కన్నుతో కవితలు – ముత్యపు చిప్ప నుంచి జీవన రేఖలు | Tribute To Penchukalapadu Narasimhareddy | Sakshi
Sakshi News home page

కన్నుతో కవితలు – ముత్యపు చిప్ప నుంచి జీవన రేఖలు

Published Mon, Aug 24 2020 12:01 AM | Last Updated on Mon, Aug 24 2020 12:06 AM

Tribute To Penchukalapadu Narasimhareddy - Sakshi

‘ఆత్మహత్య పిరికిపంద చర్య కాదు. లోకంపై జీవితాన్ని విసిరేసిన ఒక నిరసన’ అని అనడమే ఒక సంచలనం. ఆ మాట చెప్పడం ఎంత సాహసం! ఎప్పుడో అయిదు దశాబ్దాల క్రితమే ఓ కన్ను సంచలనం సృష్టించింది. తిరగబడమంది. దాని పేరు ‘ఐ’. ముత్యపు చిప్పలోంచి పరుచుకుంటున్న జీవిత రేఖలు. ఆ రేఖల్లో ఎక్కడా అస్పష్టత లేదు. వాటిలో ఒక భయం కనిపిస్తుంది. ఒక లాలన కనిపిస్తుంది. ఒక ప్రార్థన కనిపిస్తుంది. ప్రేమ కనిపిస్తుంది. నిశ్శబ్దంగా జీవన సంగీతం వినిపిస్తుంది. ఆ గీతల వ్యక్తీకరణ పేరు ‘శుక్తి’. అదొక అజ్ఞాత శక్తి. చిత్ర ప్రపంచంలో ‘శుక్తి’(ముత్యపుచిప్ప)గా, కవితా లోకంలో ‘ఐ’గా ప్రసిద్ధులైన  భాషా శాస్త్రవేత్త ఆచార్య పీసీ నరసింహారెడ్డి కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ  హైదరాబాదులో ఆగస్టు 19న కన్ను మూశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ భాషాశాస్త్ర విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తూ, పదిహేడేళ్ళ క్రితం ఉద్యోగవిరమణ చేశారు. మాటల్లో పొదుపరి. నమ్మిక కలిగితే తప్ప నోరు విప్పరు. అర్థం చేసుకోకపోతే ఆయనే కాదు, ఆయన గీతలు, రాతలు కూడా సందిగ్ధమే!

శ్రీకాకుళ ఉద్యమం రగులుకుంటోంది. ఈ ఉద్యమంతో ప్రభావితులైన పది మంది యువకులు ‘తిరగబడు’ కవులుగా తమ గొంతులను వినిపించారు. వారిలో ‘ఐ’ పేరుతో ‘తిరగబడు’ కవిత రాసింది పీసీఎన్‌. తిరగబడు కవుల్లో వరవరరావు, కిషన్‌ రావు, లోచన్, టంకశాల అశోక్, ఎక్స్‌రే (శ్రీపతి), ఐ(పీసీఎన్‌), వడ్డేపల్లి సుధాకర్, దేవులపల్లి సుదర్శన్, పెండ్యాల యాదగిరిరావు,   నెల్లుట్ల సంజీవరావు ఉన్నారు. ఆనాడు తిరగబడు కవులకు ప్రేరణ నిచ్చింది శ్రీకాకుళ పోరాటంతో పాటు వియత్నాం యుద్ధం కూడా. ‘ఆత్మహత్య’ పిరికిపంద చర్యకాదు. ఆత్మహత్య చేసుకోడానికి కూడా ధైర్యం కావాలి. సమాజానికి ఒక పెద్ద నిరసన తెలియచేయడం’ అంటారు  నరసింహారెడ్డి. ‘ఆత్మహత్య’ రాసింది ఎవరనేది చాలా కాలం వరకు తెలియదు. ఆ కవిత రాసింది వీరేనని తెలుసుకున్న చెరబండ రాజు ‘ఆత్మహత్య చేసుకుంది మీరేనా’ అన్నారు నవ్వుతూ. విరసం ఏర్పడినప్పుడు నరసింహారెడ్డి అక్కడే ఉన్నా, దానితో భావ బంధాలు ఏర్పరచుకున్నా, సభ్యత్వం మాత్రం తీసుకోలేదు. రచయితలు రచనలు చేస్తే సరిపోతుంది, ఉపన్యాసాలు చేయనవసరం లేదనేవారు. ఉస్మానియాలో చదువుకునే రోజుల్లో నరసింహారెడ్డి ఉండే హాస్టల్‌ గది నంబరు 14 సాహిత్య చర్చావేదికగా తయారైంది. అప్పుడే దిగంబర కవులు, చలసాని ప్రసాదరావుతో పరిచయాలు  ఏర్పడ్డాయి. శ్రీశ్రీ, తాపీ ధర్మారావు లాంటి వారొస్తే గంటల తరబడి గడిపేవారు. 

పాత మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల సమీపంలోని గట్టు మండలం పెంచుకలపాడు నరసింహారెడ్డి స్వగ్రామం. ఆ ఊళ్లో రెండు పెద్ద బండరాళ్ళు పెనవేసుకుని ఉన్నాయి. ఆ రెండు రాళ్ళ మధ్య రంగనాథ స్వామి విగ్రహం ఉంది. ‘పెనుచుకల్‌’ అంటే పెనవేసుకున్న అన్న అర్థం కనుక ఆ ఊరికి ఆ పేరు వచ్చి ఉండవచ్చని వారి భావన. ఆ గ్రామంలో వీరిది సంపన్న కుటుంబం. వాళ్లింట్లో చాలా గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు ఉండేవి. తెలుగు సంస్కృత భాషలు ఇంటి వద్దే నేర్చుకున్నారు. పర్షియన్, ఉర్దూ భాషలు నేర్చుకోవడానికి తండ్రి మున్షీని పెట్టారు కానీ, అవి అబ్బలేదు. గద్వాలలో హైస్కూలు వరకు చదువుకున్నారు. హైస్కూలు చదివే రోజులలోనే బొమ్మలు వేయడం ప్రారంభించారు. అసలు శాంతినికేతన్‌ వెళదామనుకున్నారు. అంత దూరం వెళ్ళడం తండ్రికి ఇష్టం లేదు. హైదరాబాదు వెళ్లి పీయూసీ సైన్స్‌ గ్రూపులో చేరారు. కప్పల్ని, పాముల్ని కోయడం ఇబ్బందిగా ఉండేది. మెడిసిన్‌లో చేరే అవకాశం ఉన్నప్పటికీ ఆ కారణం చేతనే చేరలేదు. వారిది శాకాహార కుటుంబం. కనీసం కోడిగుడ్లు కూడా తినరు. బీఏలో సాహిత్యం ప్రధానాంశంగా తీసుకున్నారు.

ఓ రోజు సి.నారాయణ రెడ్డి కుమార సంభవం చెబుతున్నారు. ‘ఈగరలోడంగ మదనుడు డెంతయు భీతిల్లెనో’ అన్న పద్యం చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నరసింహారెడ్డి లేచి ‘ఈగరలోడంగ అన్న పదానికి అర్థమేమిటి సర్‌’ అని ప్రశ్నించారు. ‘నువ్వు అడుగుతావని నాకు తెలుసు. అందుకే ఇంట్లో నా దగ్గరున్న డిక్షనరీలన్నీ తిరగేశాను. ఎక్కడా ఆ పదానికి అర్థం దొరకలేదు.  ఏం చేయను?’ అనే సరికి నరసింహారెడ్డి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సభారంజకం కోసం సినారె తరువాత మాటల గారడీ నేర్చుకున్నారు కానీ, ఆ రోజుల్లో ఆయన పాఠం చెపుతూ వేరే లోకాలకు తీసుకు వెళ్ళేవారు అని నరసింహారెడ్డే అన్నారు నాతో.

ఒక రోజు భద్రిరాజు కృష్ణమూర్తి విద్యార్థులకు పరీక్ష పెట్టారు. ఈయన రాయలేదు. భద్రిరాజు తన గదికి పిలిపించి ‘ఎందుకు రాయలేదు’ అని ప్రశ్నించారు. ‘నాకు రాయాలనిపించలేదు’ అన్నారు. ‘ఎందుకు రాయాలనిపించలేదు’ అని మళ్ళీ ప్రశ్న వేశారు. ‘మూడ్‌ సరిగా లేదు’ అన్నది సమాధానం. ‘మూడు తెచ్చుకుని రాయి’ అన్నారు. ‘నేనసలు చదవలేదు’ అని అసలు విషయం చెప్పేశారు. వెంటనే భద్రిరాజు కాఫీ తెప్పించారు. పరీక్ష రాయక తప్పలేదు. ఆ పరీక్షలో నరసింహారెడ్డికి 85 మార్కులు వచ్చాయి. 
హైస్కూలులో ఉండగానే శ్రీశ్రీని, చలాన్ని చదివారు. శ్రీశ్రీని చదివినప్పుడు ఆయనలో పెను మార్పు సంభవించింది. సిద్ధార్థుడిలాగా నరసింహారెడ్డికి కూడా దారిద్య్రం అనుభవంలోకి రాకపోయినప్పటికీ హైదరాబాదు వచ్చాక కళ్ళారా చూశారు. హైదరాబాదు వచ్చాకే గ్రామీణ జీవితానికి, నగర జీవితానికి మధ్య ఎంత అగాధం ఉందో వారికి అర్థమైంది. చలం నాటకాలన్నా, ముద్దు కృష్ణ అశోకం అన్నా, మను చరిత్ర అన్నా చాలా ఇష్టం.

ఎస్వీ యూనివర్సిటీలోని తెలుగు అధ్యయన శాఖలో భాషాశాస్త్రం బోధించడానికి అధ్యాపకులుగా చేరి అక్కడే ఆచార్యులుగా పదోన్నతి పొందారు. భాషాశాస్త్రాన్ని తెలుగులో బోధించ కూడదని, ఇంగ్లిషులోనే బోధించాలన్నది వారి వాదన. ఎస్వీ యూనివర్సిటీలో భాషా శాస్త్రానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి విభాగాధిపతి అయ్యారు. 
‘సృజన’ పత్రిక అక్షరాలు నరసింహారెడ్డి రాసినవే. అంపశయ్య నవలను సృజనలో సీరియల్‌గా వేసినప్పుడు సృజన అక్షరాలు శీలా వీర్రాజు చేత రాయించారు. పాఠకులలో కొంత వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళీ నరసింహారెడ్డి రాసిన అక్షరాలే వాడుతున్నారు. శ్రీశ్రీ మరో ప్రస్థానానికి అట్టబొమ్మ వేసింది వీరే. గోదావరి ప్రవహించు కవితా సంకలనానికి కూడా వీరు అట్టబొమ్మ వేశారు. నార్ల చిరంజీవి ‘కొమ్మలు–రెమ్మలు’ కవితలకు వేసిన బొమ్మలను బాపూ చూసి ‘ఇంత ప్రతిభావంతుడు తన ప్రతిభను వృథా చేసుకుంటున్నాడు’ అన్నారు. చలసాని ప్రసాదరావు సంపాదకత్వంలో అయిదారు సంచికలు వచ్చిన ‘కళ’కు బొమ్మలు వేశారు. ఒకళ్ళు వేయమంటే బొమ్మలు వేయనని, తనకు నచ్చితేనే వేస్తానని చెప్పిన కచ్చితమైన మనిషి. ‘గీత లయాత్మకంగా ఉండాలి. ఎంత తక్కువ రేఖల్లో చూపగలిగితే అంత మంచి చిత్రమవుతుంది. రంగుల దృశ్యాల్ని రేఖల్లో తీసుకు రావాలనే ప్రయత్నంలో చాలా మంది ఎక్కువ రేఖల్ని గీస్తుంటారు. రంగుల చిత్రాల సృష్టిలో చాలా ప్రయత్నాలు జరిగాయి. రేఖల సృష్టిలో అలా జరగలేదు. రంగుకు సహాయకంగా మాత్రమే రేఖను వాడుతున్నారు. కానీ, రేఖల ప్రాధాన్యత రేఖలకు ఉంది’ అంటారాయన. 

వారి ఉద్యోగ పర్వమంతా తిరుపతిలోనే గడిచిపోయినప్పటికీ ఇల్లు కట్టుకోలేదు. ఎప్పటికైనా పెంచుకలపాడుకు వెళ్ళి పోయి రేఖలపై ప్రయోగాలు చేయాలనుకున్నారు. రిటైరైన తరువాత కొంత కాలం అక్కడే ఉన్నారు. తరువాత నివాసాన్ని హైదరాబాదుకు మార్చారు. తెలుగు భాషకు సంబంధించిన అనేక పద్య చమత్కారాలను ఫేస్‌బుక్‌లో ఈ మధ్య కాలం వరకు పెడుతూ, ఎంతో ఉత్సాహంగా సమాధానాలు చెపుతూ ఉండేవారు. ఇంతలోనే ఉన్నట్టుండి ఎవరికీ చెప్పకుండా ఈ లోకంనుంచి  నిష్క్రమించారు. ప్రతిభావంతుడైన పీసీఎన్‌ తన ప్రతిభనంతా చాలా మటుకు అజ్ఞాతంలోనే ఉంచి నిష్క్రమించడం తెలుగు సమాజానికి పెద్ద లోటు.
రాఘవశర్మ
ఆచార్య పి.సి.నరసింహారెడ్డి : 3 జూలై 1943 – 19 ఆగస్టు 2020 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement