సున్నితమైన గానానికి ఉన్నతి తలత్  | Singer Talat Voice that soothed broken hearts Birth Anniversary | Sakshi
Sakshi News home page

సున్నితమైన గానానికి ఉన్నతి తలత్ 

Published Sat, Feb 24 2024 6:00 AM | Last Updated on Sat, Feb 24 2024 6:53 AM

Singer Talat Voice that soothed broken hearts Birth Anniversary - Sakshi

గాయకుడు తలత్ మహ్మూద్ శత జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుందాం రండి -

మృదువైన, మెత్తని గాత్రంతో, గానంతోమనదేశంలో తలత్ మహ్మూద్ తొలి crooner! మన దేశ లలిత, సినిమా, గజల్ పరంగా మేలైన, మెరుగైన గానం (fine singing) తలత్‌ 
Silky smooth and  velvet voiceతో మొదలయింది. గాన లాలిత్యం మనదేశంలో తలత్‌వల్ల సాకారమైంది. భారతదేశ లలిత, సినిమా, గజల్ గానానికి మార్గదర్శకుడు తలత్.‌ 
అత్యున్నతమైన గాయకుడు మొహమ్మద్ రఫీ కూడా తలత్ ప్రభావంతో తనను తాను తీర్చి దిద్దుకున్నారు. దులారీ సినిమాలోని "సుహానీ రాత్ డల్ చుకీ..." పాట మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. గజల్ గాయకుడు మెహ్‌దీహసన్‌కు కూడా తొలిదశలో తలత్‌ స్ఫూర్తి. 1950ల ప్రథమార్ధంలో తలత్ ప్రభావంతో మెహ్‌దీహసన్‌ చేసిన ఒక గజల్ కచేరీలో ప్రేక్షకుల నుంచి కానుకలుగా 15,000 రూపాయల నోట్లు మెహ్‌దీహసన్‌పై పడ్డాయి. తలత్ పాడిన "అసర్, ఉస్కో జరా నహీన్ హో...", "వో జాతేన్ హేన్..."  వంటి గజళ్లు వింటే మెహ్‌దీహసన్‌ గానంపై తలత్ గాన ప్రభావం తెలియవస్తుంది.

1941-44 మధ్య కాలంలో తపన్ కుమార్ పేరుతో తలత్ కలకత్తాలో కొన్ని బెంగాలీ పాటలు పాడారు. 1945లో కలకత్తాలో నిర్మితమైన రాజలక్ష్మీ
హిందీ సినిమాలో నటుడు-గాయకుడుగా రాబిన్ చటర్జీ సంగీతంలో తలత్ తన మెదటి సినిమా పాట " ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్ ..." పాడారు. అనిల్ బిస్వాస్ సంగీతంలో 1951లో వచ్చిన తరానా సినిమాలో పాడిన "సీనేమే సులగ్‌తే హైన్ అర్‌మా ..." పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు 1950లో అనిల్ బిస్వాస్ సంగీతంలో వచ్చిన ఆర్‌జూ సినిమాలోని "ఏ దిల్ ముఝే ఏసీ జగ్‌హ లే ..." పాటా, 1950లోనే నౌషాద్ సంగీతంలో వచ్చిన బాబుల్ సినిమాలోని " మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా..." పాటా చెప్పుకోతగ్గవి.

సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో వచ్చిన సంగ్‌దిల్ సినిమాలో తలత్ పాడిన ఏ హవా, ఏ రాత్, ఏ చాందినీ..." పాట మన దేశంలొ వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ఆ సంగ్‌దిల్ సినిమాలోనే తలత్ "కహాన్ హో కహాన్ మేరే జీవన్ సహారే..." అంటూ మరో గొప్ప పాట పాడారు. శంకర్-జైకిషన్ సంగీతంలో తలత్ పాడిన "ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్..." (సినిమా: దాగ్) పాట దేశం మొత్తాన్నీ ఊపేసింది. అటు తరువాత తలత్ పాడిన "తస్వీర్ బనాతా హున్ ..." (సినిమా: బారాదరీ, సంగీతం: నాషాద్) "షామే గమ్ కీ కసమ్.." (సినిమా: ఫుట్ పాత్, సంగీతం: ఖయ్యామ్), "ఏ గమే దిల్ క్యా కరూన్ ..." (సినిమా: ఠోకర్, సంగీతం: సర్దార్ మాలిక్), "జిందగీ దేనే వాలే సున్..." (సినిమా: దిల్ - ఎ - నాదాన్, సంగీతం: గులామ్ మొహమ్మద్),  "మై దిల్ హూన్ ఇక్ అర్‌మాన్ భరా..." ( సినిమా: అన్‌హోనీ, సంగీతం: రోషన్),  "మొహబ్బత్ హీ న జో సమ్‌ఝొ వో జాలిమ్ ప్యార్ క్యా జానే..." (సినిమా: పర్‌ఛాయిన్, సంగీతం: సి. రామ్‌చంద్ర), "ముఝేదేఖో హస్‌రత్ కీ తస్వీర్ ..." (సినిమా: బాజ్, సంగీతం: ఒ.పి. నయ్యర్),  "జాయేన్ తో జాయేన్ కహాన్..." (సినిమా: టాక్సీ డ్రైవర్, సంగీతం: ఎస్.డి. బర్మన్), "రాత్ నే క్యా క్యా ఖ్వాబ్ దిఖాయే..." ( సినిమా: ఏక్ గావ్ కీ కహానీ; సంగీతం: సలిల్ చౌధరీ) పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ భారతదేశ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లో పెద్ద పల్లవి పాట, మనదేశ సినిమాల్లో రెండో పెద్ద పల్లవి పాట (ఈ పాటకన్నా పెద్ద పల్లవితో ఒక తమిళ్ష్ పాట ఉంది) సలిల్ చౌధరీ సంగీతంలో ఉస్నే కహా థా సినిమాలోని "ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే..." తలత్ పాడారు. 

గాయకుడు సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ crooning (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. తలత్ 15 ఏళ్లకే గాయకుడు! 1944లో తలత్ పాడిన "తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్‌లాన సకే గీ" (సంగీతం: కమల్‌దాస్ గుప్తా; రచన: ఫైయాజ్ హష్మి) గజల్ (78 ఆర్.పి.ఎమ్) రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది అది. ఆ‌ గానం ఆదర్శమై దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో "సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా..." గజల్‌ను రికార్డ్‌పై విడుదల చేశారు. 1939లో తన 15యేళ్ల వయసులో తలత్ 2 గజళ్లను పాడి విడుదల చేశారు. "1943లో చాంద్ మేరే చాంద్ తేరే.." గజల్ రికార్డ్ విడుదలైంది. తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్‌లాన సకే గీ గజల్ తరువాత తలత్ మహ్మూద్ గజళ్ల గానానికి ఊపు వచ్చింది. ఆ తరువాత "గమ్ -ఎ-జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా..." (1947; సంగీతం: చిట్టారాయ్), "సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్ (1947), "ఇన్ భీగీ భీగీ రాతోన్ మేన్ ..."(1947), "దిల్ కీ దునియా బసా గయా ..."(1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో "రోరో బీతా జీవన్ సారా..." (రచన: ఖన్వర్‌ జమాన్; సంగీతం: ఖయ్యామ్), "ఆగయీ ఫిర్‌ సే బహారేన్ ..." (రచన: ఖన్వర్‌ జమాన్; సంగీతం: ఖయ్యామ్), "మేరా ప్యార్ ముఝే లోటా దో ..." (రచన: సజ్జన్; సంగీతం: వి. బల్సారా), "చన్ద్ లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్ ..." (రచన: షకీల్ బదాయూనీ; సంగీతం: తలత్ మహ్మూద్) వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. సి.హెచ్. ఆత్మ, ముఖేశ్ వంటి గాయకులతో జంటగా కూడా తలత్ గజళ్లు పాడారు. బేగం అఖ్తర్ గజల్ ఫణితికి అతీతంగా ప్రపంచ గజల్ గానం పరివర్తనానికి, పరిఢవిల్లడానికి ప్రేరణ తలత్. తలత్ మహ్మూద్ గజల్ (గాన)రాజు అయ్యారు. నౌషాద్ సైతం తలత్‌ను 'గజల్ రాజు' అన్నారు.

గైర్-ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్‌లు, దుర్గా ఆర్తి, నాత్‌లు, గీత్‌లు, చెప్పకోతగ్గట్టుగా పాడారు. నిప్పులాంటి మనిషి సినిమాలోని "స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం..." పాట మనకు తెలిసిందే. ఈ పాట హిందీ జంజీర్ సినిమాలో మన్నాడే పాడిన "యారీ హైన్ ఇమాన్ మేరా యార్ మేరీ జందగీ..." పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్‌తో కలిసి తలత్ పాడిన "హమ్ సునాతే హైన్ మొహమ్మద్ ముస్తఫా కీ దాస్‌తాన్..." అన్న నాత్. అమృత సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన "ఏ దేవి వరము నీవు..." పాట పల్లవి తలత్ పాడిన గజల్ "రాతేన్ గుజర్ దీ హైన్ ..." కు దగ్గరగా ఉంటుంది.

తలత్‌ మహ్మూద్ 1959లో  విడుదలైన మనోరమ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో"అందాల సీమ సుధా నిలయం ...", "గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి బాబయా...", "మరిచిపోయేవేమో ..." మూడు పాటలు పాడారు. ఏ మాత్రమూ తెలుగు తెలియని తలత్‌కు గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఉచ్చారణ తర్ఫీదు నిచ్చారు. ఆ సందర్భంలో ఒక చోట చా, వు శబ్దాలు తలత్‌కు సరిగ్గా రాకపోతూండడాన్ని గమనించి మీకు 'చావు' రాకూడదు అన్నారు పి.బి. శ్రీనివాస్ (ఈ వ్యాస రచయితతో పి.బి. శ్రీనివాస్ చెప్పిన మాట). రమేష్ నాయుడు సంగీతంలో పాడడానికి ముందే తలత్ తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో 1951లో సంసార్  హిందీ సినిమాలో "మిట్ నహీన్ సక్తా కభీ లిఖా...", "యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్..." పాటలూ, 1952లో వచ్చిన మిస్టర్ సంపత్ సినిమాలో "ఓ మృగనయనీ...", "హే భగవాన్..." పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు పాతాళభైరవి, చండీరాణి సినిమాలలో ఎన్.టి. రామారావుకు తలత్ పాడారు.

1964లో వచ్చిన జహాన్ ఆరా సినిమాలోని "ఫిర్ వోహీ షామ్..." పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. ఆ తరువాత 20లోపు సినిమా పాటలు మాత్రమే పాడుంటారు. అంతకు ముందు 1963లో సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో రుస్తమ్ సొహరాబ్ సినిమాలో తలత్ "మాజన్దరాన్ మాజన్దరాన్..." అంటూ ఒక విశేషమైన పాట పాడారు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. 290 పైచిలుకు సినిమాల్లోని పాటలూ, గైర్ - ఫిల్మీ గీత్ (సినిమా కాని పాటలు) అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడారు. 16 సినిమాల్లో నటించారు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు తలత్. 24/2/1924న పుట్టిన తలత్ 9/5/1998న పరమపదించారు.

1944 నుంచి 50 వరకూ పాడిన కడుకొద్ది గజళ్లు, గీత్‌లతోనే మొత్తం భారతదేశ‌ సినిమా, లలిత, గజల్ గానానికి దిశా నిర్దేశం చేశారు తలత్! భారతదేశ సినిమా, లలిత, గజల్ గానం తలత్‌కు ముందు తలత్‌కు తరువాత అని పరిగణించబడతాయి.‌ మనదేశంలో సినిమా, లలిత, గజల్ గాన పరివర్తన కర్త తలత్ మహ్మూద్. Talat Mahmood, a transitional icon of Indian non-classical singing.

తలత్ గాత్రంలో స్వాభావికంగా వణుకు ఉంటుంది. Tremulous voice ఆయంది. తలత్ గొంతులోని వణుకుపై బాపు ఒక కార్టూన్ వేశారు. ఆ కార్టూన్‌లో భార్య రేడియో పెట్టగానే రేడియో లోంచి 'గజగజ' అని వస్తుంది. అప్పుడు భర్త "ఆ గొంతు తలత్ మహమ్మద్ది కదే" అంటాడు. తలత్ గొంతుపై చలోక్తులుగా "అసలే తలత్ కచేరీ అదీ ఉటీలో" వంటివి (గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఈ వ్యాస రచయితకు ఈ మాట చెప్పారు) ప్రచారంలో ఉండేవి.తొలి రోజుల్లో తలత్ తన గొంతులోని tremoloను నియంత్రించుకోవడానికి ప్రయత్నించగా సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ ఆ tremoloతోనే పాడమని పట్టుబట్టారు. గొంతులోని వణుకు కూడా తలత్‌కు గుర్తింపు అయిపోయింది.

తలత్ crooningను దక్షిణ భారతదేశంలో పి. బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.‌బి.‌ శ్రీనివాస్ నుండి అది కె.జె. ఏసుదాస్‌కు, ఎస్.పి.‌ బాలసుబ్రహ్మణ్యంకు, వారి తరువాత కొనసాగింపుగా ఇతరులకూ చేరింది. మనదేశంలో crooning ఉంది అంటే అది తలత్ మహ్మూద్‌వల్ల వచ్చింది అన్నది చారిత్రికం.

1968లో అమేరిక టైమ్స్ స్క్వేర్‌లో ఉన్న ఒక స్ట్యూడియోలో టాక్ షోకు ఆహ్వానించి ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి తలత్‌ను "Frank Sinatra of India" అని అన్నారు. తలత్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులుండే వారు. మరే గాయకుడికీ లేనంతగా ఆయనకు ఆ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో మాహిళాభిమానులుండే వారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు పదేపదే వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటారు. సున్నితమైన గానానికి ఉన్నతి తలత్.


-రోచిష్మాన్
9444012279

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement