Tushar Arothe
-
ఇంట్లో డబ్బు సంచులు.. పోలీసులకు చిక్కిన మాజీ క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ ఆరోథే మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి ఇంట్లో కోటి రూపాయల నగదు పట్టుబడటంతో వడోదర పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కాగా గుజరాత్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ తుషార్ ఆరోథే. 1985- 2004 మధ్య రంజీల్లో బరోడా జట్టు తరఫున వందకు పైగా మ్యాచ్‌లు ఆడాడు ఈ స్పిన్ ఆల్‌రౌండర్. కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. అయితే, ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం తుషార్ ఆరోథే కోచ్‌గా అవతారమెత్తాడు. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగి భారత మహిళా జట్టుకు కోచ్‌గా 2013లో నియమితుడయ్యాడు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ బరోడా కోచ్‌గా వచ్చి.. 2015లో రాజీనామా చేశాడు. తుషార్ ఆరోథే కుమారుడు రిషి ఆరోథే కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెటరే. ఇదిలా ఉంటే.. వివాదాలతో సావాసం చేయడం తుషార్ ఆరోథేకు అలవాటు. 2019లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ కేఫ్‌లో బెట్టింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెయిల్ మీద విడుదలైన అనంతరం.. క్రికెట్ మాత్రమే తనకున్న ఉపాధి అని, ఇలాంటి చెత్త పనులు చేయనంటూ తుషార్ ఆరోథే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి పోలీసులకు చిక్కడం గమనార్హం. తుషార్ కొడుకు రిషి అపార్ట్‌మెంట్‌కు భారీ మొత్తంలో నగదు తరలినట్లు తమకు సమాచారం అందిందని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్స్పెక్టర్ వీఎస్ పాటిల్ జాతీయ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో తుషార్ ఆరోథేకు చెందిన ప్రతాప్గంజ్ నివాసంలోనూ సోదాలు జరుపగా కోటికి పైగా నగదు పట్టుబడిందని.. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. డబ్బులన్నీ సంచుల్లో కుక్కి పెట్టారని.. ఈ లావాదేవీల గురించి వివరణ అడుగగా తుషార్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా ఆదివారం నాటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
మహిళల జట్టులో అన్నీ రాజకీయాలే!
భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్గత వ్యవహారాలపై మరో మాజీ కోచ్ తుషార్ అరోథే తీవ్ర విమర్శలు చేశారు. బయటకు కనిపించని రాజకీయాలు చాలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీమ్‌తో సంబంధం లేని మాజీ మహిళా క్రికెటర్లు బయటినుంచి ఎన్నో విషయాలు శాసిస్తుంటారని అన్నారు. తప్పు ఎవరిదైనా కోచ్‌పైనే వేటు పడుతుందన్న తుషార్... అగ్రశ్రేణి జట్లతో పోటీ పడే విధంగా మన సన్నాహకాలు బాగుండాలని చెబితే తాము అంత కష్టపడలేం అన్నట్లుగా వారు వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. -
నేను తప్పు చేయలేదు!
వడోదర: ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడి పోలీసుల చేతిలో అరెస్టయిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరోథే తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తానెప్పుడూ ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. బెట్టింగ్ అభియోగంపై తుషార్‌తో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా...ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఈ ఘటనపై తుషార్ స్పందించారు. ‘క్రికెట్ నా జీవనాధారం. ఇవాళ నాకు ఈ మాత్రం పేరు వచ్చి ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు క్రికెట్టే కారణం. నేనెప్పుడూ అలాంటి తప్పుడు పని చేయను. చేయడం సంగతేమో కానీ కనీసం ఆలోచించను కూడా. జీవితంలో ఒక్క పైసా విషయంలో కూడా ఎవరినీ మోసం చేయలేదు’ అని అరోథే వ్యాఖ్యానించారు. -
ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడినందుకు...
వడోదర: భారత క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయే వార్త... ఆటగాడిగా, కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న తుషార్ అరోథే (52) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లో పాల్గొన్నందుకు అరోథేతో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక హోటల్లో బెట్టింగ్ చేస్తున్నట్లు తెలియడంతో దాడి జరిపి వీరందరినీ పట్టుకున్నామని...వారి ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు వడోదర్ డీపీపీ (క్రైమ్) జేఎస్ జడేజా వెల్లడించారు. 2008, 2012లో ఆయన భారత మహిళల క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. అయితే తుషార్ పెద్ద ఘనత భారత జట్టును ప్రపంచ కప్ ఫైనల్ చేర్చడమే. 2017 వన్డే వరల్డ్ కప్‌లో ఆయన టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత జట్టులోని సభ్యులతో విభేదాల నేపథ్యంలో గత ఏడాది టి20 ప్రపంచ కప్‌కు ముందు అరోథే కోచ్ పదవి కోల్పోయారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన అరోథే 18 ఏళ్ల కెరీర్లో 114 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 13 సెంచరీలు సహా 6105 పరుగులు చేశారు. పాకిస్తాన్లో ఐపీఎల్ నిషేధం! ఇస్లామాబాద్: తమ దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని పాకిస్తాన్ నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లను తమ దేశంలో చూసేలా చేస్తూ భారత్ ‘వ్యూహాత్మకంగా’ పాక్ క్రికెట్‌ను దెబ్బ తీస్తోందని మంత్రివర్గం అభిప్రాయ పడింది. భారత దేశవాళీ టోర్నీని తమ వద్ద అనుమతించడంలో అర్థం లేదని ప్రసారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. పుల్వామా ఉదంతం తర్వాత అప్పట్లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లను ‘డీ స్పోర్ట్స్’ భారత్‌లో ప్రసారం కాకుండా ఆపివేసింది. -
మా క్రికెట్ కోచ్ ఓవర్ చేస్తున్నాడు..!
ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు ఆన్ ఫీల్డ్ వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతున్న ప్రధాన కోచ్ తుషార్ అరోథిని తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా జట్టు సెలక్షన్ విషయాలతో పాటు ఫీల్డ్‌లో ఆడేటప్పుడు తుషార్ అతిగా వ్యవహరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు బుధవారం భారత మహిళా క్రికెట్ జట్టు బృందం బీసీసీఐని కలిసి కోచ్ తుషార్‌పై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కొన్ని నిర్ణయాలు కెప్టెన్ మాత్రమే తీసుకోవాల్సి ఉండగా, కోచ్‌గా తుషార్ మాత్రం ఓవర్ చేస్తూ విపరీతమైన స్వేచ్ఛను తీసుకుంటున్నాడంటూ ఆరోపించారు. ముందుగా సెలక్షన్ కమిటీకి తమ సమస్యను విన్నవించిన క్రీడాకారిణులు.. ఆపై బీసీసీఐతో సమావేశమయ్యారు. గతవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోవడానికి తుషార్ ఎలా కారణమయ్యాడనేది బీసీసీఐ సమావేశంలో ప్రస్తావించారు. తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పూర్తిగా పక్కకు పెట్టిన కోచ్.. ఏకపక్షం నిర్ణయాలు తీసుకున్నాడని ఆరోపించారు. ఫైనల్ మ్యాచ్‌కు జట్టు ఎంపిక బాలేదని హర్మన్ చెప్పినా, తుషార్ వినలేదని బీసీసీఐ పెద్దలకు విన్నవించినట్లు సమాచారం. దీనిలో భాగంగా తుషార్ అరోథిని కోచ్‌గా కొనసాగించవద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.