరూ 
అప్పుడే బరువు తీరినట్టు నిట్టూర్చారు. 


‘ఒరేయ్‌ సుబ్బిగా, రేపు అమ్మమ్మోస్తోందిరా ’
ఆరేళ్ళ సుబ్బిగాడు అమ్మ మాటలకి తెగ సంతోష పడిపోయాడు. వాడికి అమ్మమ్మంటే మహాయిష్టం. సెలవల్లో అమ్మమ్మ ఎంతమంచిదో. ఊరెళ్తే ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుగ్గలు నిముర్తుంది. తాతయ్య పోలికే అంటూ. ‘పోలికంటే..’  సుబ్బిగాడికి తెలీదు. అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులిచ్చే అమ్మమ్మ బాగుంటుంది. వెధవకి రేపు తెల్లారేదేమో!  
∙∙ 
అమ్మమ్మ రైలు దిగింది. నాన్న బెడ్డింగు దింపాడు.
‘ఆరి భడవా నువ్వూ వచ్చావ్‌..!’ సుబ్బిగాడి తల నిమిరింది అమ్మమ్మ.
రిక్షాలో అమ్మమ్మతో మాటలే మాటలు.. ‘అమ్మమ్మా, మాయింట్లో ఓ చెల్లాయుంది. చూపిస్తా రా. అదెప్పుడూ నిద్దరే అమ్మమ్మా..’ అంటూ!
∙∙ 
అమ్మమ్మ యింట్లోకి రావడం, గబగబా స్నానం చేసేయడం, కాఫీ కూడా తాగకుండా చంటిదాన్ని ఎత్తేసుకోడం.. ‘చిన్నది ఎంత బావుందో’ అంటూ! 
 అమ్మమ్మ ముద్దులు దానికెళిపోతున్నాయ్‌. వాడికి లేకుండా ఎక్కడైపోతాయో అని భయం సుబ్బిగాడికి. 
’అమ్మమ్మా.. ’ చెయ్యి పట్టుకు లాగబోతే, ‘అబ్బా ఉండొరేయ్‌..’ అమ్మమ్మ.  లెఖ్ఖ చెయ్యదే !
∙∙ 
‘లక్ష్మీ మీరు భోంచెయ్యండి తాపీగా! నేను చంటిదాని దగ్గర ఉంటాను. నాకిప్పుడు ఆకల్లేదు. తరవాత తింటాలేవే!’ అమ్మమ్మ. చంటిది ఏడుస్తుంటే అమ్మమ్మే అన్నీను. అసలు అమ్మనే దగ్గరికి రానివ్వట్లే! పాలకి తప్ప! 

సుబ్బిగాడికంతా కొత్తే మరి. ఆ రాత్రి అమ్మమ్మ పక్కలోకి దూరాడా.. చెల్లాయ్‌ కుయ్‌ మన్నా  కయ్‌ మన్నా ముసలమ్మ లేచిపోవడం.. ‘హాయి రావే హాయి.. ఆపదలు గాయీ’ అంటూ జోకొట్టేడం!
యెక్కడా, మనవడిని సరిగ్గా పట్టించుకోదే!

చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!
∙∙ 
సుబ్బిగాడు లేచేసరికి అమ్మమ్మ కనపడలేదు. బాత్రుంలోంచి చెల్లాయ్‌ యేడుపూ, వెళ్లిచూస్తే ఇంకేముంది.. అమ్మమ్మ పీట మీద కూర్చుని, కాళ్ళ మధ్య చెల్లాయిని పడుకోపెట్టేసింది. ఒళ్ళంతా యేదో రాసేసి, కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నా వినకుండా వేడి వేడి నీళ్లు పోసేయడమే! ఎప్పుడూ చూడని సుబ్బిగాడికి భయం వెయ్యదూ! వాడు చూసిందల్లా.. అమ్మ పాపని టబ్బులో కూర్చోపెట్టి, చక్కగా నీళ్లతో తుడిచేది, 
యిలా ఎప్పుడూ ఏడిపించలేదు. ‘అమ్మా.. చూడు.. అమ్మమ్మ చెల్లాయిని ఏడిపింస్తోది వేన్నీళ్ళు పోసేసి..’ 
అమ్మకి వంటింట్లో కాఫీలు కలపడమే పని!
 ‘నీళ్లు పోస్తోంది.. ఏంకాదులేరా’ నవ్వుతోంది పైపెచ్చు.
సుబ్బిగాడికిదేం నచ్చలేదు 
∙∙ 
‘మాచమ్మా.. ఎప్పుడొచ్చావ్‌?’ పక్కింటి పిన్నిగారు పిలవకుండానే వచ్చేస్తుంది.  నిద్ర పోతున్నా చెల్లాయిని లేపేసి, ఏడిపించీడమే! తాను ఎత్తుకుంటానంటే ఒప్పుకోదు.. ‘వెధవయ్యా పడేస్తావ్, మట్టి చేతులూ నువ్వునూ’ అంటుంది. ఎప్పుడో ఎవరూ చూడకుండా ఎత్తేసుకోవాలి 
‘అన్నట్టు మాచమ్మా, సుబ్బిగాడు.. చంటిదాని కాళ్ళావేళ్ళా పడిపోడమేనేవ్‌! వాళ్ళమ్మని యేపనీ చెయ్యనీయడే వీడు చూశావా!’
‘సుబ్బాయిని ఇక్కడుంచేసి, చంటిదాన్ని మీ ఊరు తీసుకుపోతావేంటి!’
ఉలిక్కిపడ్డాడు సుబ్బిగాడు. ఇదా వీళ్ళ ప్లాను, అమ్మమ్మ ఇందుకా వచ్చింది? పాపం నాన్నకి తెలీక స్టేషన్‌ నుంచి అమ్మమ్మని ఇంటికి తెచ్చేశాడు.. నాన్నొస్తే చెప్పాలి!’ 
∙∙ 
అమ్మమ్మ తెచ్చిన చేగోడీలు కరకరలాడుతున్నాయ్‌. ఉయ్యాల్లో చెల్లాయ్‌ ‘ఊ.. ఊ’ అంటోంది. పాపం దానికెవరు పెడతారు?  చిన్నముక్క నోట్లో పెడితే సంతోషిస్తుంది. సుబ్బిగాడు.. అలా ముక్కవిరవడం, చెల్లాయ్‌ దగ్గరికెళ్ళడం.. ‘ఇందా తింటావా’ అంటూ.. 
ఎక్కడనించి వచ్చిందో అమ్మమ్మ.. సుడిగాలిలా, ‘ఒరే ఒరే’ అంటూ ఠక్కుమని లాగేసుకుంది. ‘చిన్న వెధవ..∙వీడితో ప్రమాదమే సుమీ.. ఇద్దరినీ కనిపెట్టుకునుండాలి!’
మొదటిసారి సుబ్బిగాడు కోపంగా చూశాడు అమ్మమ్మని!
∙∙ 
‘నాన్నా..ఇవాళేం, పక్కింటి పిన్నిగారూ..’ అంటూ జరిగిందంతా చెప్పేశాడు సుబ్బయ్య రహస్యంగా చెవులో. 
కష్టపడి చెబితే, నాన్న నవ్వడం.. ‘అత్తయ్యగారూ విన్నారా..’ అంటూ అంతా చెప్పేశాడు కదా. 
ఇంకా అంటాడూ, ‘మీరు చంటిదాన్ని పట్టుకెళ్ళకండీ ’
అమ్మమ్మ నవ్వింది.. ‘అంతా వాడిష్టమే! మీరు కావాలంటే ఇంకో పిల్లని తెచ్చుకోండి. అక్కడ తాతయ్యకి కూడా దీంతో తోస్తుంది. సమయానికి గ్యాపకం చేశావ్‌!’
సుబ్బాయ్‌కి ఏం అర్థం కావట్లేదు. 
‘అమ్మమ్మా, పాపాయికి రైల్లో టికెట్టుకొనాలి తెల్సా?’ వాడి ధీమా నాన్న కొనడని. 
అమ్మ నవ్వుతూ, సుబ్బాయ్‌ని దగ్గరకి తీసుకుంది.. ‘మన అమ్మమ్మే కదరా, వాళ్ళింట్లో పిల్లల్లేరుగా!’
∙∙ 
‘అన్నట్టు పాపాయికి ఎంపేరు పెడతావు లక్ష్మీ...?’ అందరూ ఉండగా అడిగింది అమ్మమ్మ.
‘మీ అత్తగారి పేరా? ఆడపడుచు పేరా?’
‘అలాటి ఆనవాయితీ అయితే లేదులే అమ్మా. మీ అల్లుడు ‘నిష్క’ అని అంటారు, నేనేమో 
‘కృతి’ అనుకుంటున్నా’ అంది అమ్మ.
 సుబ్బాయ్‌కి సలహా ఇవ్వాలనిపించింది. రోజూ కథలు చెబుతూ బడికి తీసుకెళ్లే వెంకాయమ్మ అంటే మనవాడికిష్టం. వెంకాయమ్మ ఎవరూ చూడకండా పుల్లైస్‌ కొనిపెడుతుంది మరి. 
‘అమ్మమ్మా.. నే చెప్పనా?’ ఉత్సహంగా సుబ్బిగాడు. ‘వెంకాయమ్మ పేరు బెస్టు కదా!’
‘ఏడిశావ్‌ బోడి వెధవా.. కావాలంటే నీ పిల్లకి వెంకాయమ్మా అని పెట్టుకుంటావో, పిచ్చమ్మా అనిపెట్టు కుంటావో నీఇష్టం!’
అమ్మమ్మ మాటలకి పిన్నిగారూ, నాన్నా అంతా నవ్వడమే. ‘లక్ష్మీ..  ఇంకో కూతుర్ని కనవే, నీ కొడుకు కోరిక తీర్చు’ అంది. 
సుబ్బిగాడు బుంగమూతి పెట్టాడని చెప్పాలా ఇంకా. 
∙∙ 
సుబ్బాయ్‌కి అమ్మమ్మ ముచ్చట దాదాపు తీరిపోయింది. అమ్మమ్మ వచ్చిందగ్గర నుంచీ ఇదే వరుస. 
 వేన్నీళ్లు పోసి పొద్దున్నే చెల్లాయిని ఏడిపించేడం, కంట్లో వేలు పెట్టి యేదో నల్లగా రాసీడం, పాపం కుంపటి కింద పొగపెట్టడం, ఎత్తుకుంటాను మొర్రో అంటే పడేస్తావ్‌ దూరం నుంచి ఆడించారా..అని కేకలేయడం..
పాపం, చెల్లాయ్‌ పుట్టేవరకు అమ్మమ్మ మంచిదే. అయితే ఇప్పుడు మారిపోయింది. చెల్లాయ్‌ని ఊరికి తీసుకుపోతుందేమో! ఆఖరికి వెంకాయమ్మా అని కూడా పిలవకూడదట. 
ఒక్కటే మార్గం తోచింది వాడి బుల్లి బుర్రకి. రాత్రి.. మెల్లిగా నాన్న దగ్గరకు చేరాడు. 
‘నాన్నా .. ’
‘ఎట్రా సుబ్బుడూ’
‘అమ్మమ్మని పంపించేద్దాం నాన్నా..  ఎప్పుడూ చెల్లినొదలట్లేదు. మనం పడుకున్నాక మెల్లిగా ఊరికి పట్టుకుపోతుందేమో!’
‘ఎలారా.. నేను టికెట్టు కొనాలిగా! పర్వాలేదు పడుకో. మన అమ్మమ్మ మంచిదిరా!’ 
‘పక్కింటి పిన్నిగారు కొంటుందేమో నాన్నా టికెట్టు!’
‘ఆవిడ దగ్గర డబ్బులెక్కడివిరా? పోయి అమ్మమ్మ దగ్గరే పడుకో గట్టిగా పట్టుకుని!’
సుబ్బాయ్‌ గొణుగుతూ, మళ్ళి అమ్మమ్మ పక్కకే చేరాడు. అమ్మమ్మ సుబ్బాయ్‌ని దగ్గరకి తీసుకుంది ప్రేమగా. 
సుబ్బాయ్‌కి నిద్దట్లో కల..  రైలొచ్చేసింది. అమ్మా, నాన్నా.. అమ్మమ్మని రైలెక్కించేసున్నారు.. రైలు కూత కూ.. ‘అమ్మమ్మా..  నువ్వెళ్ళకమ్మమ్మా.. వెళ్ళకు.. నేనూ నీతో వస్తా..’
‘వెధవకి కలవరింతలు కూడాను. ఎక్కడికి వెళ్లనోరెయ్‌! బజ్జో..’ అమ్మమ్మ మరింత దగ్గరకు తీసుకుంది. 
అమ్మమ్మ పక్కలో వెచ్చగా, భద్రంగా సుబ్బిగాడు!

- వల్లూరి విజయకుమార్‌

చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement