లక్నోలోని నిరుపేద పిల్లలు ప్రముఖ డిజైనర్ సబ్యసాచి స్ఫూర్తితో పెళ్లి దుస్తులను రూపొందించారు. ఈ విషయాన్ని సూచిస్తూ తీసిన వీడియోను ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వారు రూపొందించిన బ్రైడల్ వేర్‌ను ధరించి, మోడలింగ్ చేసిన వాళ్లలోనూ పేద పిల్లలూ ఉన్నారు.ఫ్యాషన్ పరిశ్రమపై సబ్యసాచి ముఖర్జీ ప్రభావం అతని అద్భుతమైన డిజైన్ లకు మించి విస్తరించింది. దీంతోపాటు భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ హస్తకళనూ ్రపోత్సహిస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ ‘ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్’ మార్గదర్శకత్వంలో సబ్యసాచి కళాఖండాలు, అతని దిగ్గజ డిజైన్ లు ఇప్పుడు లక్నోలోని నిరుపేద పిల్లల బృందానికి స్ఫూర్తినిచ్చాయి.
ఈ నిరుపేద యువ డిజైనర్లు సగర్వంగా తమ క్రియేషన్ లను ధరించి కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో పోజులిచ్చారు. ’మేం లక్నో ఆధారిత ఎన్జీవోతో కలిసి 400 మంది నిరుపేద పిల్లలతో కలిసి పని చేస్తున్నాం. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం. ఈ దుస్తులను మా విద్యార్థులు రూపొందించారు. ఇందులో ప్రదర్శనలు ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల నుండి వచ్చినవారే. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులు, చుట్టుపక్కల వ్యక్తుల నుండి స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందే అన్ని దుస్తులను రీయూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు.
సబ్యసాచి సోషల్ మీడియా అకౌంట్‌లో మోడల్ దుస్తులను చూసిన తర్వాత వారు ఇలాంటి డిజైన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్ ఎన్జీవో తెలిపింది. ప్రతిరోజూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శ్రద్ధగా కృషి చేస్తున్న 15 ఏళ్ల ఉత్సాహవంతమైన పిల్లలు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ కామెంట్స్ విభాగంలో హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం ద్వారా వారికి తన ఆశీస్సులను, ప్రశంసలను అందజేశాడు. అంతేకాదు, ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఈ పిల్లలకు మరింత శక్తి... ప్రేమ, ఆశీర్వాదాలు అందాలి..’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment