అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పినా నమ్మడం లేదా? | psy vishesh Column On Illness Anxiety Disorder Symptoms and Causes | Sakshi
Sakshi News home page

అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పినా నమ్మడం లేదా?

Published Fri, Dec 29 2023 3:05 PM | Last Updated on Fri, Dec 29 2023 5:06 PM

psy vishesh Column On Illness Anxiety Disorder Symptoms and Causes - Sakshi

రామారావు శ్రీకాకుళం లోని ఒక గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అయనకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. అతను గత కొద్ది నెలలుగా ఆరోగ్యం పాడై పోయిందని కుమిలిపోతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. చెప్పిన పరీక్షలన్నీ చేయించాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ, తనకు ఏదో అయిపోతుందని భయపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. మర్నాడు మధ్యాహ్నం వారి గ్రామానికి దూరంలో విషం తీసుకుని చనిపోయి కన్పించాడు.

ఇది ఒక ఆత్మహత్య వార్తలా చదివేసి వదిలేస్తాం. కానీ ఇలాంటి వార్తలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మనందరికీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. డాక్టర్ ను కలుస్తాం, ఆయన చెప్పిన మందులు వాడతాం, ఉపశమనం రాగానే దాని గురించి మరిచిపోతాం. 

కానీ అనారోగ్యం ఉందనే భయంతో ఆస్పత్రుల చుట్టూ తిరగడం, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని వైద్యులు తేల్చి చెప్పినా భయం వదలకపోవడం.. ఒక మానసిక రుగ్మతకు సంబంధించిన లక్షణాలు. దీన్ని illness anxiety disorder (ఐఏడీ) లేదా Hypochondriasis అంటారు. మనకు లభిస్తున్న సమాచారాన్ని బట్టి రామారావు కూడా ఐఏడీ తో బాధపడుతున్నాడని అంచనా వేయవచ్చు. 

దీని లక్షణాలు...
• తీవ్రమైన అనారోగ్యం వస్తుందని లేదా ఉందని భయపడటం ప్రధాన లక్షణం. 
• చిన్న లక్షణం కనిపించగానే పెద్ద జబ్బు వచ్చిందని అనుకుంటారు. .ఉదాహరణకు దగ్గు రాగానే ఊపిరితిత్తుల కేన్సర్ ఉందేమోనని భయపడతారు. . 
• ఈ అనారోగ్యం కూడా ఒక్కోసారి ఒక్కొక్కటిగా అపోహ పడుతుంటారు. 
• తన జబ్బేమిటో తెలుసుకునేందుకు పదే పదే వైద్యులను కలుస్తుంటారు. 
•  ఏ జబ్బూ లేదని డాక్టర్ చెప్పినా, పరీక్షల్లో తేలినా వారికి ఉపశమనం ఉండదు. ఈ డాక్టర్ సరిగా పరీక్షించలేదంటూ మరో డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు.
•  జబ్బు బారిన పడతామనే ఆందోళనతో కొందరు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరినీ కలవకుండా ఇంటికే పరిమితమవుతారు.
ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో చెప్పలేం. సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమై వయసుతో పాటు తీవ్రతరమవుతుంది. బాల్యంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిన వారికి, లేదా ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందే తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన వారికి లేదా బాల్యంలో ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్ అబ్యూజ్ కు గురైన వారికి  ఈ రుగ్మత వచ్చే అవకాశాలు ఎక్కువ. 
దీని ప్రభావం వల్ల నిరంతరం అనారోగ్యం గురించే ఆలోచిస్తూ, తమ జబ్బుకు పరిష్కారం దొరకలేదనే భయంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. అది యాంగ్జయిటీ డిజార్డర్ లేదా డిప్రెషన్ లాంటి మానసిక రుగ్మతలకు దారితీయవచ్చు. వాటివల్ల ఆత్మహత్య ఆలోచనలు పెరిగి, చివరకు బలవన్మరణానికి పాల్పడవచ్చు. రామారావు విషయంలో ఇదే జరిగి ఉండవచ్చు. 
అందువల్ల ఎవరైనా పదే పదే డాక్టర్లను సంప్రదిస్తున్నా, ఏ జబ్బూ లేదని చెప్పినా సమాధానపడకపోతే అది మానసిక సమస్యని గుర్తించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సైకోథెరపీ ద్వారా అనారోగ్యం పట్ల ఉన్న భయాలను తొలగించుకునేందుకు సహాయపడతారు.  
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement