Valentine's Day: Nick Vujicic-Kanae Miyahara Beautiful Love Story - Sakshi
Sakshi News home page

Nick Vujicic- Kanae Miyahara: ‘పరిపూర్ణతే’ అర్హతా? వాళ్లది నిజమైన ప్రేమ.. నలుగురు పిల్లలతో ముచ్చటగా..

Published Tue, Feb 14 2023 1:31 PM | Last Updated on Wed, Feb 15 2023 10:48 AM

Valentines Day: Nick Vujicic Kanae Miyahara Beautiful Love Story True Love - Sakshi

నిక్‌ వుజిసిక్‌- కనే మియహార(PC: Instagram)

‘లవ్‌ వితౌట్‌ లిమిట్స్‌’.. అవధుల్లేని ప్రేమ
ప్రేమంటే.. 
ఒకరిపై ఒకరికి నమ్మకం
ఎదుటి వ్యక్తిని అచ్చంగా ఇష్టపడటం
గుణం, రూపం, వ్యక్తిత్వం.. ఒక్కటేమిటి మొత్తంగా ఓ మనిషిని ‘నా’ అనుకునే ఫీలింగ్‌!
ఇష్టపడ్డ వ్యక్తిలోని సుగుణాలే తప్ప ‘లోపాల’ని మైనస్‌లా చూడలేని ఆరాధ్య భావన!
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్ని వర్ణనలైనా సరిపోవు..!!


PC: Instagram

మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న మాటకు నిలువెత్తు రూపం అతడు..
దృఢసంకల్పం ఉంటే విధికి ఎదురొడ్డి జీవనమాధుర్యాన్ని ఆస్వాదించొచ్చని నిరూపించిన స్ఫూర్తిప్రదాత..

అతడి ఆత్మవిశ్వాసం.. ఆకాశాన్ని తాకే శిఖరం..
అతడి బతుకు పోరాటం.. నిరాశలో కూరుకుపోయిన వారికి ఆశాకిరణం..
అతడి చిరునవ్వు.. ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులో ఉన్నవారిని మార్చేసే ఆయుధం..
అతడి మాటలు.. కోట్లాది మందిలో నిస్పృహను వదిలించి నూతనోత్తేజాన్ని నింపే ఔషధపు చుక్కలు


PC: Instagram

Valentine's Day 2023: Nick Vujicic- Kanae Miyahara Love Story In Telugu:
బయటి నుంచి చూసే వారికి అతడంటే ఇంతే!
మరి ‘అసలైన అతడు’ ఎలా ఉంటాడు? తనకూ ఇష్టాయిష్టాలు ఉంటాయి.. తన జీవితం ఇలానే ఉండాలనే కోరికలు.. తనకంటూ భార్య, పిల్లలతో ముచ్చటైన కుటుంబం కావాలన్న తపన..

కానీ పుట్టుకతోనే ‘ఇంపర్ఫెక్ట్‌’ అంటూ ముద్ర.. ఒకానొక దశలో చచ్చిపోదామన్నంతగా కుంగుబాటు.. కానీ అమ్మానాన్నలు తనను కాపాడి పునర్జన్మను ఇచ్చారు. తమ స్వచ్ఛమైన ప్రేమతో అతడి ఆలోచనలు మార్చివేశారు.. ‘‘దేవుడిచ్చిన గొప్ప బహుమతి నువ్వు.. కాకపోతే అందరి కంటే ఇంకాస్త గొప్పగా ఉన్నావు’’ అంటూ స్ఫూర్తిని నింపారు. 

ఇష్టమని పక్కకు తప్పుకొన్నారు
టీనేజ్‌లో ఎంతో మంది అమ్మాయిలు నువ్వంటే ఇష్టమన్నారు.. కొన్నాళ్లు డేటింగ్‌ చేశారు.. కానీ సెట్‌ అవ్వదని పక్కకు తప్పుకొన్నారు.. చాలా వరకు అన్నీ చేదు అనుభవాలే.. ట్వంటీస్‌లోకి వచ్చే సరికి తనిక ఫిక్సైపోయాడు. తన జీవితంలోకి ఇక ఏ అమ్మాయి రాదు.. తనను తనలా ప్రేమించలేదు.. తనతో లైఫ్‌ షేర్‌ చేసుకోలేదు! కానీ ఆమె రాక అతడి జీవితంలో వసంతాలు పూయించింది..


PC: Instagram

ఆమె అతడిని నిజంగా ప్రేమించింది
అతడి మనోసౌందర్యాన్ని మెచ్చి.. భార్యగా బంధాన్ని పెనవేసుకున్న ఆమె.. అతడితో తన ప్రేమకు ప్రతిరూపాలుగా నలుగురు అందమైన పిల్లలను బహుమతిగా ఇచ్చింది. ఆమె ప్రేమను గెలుచుకున్న రియల్‌ హీరో నిక్‌ వుజిసిక్‌.. ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌. అతడితో జీవితాన్ని పంచుకున్న ఆమె పేరు కనే మియహార. 

రేర్‌ డిజార్డర్‌
బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆస్ట్రేలియా దంపతులకు 1982, డిసెంబరు 4న నిక్‌ జన్మించాడు. ‘ఫోకోమెలియా’ అరుదైన డిజార్డర్‌ కారణంగా కాళ్లూ, చేతులూ లేకుండా పుట్టిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.  కానీ దేవుడిపై మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు.


PC: Instagram

కేవలం తమ జీవితాల్లోనే కాదు.. చిన్న చిన్న లోపాలకే డిప్రెషన్‌లో కుంగిపోయే లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపేలా.. ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్‌ని మలచుకుంటామని మనసులో సంకల్పించుకున్నారు.

చిరు నవ్వుతోనే
అందుకు తగ్గట్లే తమ కుమారుడిని సాధారణ పిల్లల్లాగే పెంచారు. స్విమ్మింగ్‌ చేయడం సహా పలు ఆటలాడటం నేర్పించారు. తోటి వాళ్లు అవహేళన చేసినా చిరునవ్వుతోనే వాటిని ఎలా తిప్పికొట్టాలో నేర్పించారు.

ఎంత నిలదొక్కుకుందామని చూసినా ఒక్కోసారి హేళనలు శ్రుతిమించినపుడు.. అందరూ తనని పక్కన పెట్టినపుడు.. ఒంటరితనం నుంచి పారిపోయేందుకు తనను తాను అంతం చేసుకోవాలని భావించాడు నిక్‌. అయితే, అదృష్టవశాత్తూ అమ్మానాన్నలు అతడిని కాపాడుకోగలిగారు.


PC: Instagram

ఇంపర్ఫెక్ట్‌ ఈజ్‌ పర్ఫెక్ట్‌
‘‘నువ్వు ఎంత అసంపూర్తిగా ఉంటే ఇతరుల ముందు అంత పరిపూర్ణ వ్యక్తిగా నిరూపించుకోగలవు’’ అని అమ్మ చెప్పిన మాట అతడి మనసులో బలంగా నాటుకుపోయింది. ఓ న్యూస్‌పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ అతడి జీవితాన్నే మార్చివేసింది. వైకల్యం ఉన్నా సదరు వ్యక్తి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడో నిక్‌కు అర్థమైంది.

‘‘కాళ్లూ, చేతులు మాత్రమే లేవు.. అలా అని జీవితానికే అర్థం లేకుండా చేసుకోలేం కదా!’’ అన్న దృక్పథం అతడికి అలవడేలా చేసింది. దేవుడిని విశ్వసించే నిక్‌కు పదిహేడేళ్ల వయసులో ప్రేయర్‌ గ్రూప్‌లో స్పీచ్‌ ఇచ్చే ఛాన్స్‌ వచ్చింది. 

అప్పటి నుంచి అతడిలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ స్థాయికి ఎదిగాడు. దాదాపు 57 దేశాల్లో తన స్పీచ్‌తో కోట్లాదిమందిలో నూతనోత్తేజం నింపాడు.

తొలి చూపులోనే ప్రేమ.. చూపులు కలిసిన శుభవేళ
ఈ క్రమంలోనే కనే మియహారను కలుసుకున్నాడు. తొలి చూపులోనే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. కానీ అప్పటికే.. తమ కుటుంబంలోని కలతలు చూసి విసిగిపోయిన కనేకు వైవాహిక బంధంపై పెద్దగా నమ్మకం లేదు.

అందుకు తోడు.. నిక్‌ను కలిసే కంటే ముందున్న రిలేషన్‌షిప్స్‌ ఆమె మనసులో ఏ మూలో ఉన్న రవ్వంత నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. అయితే, విధిరాత మరోలా ఉంది. నిక్‌తో చూపులు కలిసిన ఆ వేళ శుభప్రదమైంది.. ఇద్దరు ప్రేమలో పడ్డారు.


PC: Instagram

సమాజం నుంచి తమ జంటకు ఎదురుకాబోయే చేదు అనుభవాలు ఎలా ఉంటాయో ముందే చర్చించుకున్నారు. ఒకరి కోసం ఒకరు బతకాలని నిర్ణయించుకున్నారు. 2012లో వాలంటైన్స్‌ డేకి రెండ్రోజుల ముందు అంటే ఫిబ్రవరి 12న పెళ్లి చేసుకున్నారు. నిజమైన ప్రేమ ఎలాంటి అవరోధాలనైనా అధిగమిస్తుందనే సందేశాన్నిస్తూ ముందుకు సాగుతున్నారు. 

లవ్‌ వితౌట్‌ లిమిట్స్‌
ఆస్ట్రేలియా అబ్బాయి- మెక్సికో అమ్మాయి ఇలా ప్రేమతో ఒక్కటయ్యారు. తమ ప్రేమ ప్రయాణాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు.. ‘‘లవ్‌ వితౌట్‌ లిమిట్స్‌: ఎ రిమార్కబుల్‌ స్టోరీ ఆఫ్‌ ట్రూ లవ్‌ కాంకరింగ్‌ ఆల్‌’’.. (అవధుల్లేని ప్రేమ: నిజమైన ప్రేమ అన్నిటినీ జయిస్తుందన్న అర్థం) పేరిట పుస్తకాన్ని రచించారు. 


PC: Instagram

దేవుడే తమను కలిపాడని నమ్మిన ఆ జంటకు ఇప్పుడు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు కియోషి, డేజాన్‌, ఒలీవియా, ఎల్లీ. నిజమైన ప్రేమకు అర్థంగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌- కనే మియహారకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు!!
-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement