పూనా పట్టణం నుంచి ఓ పత్రికా విలేఖరి స్వామిని చూడాలని తిరుమల కొండకు బయలుదేరాడు. స్వామి వారి దర్శన సమయానికి వైకుంఠం వద్దకు చేరాడు. అక్కడి శ్రీవారి సేవకులు దర్శన టికెట్ చూసి ‘క్యూ’ లోకి పంపుతున్నారు. విలేఖరి ముందు ఓ ఆరు పదులు పైబడిన వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమెకు తోడుగా పన్నెండేళ్ళ మనవడు కూడా వచ్చి ఉన్నాడు. ఆమె తన సంచిలోని టికెట్ చూపడానికి చాలా అవస్థలు పడుతూ ఉంది. పత్రికా విలేఖరి ఆమెకు సహాయం చేశాడు. ముగ్గురూ క్యూలోకి ప్రవేశించారు. ఆ రిటైర్డ్ టీచర్ కి మోకాలి నొప్పులు ఎక్కువగా ఉండటంతో కష్టంగా నడుస్తోంది. మాటల్లో ఆమె రిటైర్డ్ టీచర్ అని, వారిది తమిళనాడు ఈరోడ్ అని తెలిసింది.
‘‘నడవటానికి ఇంత కష్ట పడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా?’’ అని అడిగాడు విలేఖరి. ‘‘మోకాలి చిప్పలు బాగా అరిగి పోయాయి. రెండు కాళ్ళకూ ఆపరేషన్ అవసరమన్నారు డాక్టర్లు. ఇంటి వ్యవహారాల వల్ల కుదరక ఆపరేషన్ చేయించుకోలేదు’’ అని చెప్పింది. కొద్దిదూరం నడిచాక, సెక్యూరిటీ వారు చెకింగ్ చేయసాగారు. అక్కడ ఆమె చక్కగా నిలబడలేక తూలి పడబోయింది. పక్కనే ఉన్న మనవడు ఆమెను కింద పడనీయకుండా పట్టుకున్నాడు.
అందర్నీ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్‌లో కూర్చోమన్నారు. మంచి గాలి, వెలుతురు వచ్చే ప్రదేశం చూసి కూర్చున్నాడు విలేఖరి. కుంటుకుంటూ వస్తున్న రిటైర్డ్ టీచర్ కి, ఆమె మనవడికి కూడా స్థలం పెట్టి పెట్టాడు. అభిమానంగా కూర్చోమని స్థలం చూపాడు. ఆమె కూర్చోలేదు. మనవడు మాత్రం కూర్చున్నాడు.
‘‘కొద్దిసేపు కూర్చుంటే అలసట తగ్గుతుంది, మీ మోకాలి నొప్పులు కూడా తగ్గుతాయి’’ అని చె΄్పాడు. ‘‘ఫర్లేదు!’’ అని చెప్పి నిలబడే ఉంది. గంట గడిచింది. కంపార్ట్ మెంట్ గేటు తీయలేదు. మరో గంట గడిచింది. అప్పుడు తీశారు. జనం పోలో’మని పరుగులు తీశారు. ఆ రెండు గంటలూ మోకాలి నొప్పులకి ఆమె బాధ పడుతూనే నిలబడి ఉంది. చిన్నగా మోకాళ్ళను అప్పుడప్పుడూ అదుముకుంటూ నడుస్తోంది.
ఆమె తను చెప్పినట్లు కూర్చోక పోవడం విలేఖరికి నచ్చలేదు. ‘రెండు గంటలు నిలబడుకోవాల్సిన అవసరం ఏముంది. కూర్చుని ఉండవచ్చు కదా!’ అనుకున్నాడు. వాళ్ళకి దూరంగా జరిగి జనంతో పాటు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకో మనస్కరించలేదు. వారితో పాటే నడవసాగాడు. తిరుమల నంబి ఆలయం వద్ద ఉండే మూవింగ్ బ్రిడ్జి దగ్గరికి వచ్చింది క్యూ లైను. తట్టుకోలేని నొప్పితో బాధ పడుతోంది ఆ రిటైర్డ్ టీచర్. ధైర్యం చెబుతున్నాడు మనవడు. అక్కడ కొద్దిసేపు కూర్చునే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆమె కూర్చోలేదు. అలా ఇబ్బందిగా నడుస్తూనే మహా ద్వారం దాటి, ధ్వజ స్తంభానికి నమస్కరించి బంగారు వాకిలి గుండా లోపలికి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు.
ఉచిత లడ్డూ ప్రసాదం తీసుకుని గుడి బయటికి వచ్చాక పుష్కరిణి వద్ద కూర్చుని అవ్వా మనవడు లడ్డు తింటూ ఉన్నారు. వారితో పాటు ఉన్న విలేఖరి ‘‘వైకుంఠం నుంచి, దర్శనం పూర్తయ్యేంతవరకు మీరు ఎందుకుకూర్చోలేదు?’’ అని అడిగాడు ఆమె గుడివైపు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘పెరుమాళ్ళు వేంకటేశ్వర స్వామి కొన్ని వేల సంవత్సరాలుగా అలా గర్భగుడిలో మన కోసం నిలబడే ఉన్నాడు. స్వామి వారి దర్శనం కోసం వచ్చినప్పుడు మనం కూర్చోవడం భావ్యం కాదు కదా’’ అని సమాధానమిచ్చింది. ఆమెకు స్వామి వారి పట్ల ఉన్న భక్తి, గౌరవం, నమ్మకానికి విలేఖరి కళ్ళు తడి అయ్యాయి. ‘స్వామీ... ఎన్ని బాధలో మనిషికి. లిప్తకాలం నిన్ను చూస్తే... ఎంత ఉపశమనమో కదా’ అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
నిలువెత్తు నిదర్శనం
Published Mon, Sep 23 2024 10:05 AM | Last Updated on Mon, Sep 23 2024 10:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment