Best Summer Drinks: Top 8 Traditional Summer Drinks That Decrease Body Temperature In Telugu - Sakshi
Sakshi News home page

Summer Drinks In Telugu: వేసవిలో ఈ జావలు తాగితే శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు బోలెడు ప్రయోజనాలు

Published Fri, Apr 15 2022 1:46 PM | Last Updated on Fri, Apr 15 2022 2:44 PM

Traditional Drinks That Decrease Body Temperature - Sakshi

మండే ఎండల్లో శరీరానికి వేడి చేయకుండా చల్లదనాన్ని అదించే వివిధ రకాల జావలను మన పూర్వికులనుంచి తాగుతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో రకరకాల శీతలపానీయాలకు అలవాటు పడి జావలు తాగడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అయితే మన వంటింట్లో దొరికే కొన్ని రకాల పిండి దినుసులతో జావచేసుకోని తాగడం వల్ల  శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందడంతోపాటు, శరీరానికి హాని చేసే వేడి కూడా ఇట్టే తగ్గిపోతుంది. నిమిషాల వ్యవధిలో ఎంతో రుచికరమైన జావలను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... 


జొన్నగటక 
కావలసినవి: జొన్నపిండి – రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, అల్లం – అంగుళం ముక్క(తురుముకోవాలి) మజ్జిగ – కప్పు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, క్యారట్‌ తురుము – పావు కప్పు. 

తయారీ: 

  • ముందుగా జొన్నపిండిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లుపోసుకుని ఉండలు లేకుండా గరిటజారుగా కలపి పక్కనపెట్టుకోవాలి 
  • జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి పెట్టుకోవాలి. 
  • స్టవ్‌ మీద రెండు కప్పుల నీళ్లను వేడిచేయాలి. నీళ్లు బాగా మరిగినప్పుడు కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని నీళ్లలో వేసి తిప్పుతూ ఉడికించాలి. 
  • జొన్నపిండి మిశ్రమాన్ని సన్నని మంట మీద బాగా ఉడికిస్తూ..పిండి మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం తురుము వేసి స్టవ్‌ మీద నుంచి దించేయాలి. 
  • ఈ జావ చల్లారాక మజ్జిగ, కొత్తిమీర తరుగు, క్యారట్‌ తురుము వేసి సర్వ్‌ చేసుకోవాలి. ఈ జావ తాగితే శరీరం చల్లబడడమేగాక, బరువు తగ్గాలనుకునే వారు బరువు కూడా తగ్గుతారు. దీనిలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. 


బనాన మాల్ట్‌
కావలసినవి:  ఓట్స్‌ – అరకప్పు, పాలు – మూడు కప్పులు, దాల్చిన చెక్క పొడి – టీస్పూను, అరటి పండు – ఒకటి, తెనే – రెండు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ: ∙

  • ముందుగా జావకాచే పాత్రలో ఓట్స్, పాలు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ∙
  • తిప్పుతూ ఐదు నిమిషాలు ఉడికించిన తరువాత దాల్చిన చెక్కపొడి వేయాలి.
  • మిశ్రమం దగ్గర పడ్డప్పుడు.. చిదుముకున్న అరటి పండు, తెనే వేసి కలిపితే అరటి జావ రెడీ.
  • వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే ఇది చాలా బావుంటుంది.  ∙జావ మరీ మందంగా అనిపిస్తే నీళ్లు కలుపుకోవచ్చు. 


బార్లీ 
కావలసినవి:  బార్లీ గింజలు – రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – ఐదు కప్పులు, ఉప్పు – చిటికెడు, పంచదార – పావు కప్పు, పాలు – రెండు కప్పులు. 

తయారీ: 

  • ముందుగా బార్లీగింజలను దోరగా వేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి.
  • మందపాటి పాత్రలో ఐదు కప్పుల నీళ్లుపోసి మరిగించాలి ∙నీళ్లు మరిగేటప్పుడు బార్లీ పొడిని నీటిలో వేసి గరిటజారుడుగా కలుపుకోవాలి ∙
  • మరుగుతున్న నీటిలో ఈ గరిటజారుడు పిండిని వేసి తిప్పుతూ ఉడికించాలి.
  • ఐదునిమిషాల తరువాత ఉప్పు, పంచదార, పాలు వేసి ఉడికించాలి ∙మిశ్రమం దగ్గరపడిన తరువాత స్టవ్‌మీద నుంచి దించేసి సర్వ్‌చేసుకోవాలి. 


ఓట్స్‌
కావలసినవి: ఓట్స్‌ – కప్పున్నర‡ క్యారట్‌ ముక్కలు – అరకప్పు, బంగాళ దుంప ముక్కలు – అరకప్పు, పచ్చిబఠాణి – అరకప్పు, మిరియాల పొడి – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా 

తయారీ: ∙

  • ముందుగా ఓట్స్‌ను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి 
  • వేయించిన ఓట్స్‌లో బంగాళ దుంప ముక్కలు, పచ్చిబఠాణి, క్యారట్‌ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు,నాలుగు కప్పులు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి ∙
  • ముక్కలన్ని ఉడికి మిశ్రమం దగ్గర పడినప్పుడు ఉప్పు, మిరియాలపొడి వేసి దించేస్తే ఓట్స్‌ జావ రెడీ. 


మల్టీగ్రెయిన్‌  
కావలసినవి:  మల్టీ గ్రెయిన్స్‌ పొడి – నాలుగు టేబుల్‌ స్పూన్లు( జొన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు, సిరిధాన్యాలు, బాదం పప్పు, అవిసె గింజలను తీసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి), బియ్యం – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మజ్జిగ – నాలుగు గ్లాసులు 

తయారీ: ∙

  • గిన్నెలో నాలుగు గ్లాసులు నీళ్లు బియ్యం పోసి మరిగించాలి. ∙నాలుగు టేబుల్‌ స్పూన్ల మల్టీగ్రెయిన్‌ పొడిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపి పెట్టుకోవాలి. ∙
  • నీళ్లు మరిగిన తరువాత కలిపిపెట్టుకున్న మల్టీ గ్రెయిన్‌ పొడి వేయాలి. ∙
  • ఉడుకుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించేయాలి. ∙చల్లారాక మజ్జిగ వేసి సర్వ్‌ చేసుకోవాలి. 


రాగి 
కావలసినవి:  రాగి పిండి – మూడు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు రెండు కప్పులు, మజ్జిగ – ఒకటిన్నర కప్పులు, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి) పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు – ఒక రెమ్మ. 

తయారీ: ∙

  • రాగిపిండిలో కొద్దిగా నీళ్లుపోసి ఉండలు లేకుండా కలపుకోవాలి ∙స్టవ్‌ మీద గిన్నె పెట్టి కప్పున్నర నీళ్లుపోసి మరిగించాలి ∙
  • నీళ్లు మరిగేటప్పుడు కలిపి పెట్టుకున్న రాగిపిండి వేసి కలపాలి
  • ఐదు నిమిషాలు ఉడికాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలిపి దించేయాలి. ∙
  • చల్లారకా సర్వ్‌ చేసుకుంటే రాగి జావ ఎంతో రుచిగా ఉంటుంది. 


సగ్గుజావ 
కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, నీళ్లు – ఆరు కప్పులు, మజ్జిగ – రెండు గ్లాసులు, ఉప్పు – రుచికి సరిపడా. 

తయారీ: ∙

  • ముందుగా సగ్గుబియ్యాన్ని రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి నీటిని వంచేయాలి ∙సగ్గుబియ్యం మునిగే అన్ని నీళ్లుపోసి ఆరుగంటలపాటు నానబెట్టుకోవాలి 
  • జావతయారు చేసుకోవడానికి మందపాటి పాత్ర తీసుకుని ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. 
  • నీళ్లు మరిగాక నానిన సగ్గుబియ్యాన్ని వడగట్టి వేడినీటిలో వేసి మూతపెట్టకుండా సన్నని మంటమీద ఉడికించుకోవాలి ∙మధ్య మధ్యలో తిప్పుతుండాలి
  • సగ్గుబియ్యం ఉడికిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించేసి చల్లారనివ్వాలి. ∙
  • సగ్గుబియ్యం జావ పూర్తిగా చల్లారిన తరువాతే జావలో మజ్జిగ పోసి కలపాలి.(జావ వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ పోస్తే మజ్జిగ విరిగిపోతాయి) ∙మజ్జిగ కలిపాక రుచికి సరిపడా ఉప్పు వేసి సర్వ్‌ చేసుకోవాలి. ∙
  • ఈ జావ తాగడం వల్ల ఒంట్లోని వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది  ∙ఉడికించిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేసుకోని రోజూ కొద్దిగా మజ్జిగలో కలుపుకుని  తాగవచ్చు. 


రవ్వ జావ 
కావలసినవి:  ఆయిల్‌ – టేబుల్‌ స్పూను, సన్నని గోధుమ రవ్వ – కప్పు, బాదం పాలు – రెండున్నర కప్పులు, యాలకులపొడి – ముప్పావు టీస్పూను, డ్రైఫ్రూట్స్‌ పలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు, పంచదార – పావు కప్పు, కిస్‌మిస్‌లు – టేబుల్‌ స్పూను, పిస్తా, కుంకుమ పువ్వు – గార్నిష్‌కు సరిపడా.  

తయారీ:

  • ముందుగా వేడెక్కిన బాణలిలో ఆయిల్‌ వేయాలి. దీనిలో గోధుమ రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ∙
  • రవ్వ వేగాక బాదంపాలు, యాలకులపొడి, డ్రైఫ్రూట్స్‌ వేసి ఉడికించాలి 
  • రవ్వ దాదాపు ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి, మూతపెట్టి సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించాలి. ∙
  • పదినిమిషాల తరువాత ఉడికిన మిశ్రమంపై పిస్తా, కుంకుమ పువ్వు చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement