
పెరుగు లేనిదే అన్నం తిన్నట్టే ఉండదు చాలామందికి. అంతేకాదు పెరుగు కమ్మగా ఉండాలి. కొంచెం పులిసినా ఇక దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది గృహిణులకు పెద్ద టాస్కే. అందులోనూ వేసవి కాలంలో పెరుగు తొందరగా పులిసిపోతుంది. కానీ పెరుగు మిగిలినా, పుల్లగా అయినా పాడేయక్కర్లేదు. మిగిలిన పెరుగు,పుల్లటి పెరుగుతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు తెలుసా? దీంతోపాటు కొన్ని ఇంట్రిస్టింగ్ టిప్స్ మీకోసం..
వేసవికాలంలో ఫ్రిజ్‌లో పెట్టినా కూడా టేస్ట్ మారిపోతుంది. మిగిలిపోయిన, లేదా పులిసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే మిగిలిన పెరుగును తాలింపు పెట్టుకుంటే, రుచిగానూ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ పెరుగులో కాస్త మైదా, వరిపిండి కలిపి అట్లు పోసుకొని తినవవచ్చు. బోండాల్లా వేసుకొని తినవచ్చు.
పుల్లట్లు
పెరుగుతో చేసుకునే అట్లు భలే రుచిగా ఉంటాయి. పెరుగులో ఒక కప్పు మైదా, రెండు కప్పుల బియ్యం పిండి కలిపి కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాలంటే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా కలుపు కోవచ్చు. దోసెలు వేసుకునే ముందు సన్నగాతరిగిన ఉల్లి, పర్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఉప్పు వేసి దోశల పిండిలా జారుగా ఉండాలి. వేడి వేడి పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ దోసలను దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. అల్లం లేదా టమాటా చట్నీతో బ్రేక్‌ఫాస్ట్‌లా లేదంటే ఈవినింగ్ టిఫిన్‌లా తినవచ్చు.
మజ్జిగ పులుసు
పులిసిన పెరుగును కాస్త నీరు కలిపి మజ్జిగలా చేయండి. దాంట్లో రెండు టీ స్పూన్ల శెనగపిండి కలిపి పక్కనుంచుకోవాలి. కుక్కర్లో సొరకాయ, బెండకాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కాసిన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. రెండు, మూడు కూతలు వచ్చేదాకా ఆగాలి. ఆ తరువాత మూత తీసి, కొత్తి మీర చల్లి, కొద్దిసేపు మరగనివ్వాలి. ఇపుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి మరో రెండు నిమిషాలు మరగనిస్తే చాలు. చివరిగా దీన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు పెట్టుకోండి. ముద్దపప్పు , మజ్జిగపులుసు కాంబినేషన్ అదుర్స్ .
సింపుల్‌గాఎండుమిర్చి, మెంతులు, కరివేపాకుతో తాలింపు వేసి, పచ్చి ఉల్లిపాయ ముక్కులు, క్యారెట్ తురుము కలుపుకుని వేడి వేడి అన్నంతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది.
బోండాలు
పెరుగులో మైదా, బియ్యం పిండి,కాస్త వంట సోడా కలిపి పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే రెండు మూడు గంటలు నానిన తరువాత బాగా బీట్ చేసి బోండాల్లాగా వేసుకుంటే రుచిగా ఉంటాయి. (పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే బోండాలు పేలే అవకాశం ఉంది). కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ, పర్చిమిర్చి, కొత్తిమీరలను ముక్కలుగా చేసి కలుపుకుని కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకోవడమే. అల్లం ,లేదా పల్లీ చట్నీతో తింటే ఆహా అనాల్సిందే.
చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
మరికొన్ని చిట్కాలు
మిగిలిపోయిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు.. దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్ తయారీలోనూ వాడుకోవచ్చు. స్మూతీస్ చేసే క్రమంలోనే బ్లెండర్‌లో పండ్లు, తేనె, కొన్ని ఐస్‌ముక్కలతో ΄ాటు కొద్దిగా పెరుగు వేసి బ్లెండ్ చేస్తే దాని రుచి పెరుగుతుంది.
మటన్, చికెన్ వండే ముందు చాలా మంది మ్యారినేట్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పెరుగును కూడా కలిపితే మాంసం ముక్కలు మరింత మృదువుగా మారి త్వరగా ఉడకటమే కాదు, కూర రుచి మరింత పెరుగుతుంది.
సలాడ్ గార్నిష్/డ్రస్సింగ్ కోసం కొత్తమీర/పుదీనా వంటి ఆకులు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం, ఆలివ్ నూనె వంటివి వాడుతుంటారు. అయితే క్రీమీగా చిలికిన పెరుగును వాటి పైనుంచి సన్నటి తీగలాగా పోస్తే సలాడ్ నోరూరిస్తుంది. ఇంకా తింటుంటే మధ్యమధ్యలో పుల్లపుల్లగా నోటికి తగులి టేస్టీగా ఉంటుందని అంటున్నారు.
చిప్స్, క్రాకర్స్, కాల్చిన కాయగూర ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రై స్ వంటి వాటిని వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన డిప్పింగ్ సాస్‌లో ముంచుకొని తింటుంటారు. అయితే ఈ డిప్స్ తయారీలో కొద్దిగా పెరుగును ఉపయోగిస్తే వాటి రుచి, చిక్కదనం పెరుగుతాయి.
పెరుగుతో రుచికరమైన డిప్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ఒక క్లాత్‌లో వేసి అందులోని నీటిని తీసేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా చిలికితే క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలుపుకోవాలి. ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్వీట్‌కార్న్ వంటివి జత చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.
చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్!
Comments
Please login to add a commentAdd a comment