ముంబైలో గణేశ్ నిమజ్జనం రోజున వేలాది విగ్రహాలు సముద్రం వైపు కదులుతాయి. వాటిలో భారీ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ విగ్రహాల్లో దాదాపు సగం రేష్మ ఖాతు తయారు చేసినవే. తండ్రి మరణించాక గణేశుడి విగ్రహాల తయారీ పరంపరను భుజానికెత్తుకుంది రేష్మ. ఇవాళ ముంబైలో ఆమె నంబర్ 1 గణేశ శిల్పి.
‘మనల్నందరిని దేవుడు తయారు చేశాడు. కాని ఆ దేవుణ్ణి తయారు చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది’ అంటుంది రేష్మ ఖాతు. నలభై ఏళ్ల రేష్మ ఖాతును ముంబైలో ‘మూర్తికార్’ అని పిలుస్తారు. అంటే దేవుని మూర్తుల రూపశిల్పి అని అర్థం. ‘ఇవాళ మా నాన్న నన్ను చూస్తే చాలా ఆశ్చర్యపోయి ఉండేవాడు’ అంటుందామె తండ్రి విజయ్ ఖాతును తలుచుకుని. ఎందుకంటే తండ్రి జీవించి ఉండగా ఆమె ఎప్పుడూ ఆయన వర్క్‌షాప్‌లోకి పెద్దగా అడుగు పెట్టేది కాదు.
ఇవాళ ఆ వర్క్‌షాప్‌కు ఆమే సర్వస్వం. ‘ముంబైలోనే కాదు దేశ విదేశాల్లోనే మా నాన్న విజయ్ ఖాతు చాలా ప్రఖ్యాతుడు. ఇవాళ మనం చూస్తున్న గణేశ్ విగ్రహాల భిన్న రూపాలకు ఆయనే ఆద్యుడు. గతంలో గణేశుడు విగ్రహం అంటే అందరూ కూర్చుని ఉన్న మూర్తే తయారు చేసేవారు. మా నాన్న గణేశుడి చేతులకు, కాళ్లకు కదలికలు తెచ్చాడు’ అంటుంది రేష్మ. 2017లో విజయ్ ఖాతు మరణించాక ఆయన శిల్ప సామ్రాజ్యాన్ని రేష్మ సమర్థంగా నిర్వహిస్తోంది.
సినీ దర్శకురాలు అవుదామని
రేష్మ ఖాతు కుటుంబం తాతల కాలం నుంచి గణేశ్ విగ్రహాల తయారీలో ఉంది. ఆ శిల్పాల తయారీ రేష్మకు సర్వం తెలిసినా తాను మాత్రం సినీ దర్శకురాలు కావాలని ఆ కోర్సులు చేసింది. అయితే తండ్రి హఠాత్ మరణంతో మొత్తం కార్ఖానా స్తంభించింది. ‘మా నాన్న చనిపోయాక ఆయన విలువ మరింత తెలిసింది. ఎందరో మండపాల నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి ప్రతి ఏటా వినాయక చవితికి మీ దగ్గరే విగ్రహాలు తీసుకెళ్లేవాళ్లం... ఇక మీదట కూడా అలాగే చేస్తాం అని చెప్పేవారు. ముంబైలో ప్రఖ్యాతమైన లాల్‌బాగ్, ఖేత్‌వాడి, చందన్‌వాడి, తులసివాడి మంటపాల్లో ప్రతి ఏటా మేము తయారు చేసిన విగ్రహాలే పెడతారు. వీరందరినీ చిన్నబుచ్చడం నాకు నచ్చలేదు. మా మేనమామ నాతో– నువ్వు చేయగలవమ్మా అన్నాడు. ధైర్యంగా మా నాన్న సీట్‌లో కూచున్నాను’ అంటుంది రేష్మ.
మగవాళ్లకు నచ్చలేదు
గత ఐదారేళ్లుగా రేష్మ విజయవంతంగా గణేశ్ విగ్రహాల తయారీని కొనసాగిస్తున్నా ఇంకా ఆ సంగతి మింగుడుపడని మగవారు ఉన్నారు. ‘మా ఫ్యాక్టరీలో శిల్పులు, మౌల్డర్లు, మేనేజర్లు అందరూ నేను బాస్‌గా రావడం చూసి ఆశ్చర్యపోయారు. కొందరు చాలా ఏళ్లుగా మా నాన్న సీట్ మీద కన్నేసి ఉంచారు. వారంతా నేను రావడంతో సహాయ నిరాకరణ చేశారు. నేను శిల్పి కూతురిని. శిల్పం చేయడం నా జీన్స్‌లో ఉంది.
నేనే రంగంలో దిగి కొత్త విగ్రహాలు ఎలా చేయాలో సూచనలు ఇస్తూ సరైన దారిలో కార్ఖానాను పెట్టేసరికి తల వొంచారు’ అంటుంది రేష్మ. పార్వతీదేవి చేతుల్లో గణేశుడు తయారైన చందాన ముంబైలో ఒక స్త్రీ చేతుల మీదుగా ప్రతి వినాయక చవితికి విగ్రహాలు తయారవుతాయి. పూజలు అందుకుంటాయి. గణేశుడి మూర్తుల తయారీలో ఒక స్త్రీ ఈ విధాన ముందుండటం తప్పక సంతోషపడాల్సిన విషయం.
---శభాష్ రేష్మ.
(చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట!అందులో ప్రోటీన్, విటమిన్ బీ..)
Comments
Please login to add a commentAdd a comment