Shraddha Parekh: The Story Of Battle With Lupus Disease In Telugu - Sakshi
Sakshi News home page

Shraddha Parekh: చేతిని గట్టిగా పట్టుకుంటే ఇంటర్నల్‌ బ్లీడింగ్‌.. ఎముకలు విరిగేవి.. 20 ఏళ్ల తర్వాత

Published Fri, Dec 10 2021 10:13 AM | Last Updated on Fri, Dec 10 2021 11:55 AM

Shraddha Parekh: Lupus Disease Victim Once Lives On 3 Biscuits Miracle Survival - Sakshi

శ్రద్ధా పరేఖ్‌ నాడు – నేడు

Shraddha Parekh: Lupus Disease Victim Once Lives On 3 Biscuits Miracle Survival: అనుకున్నది జరగలేదనో, లక్ష్యాన్ని చేరుకోలేకపోయామనో, మనసుకు భరించలేని కష్టమొచ్చిందనో... క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి నూరేళ్ల జీవితాన్ని చేతులారా చిదిమేసుకుంటారు కొందరు. జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగాలని అప్పుడే కలలు కనడం మొదలుపెట్టిన శ్రద్ధా పరేఖ్‌కు తనకు రోజులు దగ్గర పడుతున్నట్లు వైద్యుల మాటల ద్వారా తెలిసింది. 

ఎలాగైనా తమ బిడ్డను బతికించుకోవాలన్న ఆశతో తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్మేసి వైద్యం చేయించారు. అంతచేసినా ఏమాత్రం మెరుగు పడకపోగా, మరింత దిగజారింది ఆరోగ్యం. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి, ఆయుష్షును పెంచుకోవడమేగాక, తన కాళ్లమీద తను నిలబడి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది శ్రద్ధా పరేఖ్‌. 

ముంబైకు చెందిన శ్రద్ధా పరేఖ్‌కు ఆరేళ్లు ఉన్నప్పుడు తరచూ జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, ముఖం మీద ర్యాషెస్‌ వచ్చేవి. రెగ్యులర్‌గా వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తల్లిదండ్రులు శ్రద్ధను ఆసుపత్రిలో చూపించారు. డాక్టర్లు అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించి శ్రద్ధ అనారోగ్యానికి కారణం ‘లూపస్‌’ వ్యాధిగా నిర్ధారించారు. అప్పుడు శ్రద్ధకు తొమ్మిదేళ్లు.

ఇంత చిన్నవయసులో తనకు వచ్చిన వ్యాధిపై ఆమెకు కనీస అవగాహన కూడా లేదు. లూపస్‌కు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ పెద్దమార్పు రాకపోగా మరో ఆరునెలలు మాత్రమే బతుకుతుందని చెప్పారు. అరుదుగా వచ్చే ఆటో ఇమ్యూన్‌ డిసీజే లూపస్‌. శరీరంలో ప్రతి అవయవాన్ని ఈ వ్యాధి కబళించేస్తుంది. దీనివల్ల ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. 

సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. 
శ్రద్ధ తల్లిదండ్రులు కూతురిని బతికించుకోవడానికి చేయని ప్రయత్నంలేదు. వివిధ రకాల శక్తిమంతమైన మందులు తరచు తీసుకోవడం వల్ల శ్రద్ధ ఊబకాయురాలిగా మారింది. దీంతో ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వచ్చినా జూ నుంచి కొత్త జంతువేదో బయటికి వచ్చిందన్నట్లుగా చూసేవారామెను. తన భారీకాయంపై జోకులు వేసేవారు.

ఇదేసమయంలో ఎముకలు బలహీనంగా ఉండడంతో స్కూలుకెళ్లడం మానేసింది. ఎవరైనా తన చేతిని గట్టిగా పట్టుకుంటే ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అవ్వడం, ఎముకలు విరిగిపోవడం వంటివి జరిగేవి. ఒక పక్క స్కూలుకు వెళ్లలేక, మరోపక్క జబ్బు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో శ్రద్ధ తీవ్రంగా కృంగిపోయేది. అయినప్పటికీ అమ్మా, నాన్న, చెల్లి నిత్యం తనని కనిపెట్టుకుని ఉండడం వల్ల కాస్త ఊరటగా అనిపించేది. 

ఉద్యోగిగా.. 
రోజురోజుకి సమస్య తీవ్రమై ఒక నెలరోజులపాటు కొన్ని బిస్కెట్లు తిని, గ్లాసు నీళ్లు తాగి బతికింది. వయసు పెరిగే  కొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరుగుతూ వచ్చాయి. రెండుసార్లు కిడ్నీ బయాప్సీ...  మూడుసార్లు కాళ్లకు శస్త్ర చికిత్స చేశారు. ప్లాస్టర్స్‌తో బోన్స్‌ను అతికించారు. కీమోథెరపీ కూడా చేయించుకుంది. ‘‘ఇంత కష్టపడి ఈమె బతకడం అవసరమా? ఈమెవల్ల ఎటువంటి ఉపయోగం లేదు, తల్లిదండ్రులకు భారం తప్ప మరేం లేదు’’ అనే కామెంట్లు శ్రద్ధ చెవిన పడ్డాయి.

దీంతో ‘వారు అన్నట్టుగాక... నేను ఆరోగ్యంగా బతకాలి. జీవించినంత కాలం ఇలా ఏడుస్తూనే ఎందుకుండాలి?’ అన్న పట్టుదలతో ఇంటినుంచే చదువుకుని బీకామ్‌ పూర్తిచేసింది. తరువాత కంప్యూటర్‌ కోర్సులు చేసి ఉద్యోగం సంపాదించింది. వ్యాధి సోకిన ఇరవై ఏళ్ల తరువాత శ్రద్ధ లూపస్‌ నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్పడంతో, మరింత ఉత్సాహంతో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తోంది. 

ఆంఖోంకీ దునియా 
లూపస్‌ను జయించిన శ్రద్ధ లూపస్‌ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది. ‘ఆంఖోంకీ దునియా’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి లూపస్‌ అంటే ఏంటీ? అది వచ్చినవారు ఎలా ఎదుర్కోవాలి? తను లూపస్‌ను ఎలా జయించిందో చెబుతూ అనేక మందికి అవగాహన కల్పిస్తోంది. మూడేళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో...తన జీతంతో చెల్లిని పోషిస్తూ అద్దె ఇంట్లో ఉంటోంది. ‘‘ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత సొంత ఇంటిని కొనుక్కోవడమేగాక, ఇతరులకు కూడా ఆర్థిక సాయం చేస్తాను’’ అని చెబుతూన్న శ్రద్ధా పరేఖ్‌ జీవితం క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకునే వారెందరికో కనువిప్పు... ప్రేరణ. 
చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement