ఈ విటమిన్లు తీసుకోండి | Vitamins Essential for Women's Health | Sakshi
Sakshi News home page

ఈ విటమిన్లు తీసుకోండి

Published Sat, Jan 4 2025 10:02 AM | Last Updated on Sat, Jan 4 2025 10:05 AM

Vitamins Essential for Women's Health

విటమిన్లు అందరికీ అవసరమే అయినా మహిళల ఆరోగ్యంలో ఇవి మరింత కీలక పాత్ర పోషిస్తాయి. 25 ఏళ్ల తరువాత మహిళల శరీరంలో పలు మార్పులు ప్రారంభమవుతాయి. ఇలాంటి కీలక దశలో పోషకాహారం, ఎక్సర్‌సైజులను నిర్లక్ష్యం చేస్తే విపరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం 25 దాటిన మహిళల ఆహారంలో కొన్ని విటమిన్స్  తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..

విటమిన్‌ డి...
ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్లను శరీరం సులువుగా గ్రహించేందుకు విటమిన్‌ డీ అవసరం. మహిళల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్ల ప్రమాదం ఎక్కువ కాబట్టి విటమిన్‌ డీ ఆహారంలో ఉండేలా చేసుకోవాలి. 

ఎందులో ఉంటుందంటే...
ఫార్టిఫైడ్‌ పాలు, గుడ్లు, సాల్మన్‌ లాంటి ఫ్యాటీ ఫిష్‌లో ఇది పుష్కలంగా ఉంటుంది.

విటమిన్‌ బి12...
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకమైన విటమిన్‌ బీ12 మహిళ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ విటమిన్‌ లోపం తలెత్తితే మెగాలోబ్లాస్టిక్‌ అనేమియా అనే రక్తహీనత తలెత్తుతుంది. సంతానోత్పత్తికి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులను అడ్డుకునేందుకు కూడా ఈ విటమిన్‌ కీలకం. ఎందులో లభిస్తుందంటే... అన్ని రకాల మాంసాహారాలలో...  పాలు, పెరుగు, నెయ్యి, కివీ, అరటి వంటి పండ్లలో విటమిన్‌ బి 12 లభిస్తుంది. 

విటమిన్‌ సి...
మహిళలకు కావలసిన అతి ముఖ్యమైన విటమిన్లలో ఇది కూడా ఒకటి. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు కాబట్టి ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాముల విటమిన్‌ సీ కావాలి. ఇది రక్తపోటు, కొలెస్టెరాల్‌ స్థాయులను నియంత్రించేందుకు అవసరం. వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు అడ్డుకునేందుకు కూడా ఇది కీలకం. విటమిన్‌ సి సమృద్ధిగా తీసుకుంటే ఐరన్‌ లోపం తలెత్తే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. 

ఎందులో ఉంటుంది?
నిమ్మ జాతికి చెందిన పండ్లు, కీవీ పళ్లల్లో ఈ విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది.

విటమిన్‌ ఈ
యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉన్న విటమిన్‌ ఈ చర్మ ఆరోగ్యానికి కీలకం. అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణంగా చర్మానికి జరిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా బలోపేతమయ్యేలా చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇతర అసౌకర్యాల నుంచి కూడా విటమిన్‌ ఈ ఉపశమనం కలిగిస్తుంది.

ఎందులో ఉంటుందంటే... 
విత్తనాలు, గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది.

విటమిన్‌ కే...
బ్లడ్‌ క్లాటింగ్‌కు కీలకమైన విటమిన్‌ కే గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికీ ఇది కీలకం. మహిళల్లో ఉదయం పూట కలిగే అసౌకర్యాల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మెదడు ఆరోగ్యానికీ ఇది అవసరమే. ఆకుకూరలు, ఆవకాడో లాంటి పండ్లు, చేపలు, లివర్, మాంసం గుడ్లల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement