వేసవి కాలం రాగానే చాలామంది రాగిజావ తాగుతుంటారు. రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే. వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలేమిటో చూద్దాం...
►రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
►వీటిలో ఐరన్ కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవడం మంచిది.
►రాగి పిండిలో విటమిన్–సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
►రాగులు లేదా రాగిజావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి.
►బరువు తగ్గాలనుకునేవారికి రాగి జావ లేదా రాగిసంగటిగానూ తీసుకోవడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపించి ఎక్కువ ఆహారం తీసుకోరు. అందువల్ల త్వరగా బరువు తగ్గుతారు.
►రాగిపిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి.
►అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.
►దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.
►రక్తంలో కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా కూడా చూసుకోవచ్చు.
►అల్పాహారం తీసుకోవడం కుదరనివారు రాగులతో సమానంగా దంపుడు బియ్యం కలిపి మర పట్టించి, జావ కాచుకుని తాగితే ఎక్కువసేపు ఆకలి కాదు. నీరసం రాకుండా ఉంటుంది.
►బీపీ ఉండి, మధుమేహం లేనివారు రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగవచ్చు. ఇది పిల్లలకు కూడా మంచిది.
►షుగర్ ఉన్న వారు తీపికి బదులుగా మజ్జిగ, ఉప్పుతో తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment