బ్యాడ్‌ ఎయిర్‌ ర్యాడ్స్‌ ఫైర్‌... | Reactive airways dysfunction syndrome (RADS) | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ ఎయిర్‌ ర్యాడ్స్‌ ఫైర్‌...

Published Tue, Oct 22 2024 10:33 AM | Last Updated on Tue, Oct 22 2024 11:23 AM

Reactive airways dysfunction syndrome (RADS)

ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వాతావరణపు నాణ్యతను ‘ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌’ అనే సూచికతో నిర్ణయిస్తారు. సంక్షిప్తంగా ‘ఏక్యూఐ’ అంటూ  పిలిచే వాతావరణ నాణ్యత బాగుంటే మన ఆరోగ్యాలూ బాగుంటాయి. వాతావరణ కాలుష్యం పెరుగుతున్న కొద్దీ... అంటే ఏక్యూఐ తగ్గుతున్న కొద్దీ ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా వాతావరణపు నాణ్యత తగ్గడం వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది ‘రియాక్టివ్‌ ఎయిర్‌వేస్‌ డిస్‌ఫంక్షన్‌ సిండ్రోమ్‌ (ర్యాడ్స్‌). ఈ ర్యాడ్స్‌ గురించి తెలుసుకుందాం.

వాయుకాలుష్యం లేదా వాతావరణంలో సరిపడని పదార్థాలతో ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయన్న విషయం తెలసిందే. కానీ అందరికీ అంతగా తేలియని, ఆస్తమాలాగే అనిపించే మరో జబ్బే ‘రియాక్టివ్‌ ఎయిర్‌వేస్‌ డిస్‌ఫంక్షన్‌ సిండ్రోమ్‌’ (ర్యాడ్స్‌). ఇందులోనూ ఆస్తమాలోలాగే దగ్గు ఆయాసం వస్తుంటాయి. అయితే ఈ వ్యాధి లక్షణాలలో ప్రధానంగా పొడిదగ్గు కనిపిస్తుంటుంది.

ర్యాడ్స్‌ ముప్పు ఎక్కడెక్కడంటే... 
గతంతో ప్రోలిస్తే ఇటీవల ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండే పారిశ్రామిక వాడలతో పాటు కాలుష్యం ముప్పు పెరుగుతున్న కొద్దీ నివాస్ర పాంతాల్లోనూ ఇది కనిపిస్తోంది. పారిశ్రామికప్రాంతాల్లో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడల్లా ర్యాడ్స్‌ తన ప్రతాపం చూపుతుంటుంది. ఉదాహరణకు... చాలా ఏళ్ల కిందట భోపాల్‌లో మిథైల్‌ ఐసో సయనేట్‌ విషవాయువుల లీకేజీ జరిగినప్పుడు ఆ ప్రమాదం దాదాపు రెండువేల మందిప్రాణాలను తీసుకుంది. 

నేరుగా విషవాయువులు పీల్చడం మాట అటుంచి... ఆ వాయువుల ప్రభావంతో పల్మునరీ కణజాలంలో వాపు (పల్మునరీ ఎడిమా)తో పాటు ‘ర్యాడ్స్‌’ వ్యాధి కూడా అక్కడి మరణాలకు ఓ ప్రధాన కారణం. కేవలం పారిశ్రామిక ప్రమాదాలే కాకుండా రైతులు వేసే మంటలు కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే... కొన్నాళ్ల కిందట పంజాబ్, హర్యానాప్రాంతాల్లో గోధుమ పంట కోతల తర్వాత మిగిలిప్రోయిన గడ్డిని కాల్చినప్పుడు ఢిల్లీలోని వాతావరణం భారీగా కలుషితమైప్రోయి, పట్టపగలు సైతం వీధులూ, రోడ్లూ కనిపించనంతటి దట్టమైన కాలుష్యం పేరుకుప్రోయిన సంగతి చాలామందికి తెలిసిందే. 

ఇలాంటి కాలుష్య వ్యాప్తి సందర్భాల్లోనూ ర్యాడ్స్‌ విజృంభించింది. అలాగే కొన్ని  మిల్లుల నుంచి క్లోరిన్‌ గ్యాస్‌ విడుదలైనప్పుడూ ర్యాడ్స్‌ తన ప్రతాపం చూపింది. అనేక అధ్యయనాల ప్రకారం అలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న అనేకప్రాంతాల్లో ర్యాడ్స్‌ విజృంభించింది. కేవలం పారిశ్రామిక ప్రమాదాలప్పుడే కాకుండా వాతావరణం బాగా కలుషితమైనప్పుడు కూడా ఇది కనిపిస్తుండటం మామూలే. మరి వాతావరణం కలుషితమైనట్లు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం.

కాలుష్య తీవ్రత తెలుసుకోవడం ఇలా... 
వాతావరణపు నాణ్యాతను ఈ కింద పేర్కొన్న ఐదు అంశాలు నిర్ణయిస్తాయి. అవి... 

1) కింది వాతావరణంలో ఉండే ఓజోన్‌ (గ్రౌండ్‌ లెవల్‌ ఓజోన్‌)
2) గాలిలో ఉండే రేణువులు (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ – పీఎం). (గాలిలో ఓ మోస్తరు సన్నటివి మొదలుకొని, అతి సన్నగా ఉండే రేణువులు ఉంటాయి. ఉదాహరణకు 10 మైక్రాన్ల సైజు మొదలుకొని 2.5 మైక్రాన్ల సైజు వరకు).   3) కార్బన్‌ మోనాక్సైడ్‌  4) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌  5) నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ గాలి/వాతావరణ నాణ్యత తాలూకుప్రామాణికతను నిర్ణయించేందుకు... ఏఐక్యూ స్కేల్‌ మీద  0 – 500  వరకు కొలత ఉంటుంది. ఉదాహరణకు ఆ కొలత 0 – 50 వరకు ఉంటే అక్కడి గాలి నాణ్యత ‘చాలా బాగుంద’ని చెప్పుకోవచ్చు. అదే 51 – 100 ఉంటే ‘ఓ మోస్తరు’గా ఉందని చెబుతారు. ఇక ఆ కొలత 100కు పైగా ఉంటే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పవచ్చు. గాలి కాలుష్యాల తీవ్రత 100కు మించి ఉన్నప్పుడు... వాతావరణంలోని చిన్నపాటి తేడాలకే స్పందించేవారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఆ కొలతగానీ 300కి మించితే అది ఎవరికైనా ప్రమాదకరం అని చెప్పవచ్చు. 

గాలిలోని కాలుష్యం తీవ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి యుక్తవయస్కులు (అడల్ట్స్‌) మొదలుకొని అందరిలోనూ శ్వాస, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఉదాహరణకు 2012లో జరిగిన కొన్ని సైంటిఫిక్‌ అధ్యయనాల ప్రకారం... కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ డై ఆక్సైడ్, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వంటి కాలుష్యాల వల్ల గుండెప్రోటు వచ్చే ముప్పు 4.5% అధికంగా ఉంటుందని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో వెలువరించిన ఓ నివేదిక ప్రకారం ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మరణాలు కేవలం వాయుకాలుష్యం కారణంగానే జరిగాయంటూ పేర్కొంది.  

పిల్లలకూ తప్పని కాలుష్య కాటు... 
చిన్నారుల్లో దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్లలో నివసించే పిల్లల్లో లంగ్స్, మెదడు ప్రభావితమైనందున శిశుమరణాల రేటూ పెరుగుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు... చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా కారణంగా ఆ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది అని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూనిసెఫ్‌ నివేదికల ప్రకారం... దాదాపు 30 కోట్ల మంది పిల్లల వాతావరణ పరంగా అత్యంత ప్రమాదకరమైన కాలుష్యప్రాంతాల్లో నివసిస్తున్నారు. దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం ఏమిటంటే... ఇందువల్ల ఏటా ఆరు లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడుతున్నారని అంచనా. 

ర్యాడ్స్‌ నిర్ధారణ ఇలా : ఛాతీ ఎక్స్‌–రే, స్పైరోమెట్రీ, రక్త పరీక్షలతో ‘ర్యాడ్స్‌’ను నిర్ధారణ చేస్తారు. 
చికిత్స : కాలుష్యానికి గురికాకుండా ఉండటమే ‘ర్యాడ్స్‌’కు ప్రధాన చికిత్స. ఒకవేళ కాలుష్యానికి గురైతే గ్లూకోకార్టికాయిడ్స్, బ్రాంకోడయలేటర్స్‌ వాడుతూ ఆస్తమా తరహాలోనే దీనికి చికిత్స అందించాల్సి ఉంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Advertisement
 
Advertisement
 
Advertisement