Srikrishna Janmashtami 2022: Significance, Date And Timings, Puja Vidhanam, And Other Details - Sakshi
Sakshi News home page

Srikrishna Janmashtami 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ తేదీన జరుపుకోవాలి? ఇలా చేస్తే దుఃఖం దరిచేరదు

Published Thu, Aug 18 2022 11:36 AM | Last Updated on Thu, Aug 18 2022 1:59 PM

Srikrishna Janmashtami 2022: Shubh Muhurat Significance Other Details - Sakshi

చిన్నా పెద్దా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే పండుగ కృష్ణాష్టమి. అయితే, కొన్నిసార్లు తిథులు తగులు, మిగులు (ముందు రోజు తర్వాత రోజు) వచ్చినప్పుడు పండుగను ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధం చాలా మందిలో ఉంటుంది. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి విషయంలోనూ అదే తరహా సందిగ్దం. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే సందేహం. మరి ఈ ఏడాది ఈ పండుగను ఏ రోజున జరుపుకోవాలంటే...?

 శ్రీ కృష్ణుడు 64 కళలు కలవాడని నమ్మకం. శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే.. జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం.  విష్ణువుకు సంబంధించిన దశావతారాల్లో శ్రీ కృష్ణావతరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు తన చిన్నతనంలో అల్లరి చేష్టలతోనూ జీవిత పరమార్థాన్ని చెప్పాడని చాలా మంది నమ్ముతారు.

కన్నయ్య వెన్న దొంగగా అందరి మనసులను కొలగొట్టేశాడు. గోప బాలుడిగా, సోదరుడిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో కీలకమైన పాత్రలను పోషించాడు. ఆయన ఉపదేశించిన భగవద్గీత మరెంతో ప్రత్యేకం. అయితే కృష్ణుని లీలలన్నీ లోక కళ్యాణం కోసమే. 

ఆరోజే పండుగ!
నిజానికి ఆగష్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది. తదుపరి అష్టమి వచ్చింది. ఆగష్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది. పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగష్టు 19 శుక్రవారం జరుపుకోవాలని స్పష్టత ఉంది.

అయితే, ఆగష్టు 18న జరుపుకోవాలన్న వాదన ఎందుకు తెరపైకి వచ్చిందో గమనిద్దాం… శ్రీకృష్ణుడు అష్టమి తిథి అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని, అందుకే ఆగష్టు 18న ఆ సమయానికి అష్టమి రావడంతో అదేరోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలంటున్నారు కొంతమంది.

ఇదిలా ఉంటే.. హిందువుల పండుగల్లో 90 శాతం సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగష్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు.

గోకులాష్టమి నాడు..
కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని పర్వదినంగా జరుపుకుంటారు. కిట్టయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కన్నయ్య పుట్టినరోజైన పండుగ రోజున ఒకపూట భోజనం చేసి వేణుమాధవుడికి పూజ చేసి.. శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఇక ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.

సంతాన గోపాల మంత్రం పూజిస్తే..
అదే విధంగా సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.
ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు!
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః!
ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః!
ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదంటారు.

కృష్ణుని తలుస్తూ కొలుస్తూ
కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా భగవానుడి నామ స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణుడిని పూజించి మర్నాడు ఉదయం దగ్గర్లో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు.
-ఇన్‌పుట్స్‌: డి.వి.ఆర్‌
చదవండి: ద్వివిధుడి వధ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement