సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే ఫ్యాషన్ డిజైనర్లందరికీ పండుగ! ఆయన సినిమా విడుదల తర్వాత చిన్న చిన్న బోటీక్ ఓనర్స్ నుంచి టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ దాకా అందరూ ఆ చిత్రం రిఫరెన్స్‌తో కొత్త కలెక్షన్స్‌ను విడుదల చేస్తారు. అలాంటిది కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా తొలి అవకాశమే సంజయ్ లీలా భన్సాలీ మూవీలో వస్తే.. అదృష్టమే అనుకుంటారు! అలాంటి చాన్స్ దక్కించుకున్న అదృష్టవంతురాలే ఇక్కడ పరిచయమవుతున్న స్టయిలిస్ట్ అర్చా మెహతా!
అర్చా మెహతా స్వస్థలం ఢిల్లీ. కెరీర్ విషయంలో తండ్రి ఏం చెప్తే అదే అనుకొని, ఇంటర్ అయిపోగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగమైన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నది. అప్పుడు గ్రహించింది తన అసలు ప్యాషన్ ఫ్యాషనే అని! ఆ విషయాన్ని తండ్రితోనూ చెప్పింది. కూతురి ఇష్టాన్ని గుర్తిస్తూ ఆయన వెంటనే అర్చాను ఇంజినీరింగ్ మాన్పించి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు స్టయిలింగ్ గురించి కూడా తెలుసుకుంది. కోర్స్ పూర్తవగానే అక్కడే సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. తర్వాత ముంబై చేరింది.
వెంటనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా’కి అసిస్టెంట్ స్టయిలిస్ట్, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అది పనిలో అనుభవాన్నే కాదు.. టాలీవుడ్‌లో ఎంట్రీనీ కల్పించింది. ‘హార్ట్ ఎటాక్’ మూవీలో అగ్రతారలకు స్టయిలిస్ట్‌గా! అందులో ఆమె కేవలం కాస్ట్యూమ్స్ మీదే కాదు స్కార్ఫ్‌లు, యాక్ససరీస్, ఆఖరకు పచ్చబొట్టు లాంటి వాటిపైనా దృష్టి పెట్టి స్టయిలింగ్ చేసింది. తక్కువ ఎక్స్‌పోజింగ్‌తో ట్రెండీ లుక్ ఇచ్చినందుకు హీరోయిన్స్ ఆదా శర్మ మెప్పును కూడా పొందింది.
అప్పటి నుంచి అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఆ స్కిల్‌కి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఫిదా అయ్యారు. ఆ జాబితాలో కీర్తీ సురేశ్, మృణాల్ ఠాకుర్, కృతీ శెట్టీ, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్తా మీనన్, కళ్యాణీ ప్రియదర్శన్, కేథరిన్ త్రెసా, హన్సిక, మెహ్రీన్, ప్రణీత, దిశా పాట్నీ, నుస్రత్ భరూచా ఎట్సెట్రా ఉన్నారు. వాళ్లంతా అర్చాను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఈ హీరోయిన్స్‌కే కాదు శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకూ ఆమె స్టయిలింగ్ చేస్తోంది.
∙దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment