లక్నో సాంస్కృతిక వైభవ మణిపూసలలో రంగస్థలం ఒకటి. ఆ వెలుగు మరింత ప్రజ్వరిల్లేలా ఔత్సాహికులు నాటకరంగంలో భాగం అవుతున్నారు. అయితే రంగస్థలం అంటే యువతరం మాత్రమేనా? ‘కానే కాదు’ అంటోంది ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ.
రచనల నుంచి నటన వరకు పెద్దలలోని సృజనాత్మక శక్తులను రంగస్థలంపైకి సాదరంగా తీసుకురావడానికి ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ పేరుతో నాటకరంగ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది...
థియేటర్ గ్రూప్ ‘మంచ్‌కీర్తి సమితి’ లక్నో (ఉత్తరప్రదేశ్)లో నిర్వహించిన ‘30 డేస్ 30 ప్లేస్’ కు అనూహ్యమైన స్పందన లభించింది. విశేషం ఏమిటంటే ఆ జామ్ ప్యాక్‌డ్ థియేటర్‌లలో ఎక్కువమంది వృద్ధులు కనిపించారు. నాటకాలు చూస్తున్నప్పుడు వారిలో వయసు భారం మాయమైపోయింది.
ప్రదర్శన పూర్తయిన తరువాత టీ తాగుతూ వారు ఆ నాటకాన్ని లోతుగా విశ్లేషించుకునే దృశ్యాలు ఎన్నో కనిపించాయి... దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్నోకు చెందిన ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో సీనియర్ సిటీజన్‌లతో నలభైరోజుల పాటు థియేటర్ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
‘వారి కోసం వారి చేత’ ట్యాగ్‌లైన్‌తో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లలో రచన, నటన, దర్శకత్వం, సంగీతం... మొదలైన అంశాలలో శిక్షణ ఉంటుంది. దీంతో పాటు తమ ఏరియాలో తమ వయసు ఉన్న వ్యక్తులను సమీకరించి ‘స్టోరీ టెల్లింగ్’లాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చెబుతారు.
‘సీనియర్ సిటిజన్స్ కోసం థియేటర్ అనేది మంచి కాన్సెప్ట్. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త శక్తిని ఇస్తుంది’ అంటున్నాడు థియేటర్ డైరెక్టర్ సలీమ్ ఆరీఫ్. ‘నాటకరంగం అనేది అత్యంత ప్రభావశీలమైనది. ఈ బలమైన మాధ్యమం పెద్దల నీడలో మరింత బలం పుంజుకుంటుంది. వయసు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవ జ్ఞానం నాటకాల్లో ప్రతిఫలిస్తుంది. వృద్ధులు అనగానే ప్రేక్షకుల్లో కూర్చుని నాటకం వీక్షించడానికే పరిమితం కానవసరం లేదు.
ఇప్పుడు వారిని రంగస్థలం ప్రేమగా, అభిమానంగా ఆహ్వానిస్తోంది’’ అంటున్నాడు రంగస్థల ప్రముఖుడు సంగమ్ బహుగుణ. పెద్దల చేత రూపుదిద్దుకుంటున్న నాటకాలు, పెద్దలు నటించే నాటకాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం.. ఒంటరి ఏకాంతాలు, వయసు సమస్యలు, కుటుంబ సమస్యలు... ఇలా ఏవోవో సమస్యలు ఉండబోతున్నాయా? ‘కానే కాదు’ అంటుంది పీపుల్స్ ఇన్‌షియేటివ్. వారు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. తాము నడిచొచ్చిన బాటను గుర్తు చేస్తూ ఈ తరానికి సానుకూలశక్తిని పంచుతారు. ఇంతకంటే కావాల్సినదేముంది!
నాటకాల పాఠశాల
వయసు పైబడినంత మాత్రాన అది నటనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిరూపిస్తున్న ప్రతిభావంతులలో సోహైలా కపూర్ ఒకరు. ఘనమైన ఖాన్‌దాన్ నుంచి వచ్చిన కపూర్ నటి, రచయిత్రి, మోడ్రన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. ఈ తరం నటులతో కలిసి రంగస్థలం, జీ థియేటర్‌లలో నటిస్తోంది కపూర్. ఆమెతో నటించడం అంటే ఔత్సాహిక నటులకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్నంత అదృష్టం. దిల్లీలో పుట్టిన కపూర్ హైస్కూల్ రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ‘వయసు పైబడగానే విషాదం మూర్తీభవించే పాత్రలకు మాత్రమే మహిళా నటులు పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. వృద్ధాప్యం అంటే విషాదం మాత్రమే కాదు. ఎన్నో బలమైన పాత్రలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. వోటీటీ పుణ్యమా అని సీనియర్ నటీమణులకు మూస పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలలో నటించే అవకాశం దొరుకుతుంది’ అంటోంది కపూర్.
Comments
Please login to add a commentAdd a comment