Tide Turners Plastic Challenge: గుజరాత్‌లోని బరోడా నగరం గుండా ‘భూఖీ’ అనే నది ప్రవహిస్తుంటుంది. ఇది ఒకప్పుడు మొసళ్లకు ఆవాస కేంద్రంగా ఉండేది. నది ప్రవాహంలో ఎక్కడో ఒకచోట మొసళ్లు కనిపించేవి. రానురానూ ఈ నది కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భూఖీ ఉన్నచోట ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు! ఈ దెబ్బతో ఎటు వెళ్లాయో, ఎప్పుడు వెళ్లాయో, ఎక్కడికి వెళ్లాయో తెలియదు. ఎంత వెదికినా ఒక్క మొసలి కూడా కనిపించేది కాదు.
కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి!
అయితే ఒక చాలెంజ్ నిర్జీవమైన భూఖీకి జీవాన్ని ఇచ్చింది. చైతన్యం చేసింది. గతంలో కనిపించినంత కనిపించకపోయినా... ఇప్పుడు ఎనిమిది నుంచి పది మొసళ్లు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. కాలుష్యం భరించలేక కన్నీళ్లు పెట్టుకొని పారిపోయిన మొసళ్ల కన్నీరు తుడిచింది ఎవరు? ‘ఇప్పుడు మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు’ అని ధైర్యం ఇచ్చింది ఎవరు?
రోజుకో సరదా చాలెంజ్‌ల గురించి వినిపిస్తున్న రోజుల్లో ఆఫ్రికా నుంచి ఆసియా వరకు ఎన్నో దేశాల యువతను అమితంగా ఆకట్టుకుంది... టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ చాలెంజ్. యూఎన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొగ్రామ్‌లో భాగంగా వచ్చిన ఈ చాలెంజ్... సముద్రాలు, నదులు, కాలువల్లో తిష్ఠ వేసిన కాలుష్య భూతంపై మోగించిన సమరభేరి. ఎంట్రీ, చాంపియన్, లీడర్... ఇలా విభిన్న స్థాయిలో ఈ చాలెంజ్‌కు రూపకల్పన చేశారు.
ఇది సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (సీయియి) ద్వారా ఇండియాకు కూడా వచ్చింది. మహారాజా షాయజీరావు యూనివర్శిటీ ఆఫ్ బరోడాకు ఈ చాలెంజ్ వచ్చినప్పుడు ఎంఏ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ స్టూడెంట్ అయిన స్నేహ షాహీలాంటి ఒక్కరు ఇద్దరు తప్ప పెద్దగా ఉత్సాహం ప్రదర్శించిన వారు లేరు. తొలి సంతకం చేసిన స్నేహ అక్కడితో ఆగిపోలేదు.
ఈ చాలెంజ్ చేసే మేలు గురించి యూనివర్శిటీలో విస్తృతంగా ప్రచారం చేసింది. అలా ఈ చాలెంజ్‌లో 300 మంది విద్యార్థులు భాగం అయ్యారు. ముందుగా తమ యూనివర్శిటి నాలాలలో నుంచి కిలోల కొద్దీ చెత్తను ఎత్తిపారేసారు. ఇక భూఖీ ప్రక్షాళన ప్రారంభించారు. భూఖీ నదికి ఒకనాటి పాతకళను తెచ్చారు. నది నుంచి వెలికి తీసిన ప్లాస్టిక్, థర్మకోల్ వ్యర్థాలను శుభ్రం చేసి స్మాల్ ప్లాంటర్స్, వాల్‌హ్యాంగిగ్స్ తయారుచేసి వినియోగంలోకి తెచ్చారు. గ్లాస్‌బాటిల్స్‌ను రీసైకిలింగ్‌కు పంపించారు.
అవగాహన ఆచరణకు దారి చూపుతుంది. అదే ఆచరణ ఎంతోమందికి అవగాహన కలిగిస్తుంది. ప్రస్తుతం స్నేహ, ఆమె బృందం ఇదే పనిలో ఉంది. ‘అవర్ కామన్ ఫ్యూచర్’ అనే పేరుతో బృందంగా ఏర్పడి పర్యావరణానికి మేలు చేసే పనులు చేస్తున్నారు. ‘జలాల్లో కాలుష్యానికి మనమే కారణం. ఆ తప్పును సరిదిద్దుకోవాలి’ అంటూ ఎంతోమందిని దిద్దుబాటు బాటలోకి నడిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment