Russia-Ukraine: ‘‘నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ల వయసు ఎంతని అతడు నన్ను అడిగాడు. ఒకరికి 12.. మరొకరికి 14. నాకేమో 16 సంవత్సరాలు అని చెప్పాము. దీంతో అతడు మా అమ్మను ముందుకు రమ్మని పిలిచాడు. కానీ ఆ తర్వాత ఆమెను వెంటనే వెళ్లిపొమ్మని నన్ను దగ్గరకు రమ్మన్నాడు. నాపై బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. దుస్తులు తీసివేయమంటూ బెదిరించాడు.
నేను ఆ పని చేయలేనని చెబితే..‘‘నువ్వు నేను చెప్పినట్లు వింటావా? లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా?’’ అంటూ బెదిరించి మద్యం మత్తులో నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న మరో సైనికుడు అతడిని వారించినా ఫలితం లేకుండా పోయింది’’
నాకు ఇంకా గుర్తు ఉంది. అతడి సహచర సైనికులు అతడిని బ్లూ అని పిలిచారు. అతడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని వారు మాట్లాడుకోవడం విన్నాను. తన పశువాంఛ తీర్చే అమ్మాయి కోసం అతడు ఊళ్లోకి వెళ్లాడని.. ఎవరైతే సులువుగా ‘తన మాట’కు అంగీకరిస్తారో.. వాళ్ల కోసం అతడు ఎంతగానో వెదికాడని చెప్పుకొంటున్నారు.
అసలు మేము ఆరోజు భోజనం కోసం బయటకు వెళ్లి ఉండకపోతే.. అతడి కళ్లల్లో పడేదాన్ని కాదు. అతడు నన్ను కనీసం తాకలేకపోయేవాడు’’ అత్యాచారానికి గురైన ఆరు నెలల గర్భిణి బోరున విలపిస్తూ చెప్పిన మాటలు ఇవి. రష్యా సైనికుల ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‌లోని ఖెర్సన్‌కు చెందిన ఓ 16 ఏళ్ల యువతికి ఎదురైన విపత్కర ఘటన ఇది.
తప్పు ఎవరిది?
యుద్ధం ఎక్కడైనా.. ఎందుకైనా... దాని తాలూకు చేదు అనుభవాలకు ఎక్కువగా బలైపోయేది మహిళలూ, పిల్లలే. పురుషాధిక్య సమాజంలో తన, మన, పర అనే తారతమ్యాలేవీ లేకుండా స్త్రీని విలాస వస్తువుగానో, కోరిక తీర్చే యంత్రంగానో భావించడం తరతరాలుగా అలవాటైపోయింది. అంతేకాదు తమకు నచ్చినట్లు బతికే ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని దిగజార్చడం కూడా ఇందులో భాగమైపోయింది. ఒకవేళ అత్యాచారం జరిగిందని ధైర్యంగా బయటకు చెబితే... ‘నీ తప్పేమీ లేదా’ అన్నట్లుగా చూసే అనుమానపు చూపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఈ ఘటన విషయానికొస్తే... అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎఎన్‌ఎన్ నివేదించిన ఈ కథనంలో.. మద్యం మత్తులో ఉన్న ఓ రష్యన్ సైనికుడు.. 16 ఏళ్ల గర్భిణి అయిన యువతిపై లైంగిక దాడి చేశాడు. ఒకవేళ తన మాట వినకుంటే గొంతునులిమి చంపేస్తానని బెదిరించి మరీ ఆమెపై అకృత్యానికి పాల్పడ్డాడు.
‘ఆమె’ ఏం చెప్పినా చేస్తుందా?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఘటన జరిగిన స్థలంలో బాధితురాలితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు, ఆమె తల్లి కూడా ఉంది. కానీ సదరు సైనికుడు బాధితురాలి గురించి అసభ్య పదజాలం వాడుతూ ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇక బాధితురాలు చెప్పిన మాటలను బట్టి.. ‘‘అతగాడు తనకు సులువుగా లొంగిపోయే అమ్మాయిని వెదుకుతూ వస్తున్నాడట’’.
అంటే 16 ఏళ్లకే గర్భం దాల్చినందు వల్ల అతడు ఆమె ఏం చెప్పినా చేస్తుందనుకున్నాడా? తన పశువాంఛకు ఆమె తొందరగా అంగీకరిస్తుందని భావించాడా? బాధితురాలు చెప్పిన మరో మాట వింటే ఆమె పట్ల అక్కడున్న పురుషులకు ఎలాంటి భావన ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యాచారం జరిగిన మరుసటి రోజు మరో సైనికుడి దగ్గరకు ఆమెను తీసుకువెళ్లారట. అతడు కూడా అచ్చం సదరు నిందితుడిలాగానే ఆమెపై అరుస్తూ లైంగిక దాడి చేస్తానంటూ బెదిరించాడు.
నీకు పరీక్ష పెట్టాము!
భయంతో ఆమె ఏడుపు మొదలుపెట్టగానే.. అతడు నెమ్మదిగా.. ‘‘నువ్వు నిజం చెబుతున్నావో లేదంటే అబద్ధం చెబుతున్నావో తెలుసుకుందామనే ఇలా చేశాను’’ అని చెప్పాడట. ఇలా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేసేలా వాళ్లు క్రూరంగా ప్రవర్తించారు. అయితే, ఇలాంటి భయంకర ఘటనలు ఆమె ఒక్కదానికి మాత్రమే కాదు.. ఆమెలాంటి ఎంతో ఆడవాళ్లకు ఎదురవుతున్నాయి.
ఉక్రెయిన్‌పై ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో యుద్ధంలో భాగమైన రష్యా సైనికులు స్థానిక ఉక్రెయిన్ మహిళల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్న తీరు ఇప్పటికే బయటపడింది. రాజధాని కీవ్‌లో స్త్రీలను కాల్చి చంపే ముందు కొంతమందిపై అత్యాచారం జరిగిందనే సాక్షాలు తమ వద్ద ఉన్నాయని ఉక్రెయిన్ ఫోరెన్సిక్ వైద్యుడు వ్లాదిస్లావ్ పెరోవ్స్కీ పేర్కొనడం ఇందుకు అద్దం పడుతోంది.
ఇదంతా నిజమే!
ఖెర్సన్ బాధిత యువతి ఘటన గురించి ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. ఆమె చెప్పిన మాటలు నిజమేనని ధ్రువీకరించారు. దీనిని యుద్ధ నేరంగా అభివర్ణించారు. మార్చి నెల ఆరంభంలో ఉక్రెయిన్ బలగాలు అక్కడ లేని సమయంలో.. రష్యా సైనికులు ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నపుడు ఈ అకృత్యం జరిగిందని తెలిపారు. బాధితురాలితో పాటు మరికొందరు కూడా యుద్ధ నేరాలకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి👉🏾 మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారా? వాళ్లు ఎలాంటి వారంటే!
Comments
Please login to add a commentAdd a comment