దేవుడు, దయ్యం, పాపం, పుణ్యం, ఆత్మ, పరమాత్మ అంటూ మనిషి పుట్టినప్పటి నుంచి తనకు అంతుపట్టని పలు అంశాలపై ఆలోచన చేస్తూనే ఉంటాడు. అయితే ఇలాంటి విషయాలపై ఆస్తికులకు ఉన్నంత ఆసక్తి నాస్తికులకుండదు. మరికొందరేమో సైన్సుకు, మత విశ్వాసాలకు ముడిపెట్టి రెండిటిలో ఏకత్వం సాధించాలని యత్నిస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రాచీన కాలం నుంచి మనిషికి తన భవిష్యత్ తెలుసుకోవడంపై ఆసక్తి అధికం. ఈ కాన్సెప్టులోంచి పుట్టిందే పునర్జన్మని కొందరి విశ్వాసం. భవిష్యత్‌లో మనం మళ్లీ జన్మిస్తామన్న ఆశ, పాపాలు చేస్తే మంచి పునర్జన్మ రాదన్న భయం.. ఈ జన్మలో మనం మంచి పనులు చేసేందుకు ప్రేరేపిస్తాయి. కానీ మనిషి ఎదిగేకొద్దీ వీటిపై నమ్మకం కోల్పోతున్నాడు. దీనివల్లనే సమాజంలో పాపభీతి తగ్గిపోతోందని మతాచార్యులు ఘోషిస్తున్నారు. అసలింతకీ పునర్జన్మలుంటాయా? అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న.
మిలియన్ డాలర్ల ప్రశ్న, బహుమతి..
ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం కోసం అక్షరాలా మిలియన్ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధమయ్యాడు అమెరికాకు చెందిన డబ్బున్న ఆసామి రాబర్ట్ బిగిలోవ్. ఆయనకు చెందిన బిక్స్(బిగిలోవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ స్టడీస్) సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పునర్జన్మ నిజమని నిరూపించే సాక్ష్యాలను, థియరీలను వ్యాసరూపంలో పంపాలని, వీటిలో ఫస్ట్ వచ్చిన రచనకు హాఫ్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో 3 కోట్ల 66 లక్షల పై చిలుకు), రెండు, మూడు స్థానాల్లో రచనలకు మిగిలిన హాఫ్ మిలియన్ డాలర్లు ఇస్తామని వివరించింది. మనిషి మరణానంతరం అతని చేతనను సజీవంగా ఉంచడం పై ప్రయోగాలకు ఈ సంస్థను రాబర్ట్ స్థాపించాడు. మరణానంతరం మనిషి చేతన కొనసాగేందుకు పునర్జన్మే మార్గమని, అయితే ఇది నిజమని నిరూపించాలని బిక్స్ తెలిపింది. గతంలో కూడా ఆయన ఇలాంటి వింత పరిశోధనలకు లక్షల డాలర్లు ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచాడు.
విశ్వంలో వేరే గ్రహాల్లో తెలివైన జీవులున్నాయా? యూఎఫ్‌ఓ (ఫ్లయింగ్ సాసర్లు) నిజమేనా? అనే అంశాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఆయన బోలెడు డాలర్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిస్కవరీ సైన్స్, బిగలోవ్ ఏరోస్సేస్ స్టడీస్ అనే సంస్థలను కూడా నెలకొల్పాడు. అయితే ఈ ప్రశ్నలకు ఆయనకు ఏమి సమాధానాలు లభించాయో బయటకు చెప్పలేదు. తాజాగా పునర్జన్మల నిజాన్ని నిరూపించేందుకు పూనుకున్నాడు. తాను తన సొంతవాళ్లు మరణించినప్పుడు అనుభవించిన బాధ నుంచి ఈ ఆలోచన వచ్చిందని, మనం ప్రేమించిన వాళ్లు మననుంచి దూరమైనా ఇంకోచోట ఉంటారనే నిజాన్ని రాబట్టమే తన లక్ష్యమని రాబర్ట్ చెబుతున్నాడు. మరి ఈ యత్నంలో ఎలాంటి ఆన్సర్లు దొరుకుతాయో? కనీసం ఆయన పునర్జన్మ వివరాలైనా తెలుసుకోగలుగుతాడో? లేదో? వేచిచూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment