భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ ఆరోథే మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి ఇంట్లో కోటి రూపాయల నగదు పట్టుబడటంతో వడోదర పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
కాగా గుజరాత్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ తుషార్ ఆరోథే. 1985- 2004 మధ్య రంజీల్లో బరోడా జట్టు తరఫున వందకు పైగా మ్యాచ్‌లు ఆడాడు ఈ స్పిన్ ఆల్‌రౌండర్. కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది.
అయితే, ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం తుషార్ ఆరోథే కోచ్‌గా అవతారమెత్తాడు. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగి భారత మహిళా జట్టుకు కోచ్‌గా 2013లో నియమితుడయ్యాడు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ బరోడా కోచ్‌గా వచ్చి.. 2015లో రాజీనామా చేశాడు.
తుషార్ ఆరోథే కుమారుడు రిషి ఆరోథే కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెటరే. ఇదిలా ఉంటే.. వివాదాలతో సావాసం చేయడం తుషార్ ఆరోథేకు అలవాటు. 2019లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ కేఫ్‌లో బెట్టింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఈ క్రమంలో బెయిల్ మీద విడుదలైన అనంతరం.. క్రికెట్ మాత్రమే తనకున్న ఉపాధి అని, ఇలాంటి చెత్త పనులు చేయనంటూ తుషార్ ఆరోథే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి పోలీసులకు చిక్కడం గమనార్హం.
తుషార్ కొడుకు రిషి అపార్ట్‌మెంట్‌కు భారీ మొత్తంలో నగదు తరలినట్లు తమకు సమాచారం అందిందని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్స్‌పెక్టర్ వీఎస్ పాటిల్ జాతీయ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో తుషార్ ఆరోథేకు చెందిన ప్రతాప్‌గంజ్ నివాసంలోనూ సోదాలు జరుపగా కోటికి పైగా నగదు పట్టుబడిందని.. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
డబ్బులన్నీ సంచుల్లో కుక్కి పెట్టారని.. ఈ లావాదేవీల గురించి వివరణ అడుగగా తుషార్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా ఆదివారం నాటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment