కీళ్లపూడిలో కృష్ణప్ప అనే ఓ చేపల వ్యాపారి ఉండేవాడు. చేపల చెరువులో రోజూ చేపలు పట్టుకుని ఓ పెద్ద గంపలో తీసుకెళ్లి పక్కనే ఉన్న రామగిరిలో అమ్ముకుని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడు. వచ్చే ఆదాయంతోనే తన నలుగురు కూతుళ్లను చదివించుకుంటున్నాడు. తండ్రి కష్టాన్ని చూసి కూతుళ్లు బాధపడేవారు. ఈ కారణంగా చదువులపై శ్రద్ధపెట్టారు.
ఓ రోజు కృష్ణప్ప గంప నిండా చేపలు పట్టి పక్క ఊరిలో సంతకు బయలుదేరాడు. దారిలో ఓ పెద్ద చేప గంపలో ఎగిరెగిరి పడుతుంటే కిందికి దించి చూశాడు. ఆ చేప దిగులుగా ఉంది. ‘అయ్యా.. నాకు జబ్బుపడ్డ చిన్నారి ఉంది. దాని బాగోగులు చూసుకోవాలి. నేను చూసుకోకుంటే అది బతకదు. అదంటే నాకు చాలా ప్రాణం. వెనక్కి వెళ్లి అది బాగయ్యే వరకు ఉండి వచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను ఎక్కడైనా అమ్ముకో!’ అంటూ కంట తడిపెట్టింది బంగారు చేప.
దాని ఆవేదనకు కృష్ణప్ప మనసు కరిగి, వెనక్కి వెళ్లి దాన్ని చేపల చెరువులో విడిచిపెట్టాడు. వేయికళ్లతో ఎదురు చూస్తున్న పిల్ల చేప దగ్గరికి చేరింది ఆ తల్లి చేప. నాలుగురోజుల పాటు దానికి మంచి ఆహారం పెట్టాడు కృష్ణప్ప. వారం రోజులకు, తన పిల్ల చేప ఆరోగ్యం కుదుటపడిన తర్వాత.. గట్టు మీద కూర్చొని చేపలు పడుతున్న కృష్ణప్ప గంపలోకి వచ్చి పడింది బంగారు చేప.
ఆశ్చర్యపోయాడు కృష్ణప్ప. ‘నీ బిడ్డ ఆరోగ్యం బాగైందా?’ అడిగాడు. ‘మీ దయ.. మంచి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం బాగుపడింది. నా కోరిక తీరింది. ఇక నన్ను ఎక్కడైనా అమ్ముకుని లాభం పొందు’ అంది బంగారు చేప. తీసుకెళ్లాడు కృష్ణప్ప. దాన్ని సంతలో అమ్ముతుండగా బతికున్న ఆ చేపను ఓ ధనవంతుడు చూశాడు. పాతికవేలు ఇచ్చి కొనుక్కుపోయాడు. తీసుకెళ్లి ఉడికించడానికి పెనం మీద వేస్తుండగా ఎగిరి కింద పడింది. ‘అయ్యా.. జబ్బుపడ్డ నా బిడ్డ ఎలా ఉందో ఓసారి చూసుకుని వస్తాను. ఆ తర్వాత వేయించుకుని తిందువు’ అని వేడుకుంది.
దాంతో ఆ ధనవంతుడు బంగారు చేపను కృష్ణప్ప వద్దకు తీసుకెళ్లి, విషయం చెప్పాడు. ఆశ్చర్యపోతూ కృష్ణప్ప, ఆ బంగారు చేపను మళ్లీ చెరువులో వదిలిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత అది తన పిల్లతో చెరువు గట్టు మీదకి వచ్చింది. కృష్ణప్ప వద్దకు వెళ్లి ‘నా పిల్లతో సహా నన్ను ధనవంతుడి వద్ద విడిచిపెట్టు’ అంది. కృష్ణప్ప ఆ రెండిటినీ ధనవంతుడి వద్దకు తీసుకెళ్లాడు. దాని నిజాయితీని మెచ్చుకున్న ధనవంతుడు ‘వద్దు కృష్ణప్పా.. వీటిని నువ్వే సంరక్షించు’ అంటూ ఆ రెండిటినీ వెనక్కి పంపాడు. కృష్ణప్ప తన ఇంట్లోనే పెద్ద అక్వేరియాన్ని ఏర్పాటు చేసి ఆ తల్లి, పిల్లను అందులో ఉంచి, ప్రదర్శన ఏర్పాటు చేశాడు.
ఆ ఊరి వాళ్లే కాక, ఇరుగు, పొరుగు ఊళ్ల వాళ్లూ వచ్చి ఆ బంగారు చేపల్ని చూసి ఆనందించసాగారు. అలా జనం పెరిగి కృష్ణప్ప ఇంట్లోని అక్వేరియం పెద్ద ప్రదర్శనశాలగా మారిపోయింది. దాంతో కృష్ణప్పకు రోజూ డబ్బులు రాసాగాయి. చేపలు పట్టే పని మానుకుని, చేపల ప్రదర్శనతో వస్తున్న ఆదాయంతో తన పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేశాడు కృష్ణప్ప.
∙బోగా పురుషోత్తం
Comments
Please login to add a commentAdd a comment