లిప్‌మూమెంట్ ద్వారానే పాఠాలు అర్థం చేసుకుంటూ
ఉపాధ్యాయులు, విద్యార్థుల మన్ననలు పొందుతూ
బంజారాహిల్స్: దేశం కాని దేశం.. ఊరు కాని ఊరు.. మన భాష అసలే తెలియదు.. మాట్లాడడానికి నోరు పెగలదు.. చెవులు వినబడవు.. అమెకున్న గ్రహణ శక్తి సంజ్ఞలు మాత్రమే. మూగ, చెవుడు అయినా కేవలం ఉపాధ్యాయులు చెప్పేది లిప్‌మూమెంట్ ద్వారా గ్రహిస్తూ చదువులో దూసుకుపోతోంది. క్లాస్‌లో ఎప్పుడూ మొదటి స్థానమే. నేపాల్‌కు చెందిన రియా (17) తల్లిదండ్రులు జయన్‌బహదూర్, తల్లి జోగుమాయలు పొట్ట చేతబట్టుకుని ఉపాధి నిమిత్తం 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు.
జయన్ బహదూర్ కుక్‌గా పనిచేస్తుండగా, భార్య మాయ గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రియా పుట్టుకతో మూగ, చెవుడు. తన భావాలను పంచుకోవాలంటే మాటలు రావు, ఇతరులు చెప్పేది వినబడదు. అయితేనేం ఆమెకున్న గ్రహణ శక్తికి తనలోని లోపాలు కూడా చిన్నబోతాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లోని లిటిల్‌స్టార్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది రియా.
ఎప్పుడూ ఫస్టే..
తరగతి గదిలో టీచర్లు చెప్పేది వినబడకపోయినా.. వారి లిప్‌మూమెంట్ ద్వారా ఆ పాఠాలు గ్రహిస్తోంది. ఏమైనా అర్థం కాకపోతే నోట్‌బుక్‌లో రాసి టీచర్లను అడుగుతుంది. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఇక్కడే చదువుతున్న రియా ఎప్పుడూ క్లాస్ ఫస్టే వస్తుందని తెలుగు టీచర్ అనూష తెలిపారు. బ్లాక్‌బోర్డుపై తాము రాసే పాఠాల విషయాలు బాగా అబ్జర్వ్ చేస్తుందని హిందీ టీచర్ అర్షియా పరీ్వన్ తెలిపారు. ఈ బాలిక అంటే మొత్తం స్కూల్ విద్యార్థులకే కాకుండా టీచర్లకు కూడా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారని ఆమె వెల్లడించారు.
నూరు శాతం హాజరు..
వినబడదు..మాట్లాడలేదు..అయినా సరే ఏ ఒక్కరూ ఆమెను హేళనగా చూడరని, క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటుందని స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అస్మతున్నీసా తెలిపారు. ఈ బాలిక అక్క, అన్న కూడా ఇదే పాఠశాలలో చదివారని తెలిపారు. రియాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమె వద్ద ఎలాంటి ఫీజూ తీసుకోకుండానే నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఉచితంగా చదువును అందిస్తున్నట్లు అస్మతున్నీసా పేర్కొన్నారు. కేవలం చదువులోనే కాకుండా పాఠశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని అబ్బురపరిచే నృత్యాలు కూడా చేసి ఆకట్టుకుంటుంది.
క్రాఫ్ట్‌వర్క్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, చార్ట్ తయారీలో కూడా రియా పాల్గొంటూ బహుమతులు సాధిస్తోంది. ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా స్కూల్ అటెండెన్స్‌లో 100 శాతంతో అందరి కంటే ముందుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాదు తమ కంటే బాగా చదవడం, మార్కులు కూడా బాగా రావడం మమ్ముల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని సహచర విద్యారి్థని సౌమ్య చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment