కడుపులో క్రిములా? | Special Story On Worms In Child Stomach | Sakshi
Sakshi News home page

కడుపులో క్రిములా?

Published Thu, Dec 24 2020 5:22 AM | Last Updated on Thu, Dec 24 2020 5:22 AM

Special Story On Worms In Child Stomach - Sakshi

వేమన చెప్పినట్టు... మేడిపండులోనే కాదు... కొందరి పొట్టలోనూ పురుగులుంటాయి. చాలామంది పిల్లలకు... ఆ మాటకొస్తే కొందరు పెద్దల్లో కూడా తరచూ కడుపునొప్పి, పొట్టలో ఇబ్బందిగా ఉండటం వంటి లక్షణాలతో ఈ పురుగుల ఉనికి బయటపడుతుంది. ఇంకొందరిలో అయితే... టాయిలెట్‌లో విసర్జన తర్వాత నులిపురుగుల వంటివి మలంలో కనిపిస్తూనే ఉంటాయి. ఇలా జరిగితే జీర్ణవ్యవస్థలో క్రిములున్న మాట తేటతెల్లంగా కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి కడుపులో ఉండే క్రిముల సంగతి మనకు తెలియనే తెలియదు. కడుపులోని క్రిములు పోతేనే అలాంటి లక్షణాలూ మాయమవుతాయి. సాధారణంగా మనందరిలోనూ, ప్రధానంగా పిల్లల కడుపుల్లో ఉండే పురుగులు / క్రిములు / సూక్ష్మజీవుల గురించి అవగాహన, అవి ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు, వాటి నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.

కడుపులో పురుగులు ఉన్నాయంటే అవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా మొదలుకొని, ఏకకణ జీవులైన ప్రోటోజోవా నుంచి బద్దెపురుగులూ (ఫ్లాటీహెల్మెంథిస్‌), వానపాముల జాతికి చెందిన నిమటోడ్స్‌ వరకు ఎన్నెన్నో రకాలైనవి ఉండవచ్చు. వాటిలో తరచూ కనిపించేవాటిని ఇక్కడ చూద్దాం.
కడుపులోకి చేరి బాధించే ఏకకణజీవులైన ప్రోటోజోవా వర్గానికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉండే హెల్మింథిస్‌ (ఫ్లాటీ అండ్‌ నిమటీ హెల్మెంథిస్‌) వర్గానికి చెందిన పరాన్నజీవులివి.

► ప్రోటోజోవాకి చెందిన జియార్డియా
ఇది జీర్ణవ్యవస్థలోని చిన్న పేగుల్లో (డియోడినమ్‌ అనే భాగంలో) ఉండే పరాన్నజీవి. ఇది ఏకకణ జీవి. మైక్రోస్కోప్‌ కింద చూసినప్పుడు చిత్రంగా పెద్దపెద్ద కళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చిన్నపేగుల్లో జీవిస్తుంది కాబట్టి దీన్ని జియార్డియా ఇంటెస్టినాలిస్‌ అని కూడా అంటారు. డియోడినమ్‌లో ఉండే దాన్ని జియార్డియా డియోడినాలిస్‌ అంటారు. కలుషితమైన ఆహారం తినేవారిలో ప్రధానంగా పరిశుభ్రత పాటించని హాస్టళ్లు, హోటళ్లలో తినేవారిలో ఇది ఉంటుంది. ఇది కడుపులో పడ్డవారిలో నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపులోని క్రిములను నిర్మూలించాకే ఆ ల„ý ణాలు దూరం అవుతాయి.

► ఎంటమీబా హిస్టొలిటికా
ఇది కూడా ప్రోటోజోవాకే చెందిన ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల... నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావచ్చు. ఇంకొందరిలో దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, అనీమియాకు గురికావడం లాంటి లక్షణాలూ ఉంటాయి. అరుదుగా కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

► ఫ్లాట్‌ వార్మ్‌ (టీనియా సోలియమ్, టీనియా సాజినెటా): ఇవి మూడు మీటర్ల కంటే పెద్దగా ఉంటుంవి. ఇవి పొడవులను కొలిచే టేప్‌లా ఫ్లాట్‌గా ఉండటంతో టేప్‌ వార్మ్స్‌ అనీ, ఫ్లాట్‌ వార్మ్స్‌ అని కూడా అంటుంటారు. మనం తినే ఆహారాలు పూర్తిగా సరిగా ఉడికేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా మనలో కొందరికి పోర్క్, ఇంకొందరికి బీఫ్‌ తినడం అలవాటు. అలాంటి వారిలో కచ్చాపచ్చాగా ఉడికించి వండిన పోర్క్‌ తినడం వల్ల టీనియో సోలియమ్‌ జీవులు పెరుగుతాయి. అలాగే సరిగా ఉడికించని బీఫ్‌ తినేవారిలో టీనియా సాజినేటా జీవులు వృద్ధి చెందుతాయి. ఈ జీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ను టేప్‌వార్మ్‌/ఫ్లాట్‌వార్మ్‌ ఇన్ఫెక్షన్‌ అని వ్యవహరిస్తుంటారు.

► నులి పురుగు/ ఆస్కారిస్‌ వార్మ్స్‌: ఇవి చిన్నపేగుల్లో తమ ఆవాసం ఏర్పరచుకుంటాయి.  వీటి కారణంగా కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు ఉంటాయి. ఈ నులిపురుగులు 5 నుంచి 10 సెం.మీల పొడవు ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీటి వల్ల ఇవి కడుపులోకి చేరుకుంటాయి.

► పిన్‌ వార్మ్‌ / త్రెడ్‌ వార్మ్‌ / సీట్‌ వార్మ్‌: ఈ క్రిమి కారణంగా మలద్వారం  వద్ద విపరీతమైన దురద వస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటుంటారు. వారు ఆటల సమయంలో తమ పిరుదులు, కింది భాగంలో గీరుకోవడం, తర్వాత ఆ వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల ఈ క్రిములు శరీరంలోకి చేరుతాయి. అక్కడి నుంచి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రిములు దాదాపు 2 నుంచి 3 మి.మీ పొడవుంటాయి.

► హుక్‌ వార్మ్‌ (ఎన్‌కైలోస్టోమా, సిస్టోజోమా): ఇవి చర్మం ద్వారా శరీరంలోకి చొచ్చుకుని వెళ్లి రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రవాహంలో కలుస్తాయి. అలా రక్తం ద్వారా అవి  కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలోకి చేరుకుని అక్కడ వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఇది కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇవి ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తాయి.  

కడుపులో పురుగుల నివారణకూ / బయటపడటానికీ ఆహారనియమాలివి బాగా పుష్కలంగా తినాల్సినవి :
► పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే మన దేహంలో కదలికలు చురుగ్గానూ, బాగా ఉండాలి. శారీరకంగా మంచి కదలికలు, శ్రమ ఉండేవారిలో పేగుల కదలికలు కూడా చురుగ్గా ఉండి, మలవిసర్జన సాఫీగా అవుతుంది. అలాంటప్పుడే విరేచనం ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి మనం శారీరక శ్రమ / వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే రోజూ పుష్కలంగా నీళ్లు తాగడంతో పాటు విరేచనం సాఫీగా జరగడానికి తోడ్పడేందుకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలూ / కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి.

► మనం తినే టిఫిన్లు, ఉపాహారాలలో దేహానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ఇడ్లీ, దోస వంటివి తినాలి. అలాగే ప్రోబయాటిక్స్‌ ఎక్కువగా ఉండే తియ్యటి పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. పులిసిన పెరుగు/మజ్జిగ వంటివి మళ్లీ యాసిడ్‌ను పెంచి కడుపులో మరింత ఇబ్బందికి కారణమవుతాయి.

► ఆహారం సరిగా జీర్ణం కావడానికి తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్‌–సి, జింక్‌ వంటివి ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి.

తీసుకోకూడనివి లేదా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సినవి
► కార్బోహైడ్రేట్స్, చక్కెరతో కూడిన ఆహారం, పళ్ళ రసాలు, పాల ఉత్తత్తులు, కొవ్వుపదార్థలు, నూనెలు వంటివి తగ్గించడం మంచిది.

చికిత్స
► కడుపులో పురుగులు పడ్డాయని అనుమానించినప్పుడు డాక్టర్లు మల పరీక్షల వంటి  కొన్ని పరీక్షల ద్వారా వీటిని నిర్ధారణ చేసి... కడుపులో ఉన్న క్రిములను బట్టి మిబెండజోల్‌ వంటి కొన్ని  సాధారణ మందుల ద్వారానే వీటిని నిర్మూలించేలా చికిత్స చేస్తారు.

కడుపులోకి క్రిములు / పురుగులు చేరేదెలాగంటే...
► కడుపులోకి క్రిములు / పురుగులు చేరడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారాన్ని తీసుకోవడం. అలాగే సరిగ్గా ఉడికించని మాంసాహారాలతోనూ టేప్‌వార్మ్‌ వంటి జీవులు చేరతాయి. అలాగే మనం రోజూ తినే ఆకుకూరలు, కూరగాయలు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల కూడా క్రిములు పెరిగే అవకాశముంది.

► కాళ్లకు చెప్పుల వంటి రక్షణ ఏదీ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరిగే వాళ్లలో హుక్‌ వార్మ్‌వంటి పురుగులు కడుపులోకి చేరి, అక్కడ వ్యాప్తి చెందుతాయి.

ఆటో ఇన్ఫెక్షన్స్‌ : కొందరు చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గీరుకుంటూ... అవే వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.

నివారణ
► కడుపులో పురుగులు రాకుండా, క్రిములు చేరకుండా ఉండాలంటే మొట్టమొదటి సాధారణ సూత్రం పరిశుభ్రమైన నీళ్లు తాగాలి. కలుషితమైన చోట్ల తాగాల్సి వస్తే తప్పక కాచి చల్లార్చి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలి.

► పిల్లలను అపరిశుభ్రమైన పరిసరాల్లో ఆటలాడనివ్వకూడదు. శుభ్రంగా ఉన్నచోటే ఆడనివ్వడంతోపాటు, మట్టిలో ఆడితే  వెంటనే స్నానం చేయించాలి. పిల్లలు ఆటలాడి వచ్చిన ప్రతిసారీ వారి చేతులను సబ్బుతో బాగా కడుక్కునేలా అలవాటు చేయాలి.

► పిల్లలూ, పెద్దలు నేల మీద నడిచేటప్పుడు తప్పకుండా పాదరక్షలు ధరించాలి.

► పరిసరాలు, తాగునీటిని పట్టుకునే ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడూ ఆ పరిసరాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి.


డాక్టర్‌ నితేష్‌ ప్రతాప్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement