సోమవారం రాత్రి కలర్స్ టీవీలో ‘బారిస్టర్ బాబు’ సీరియల్ చూస్తున్నవారికి 8 ఏళ్ల బందితను అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలన్నంతగా భావావేశం కలిగి ఉంటుందనే అనిపిస్తోంది. ఇలా అనిపించడానికి కారణం ఆ మర్నాటి నుంచీ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న Anidita Against Molestation అనే ట్యాగ్. బందిత భర్త (అవును భర్తే) 22 ఏళ్ల అనిరుథ్ పేరు కూడా కలిపి Anidita అనే మాటను ట్విటిజెన్‌లు కాయిన్ చేసి తాజా ట్రెండ్ ను నడిపిస్తున్నారు. ‘లా’ చదివి సమాజంలోని దురాచారాలపై పోరాటం చేస్తున్న అనిరుథ్.. బందితను బాల్య వివాహం నుంచి కాపాడే ప్రయత్నంలో ఆమెను తన భార్యగా చేసుకోవలసి వస్తుంది. భర్తగా ఉండలేడు కనుక ప్రొటెక్టర్ గా ఉంటాడు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెబుతాడు. అలా చెప్పాక ప్రసారం అయినదే సోమవారం నాటి ఎపిసోడ్. అందులో ఓ పెద్దమనిషి బందితను టచ్ చేస్తాడు. ఫాలో అప్‌గా బందిత.. ఇంట్లో అందరిముందూ అతడిని నిలబెట్టి ఎంతో ఆవేశంగా, ఆగ్రహంగా, ఆవేదనగా, పెద్దగా ఏడుస్తూ బ్యాడ్ టచ్‌ని ప్రశ్నించిన తీరులోని డైలాగ్ డెలివరీ, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకుల హృదయానికి హత్తుకున్నాయి. ఆ అమ్మాయిలో అంతగా కాన్షస్‌నెస్ కలిగించిన ఆమె భర్తను కూడా ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది. (ఇఫ్ పాజిబుల్). ఈ భార్యాభర్తల పేరుతో ట్రెండింగ్‌లో ఉన్న ట్విట్టర్ మూవ్మెంట్ పై స్టోరీ.
పందొమ్మిదో శతాబ్దపు ఆరంభం నాటి థీమ్‌తో ఈ నెల 11 నుంచి కలర్స్ టీవీలో ‘బారిస్టర్ బాబు’ అని ఒక బెంగాలీ సీరియల్ వస్తోంది. ఏ శతాబ్దంలో ఉన్నాం అనిపించవచ్చు. ఉండటానికి మనం 21వ శతాబ్దంలోనే ఉన్నప్పటికీ బాల్య వివాహాలనేవి ఇప్పటికీ ఉన్నాయి కనుక మనం ఇంకా ఆనాటి కాలంలోనే ఉన్నట్లు.. స్వాతంత్య్ర సంగ్రామ సమరానికి పూర్వపు కాలంలో! దాస్యం నుంచి విముక్తి లభించింది కానీ.. దురాచారాలనే వదిలించుకోలేకున్నాం. చట్టాలున్నా అవి మనిషిని మార్చడం లేదు. ఇప్పుడీ బారిస్టర్ బాబు కొంచెం మార్చేట్లే ఉంది. మార్చడం అంటే ఆలోచనలోకి నెట్టేయడం. నెట్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది.
ఈ సీరియల్ చూస్తున్నవారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ట్విటిజెన్‌లు ఒక జట్టు కట్టారు. ఆ జట్టుకు ‘అనిదిత అగైన్‌స్ట్ మోలెస్టేషన్’ అని ఒక పేరు పెట్టారు. అదిప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఉంది కాదు. ట్రెండింగ్ అవుతూ ఉంది. ‘అనిదిత అగైన్‌స్ట్ మోలెస్టేషన్’ అంటే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అనిదిత పోరాటం అని. అనిదిత ఎవరు? ఒకరు కాదు ఇద్దరు. బందిత. అనిరుథ్. ఇద్దర్నీ కలిపి అనిదిత అంటున్నారు. సీరియల్‌లో ఇద్దరూ కలిసి మహిళా సమస్యలపై మాట్లాడతారు. వేలు చూపిస్తారు. బందితకు 8 ఏళ్లు. పూర్తి పేరు బందితాదాస్. అనిరుథ్‌కు 22 ఏళ్లు. అనిరుథ్ రాయ్ చౌధరి. ఇద్దరూ భార్యాభర్తలు! అదేంటి ? బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తీసిన సీరియల్‌లో బాల్య వివాహం ఏమిటి? దానికో కథ లేకుండా ఉంటుందా?
∙∙
‘బారిస్టర్ బాబు’ సీరియల్ మొదలై పదిహేను రోజులు అవుతున్నప్పటికీ మొన్నటి ఎపిసోడ్‌తో మాత్రమే కథలో ఫోర్స్ మొదలైంది! ఆ ఫోర్స్‌కు మొదలెక్కడో తెలియకపోతే ట్విటిజెన్‌లు ఎందుకు ఇంతలా ఈ సీరియల్‌లోని భార్యాభర్తలకు మద్దతుగా స్పందిస్తున్నారో అర్థకాదు. అనిరుథ్ లండన్‌లో ‘లా’ చదివి ఇండియా వస్తాడు. సమాజంలోని దురాచాలను, మూఢ నమ్మకాలను, లింగవివక్ష, స్త్రీ, పురుష అసమానతలను నిర్మూలించాలని అతనికి బలంగా ఉంటుంది. ఆ సమయంలో.. బందితను బాల్య వివాహం నుంచి కాపాడే ప్రయత్నంలో తనే ఆమెకు భర్త అవాల్సి వస్తుంది. ఇకప్పుడు బందితకు లోకం తీరు గురించి చెప్పడం, ఆమెను లోకం నుంచి సంరక్షించడం అతడి తొలి బాధ్యత అవుతుంది. భర్తగా ఉండలేడు. రక్షకుడిలా ఉంటాడు. మొదట ఆ చిన్నారికి గుడ్ టచ్‌కి, బ్యాడ్ టచ్‌కి ఉండే తేడాను అర్థమయ్యేలా చెబుతాడు. ఆ తర్వాత జరిగిన కథే మొన్న ప్రసారం అయిన ఎపిసోడ్.
ఆ ఇంట్లో ఠాకూర్ అనే యాభై ఏళ్లు దాటిన పెద్ద మనిషి ఓ రోజు బందితను టచ్ చేస్తాడు. అది బ్యాడ్ టచ్! ఒంటిమీద బ్యాడ్ టచ్ పడినప్పుడు మౌనంగా ఉండకూడదని, బ్యాడ్ టచ్ చేసినవాళ్లెవరో భయపడకుండా అందరికీ చెప్పాలనీ, నీకు నువ్వుగా కూడా బ్యాడ్ టచ్ చేసినవాళ్లను సహించకూడదు అని బందితకు చెప్పి ఉంటాడు అనిరుథ్. అతడు స్నానానికి వెళ్లొచ్చేలోగా ఠాకూర్ ఆమెపై చెయ్యి వేస్తాడు. బందిత పెద్దగా అరుస్తుంది. అనిరుథ్‌కి విషయం తెలిసి ఠాకూర్‌పై చెయ్యి చేసుకుంటాడు. వెక్కిళ్లు పెడుతున్న బందిత వైపు చూసి, ‘ఠాకూర్ చేసిన తప్పుకు ఏం శిక్ష వేస్తావో వెయ్యి’ అని అంటాడు. బందిత కూడా ఠాకూర్‌ని చెంపదెబ్బ కొడుతుంది. తనకేం తెలియదని అమాయకత్వం నటిస్తాడు ఠాకూర్. బందిత కోపం పట్టలేకపోతుంది. అతడిది కచ్చితంగా బ్యాడ్ టచ్చేనని, అది తనకు తెలుసునని పెద్దగా అరిచి చెబుతుంది. అలా చెబుతున్నప్పుడు ఆవేశం, ఆగ్రహం, దుఃఖం బందితను ఊపేస్తాయి.
అతి సున్నితమైన ఆ సన్నివేశం చూసి ప్రేక్షకులు బాగా కదలిపోయారు. పర్యవసానమే ట్విట్టర్‌లో ప్రారంభమైన ‘అనిదిత అగైన్‌స్ట్ మోలెస్టేషన్’. నవ వధూవరులైన పాత్రలు.. బందిత, అనిరుద్‌లకు సపోర్ట్‌గా వేల ట్వీట్‌లు వస్తున్నాయి. ‘బాలికలకు రక్షణగా వారిని కనిపెట్టుకుని ఉండటమే కాదు, వారిని వారు కనిపెట్టుకుని ఉండటం ఎలాగో కూడా వారికి నేర్పాలి’ అనేది ఆ ట్వీట్‌లలోని అంతస్సారం. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాన్ని బందిత పాత్రతో టచింగ్‌గా చెప్పించినందుకు ఈ సీరియల్ నిర్మాతల్ని, దర్శకుల్ని నెటిజెన్‌లు ప్రశంసిస్తున్నారు.
యు ఆర్ జెమ్ మ్యాన్
గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై ఆ ఎపిసోడ్ ప్రసారం అయ్యాక బందితకు, అనిరుథ్ రాయ్ చౌధురికి ఫ్యాన్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. వాళ్లపై అభినందనల ట్వీట్‌లు కురుస్తున్నాయి. ‘ఎ.ఆర్.సి.. యు ఆర్ ఎ జెమ్ మ్యాన్’ అని అనిరుథ్‌ని ఒకరంటే, బందితా.. ‘నీకంత కోపం రావడం సహజమే’ ఇంకొకరు సపోర్ట్ చేశారు. ‘‘భయం వల్ల మన ఆడపిల్లలం ఏదీ పైకి చెప్పుకోలేం. కానీ మనం మౌనంగా ఉండిపోకూడదు. బందితలా అందరికీ వినిపించేలా పెద్దగా చెప్పాలి’ అని షానామా అనే నెట్ యూజర్ కామెంట్ పెట్టారు. స్వాతంత్య్రానికి పూర్వం ఎ.ఆర్.సి.లు అవసరం అయ్యారు. (అనిరుథ్ రాయ్ చౌధురి). ఇప్పుడూ ఎ.ఆర్.సి.లు అవసరం అవుతున్నారు’ అని మోనా అనే ట్విటిజన్ ఆవేదన చెందారు. ‘‘అబ్బ! మొన్నటి ఎపిసోడ్ ఫాంటాస్టిక్. అదెలాగుందో చెప్పడానికి నాకసలు మాటలే రావడం లేదు. ఠాకూర్‌పై అలా అరిచేస్తుంటే చిన్నారి బందితలో నాకు ఒక శక్తిమంతమైన మహిళ కనిపించింది. సచ్ యాన్ అమేజింగ్ ఎపిసోడ్’ అని అవని అనే నెటిజెన్ షేర్ చేసుకున్నారు.
బందితగా బాల నటి ఆరా భట్నాగర్ బడోని, అనిరుథ్‌గా ప్రవిష్ట్ మిశ్రా నటించిన ఈ ‘బారిస్టర్ బాబు’ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ రాత్రి గం. 8.30 కి ప్రసారం అవుతోంది. అరగంట ఎపిసోడ్.
Comments
Please login to add a commentAdd a comment