వెల్‌కమ్‌ టు వెబ్‌3 వరల్డ్‌ | Welcome to Web3 World | Sakshi
Sakshi News home page

వెల్‌కమ్‌ టు వెబ్‌3 వరల్డ్‌

Published Wed, Jan 10 2024 11:04 AM | Last Updated on Wed, Jan 10 2024 11:04 AM

Welcome to Web3 World - Sakshi

టెక్నాలజీ ప్రేమికులైన యువతరం తాజా ఆసక్తి... వెబ్‌3 విశాలమైన వెబ్‌ 3 స్పేస్‌లో స్టార్టప్‌ల నుంచి ఉద్యోగాల వరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత ఆధారిత వెబ్‌3 యువత కోసం  ఎన్నో ద్వారాలను తెరవనుంది. స్వయంప్రతిపత్తిని అందించనుంది...

ఒకప్పుడు... ‘మాకు వెబ్‌సైట్‌తో పనిలేదు. ప్రింట్‌ మీడియా టీవీ చాలు’  ‘ఇ–కామర్స్‌తో పనిలేదు. ఇన్‌–స్టోర్‌ చాలు’‘మొబైల్‌ వెబ్‌సైట్, యాప్‌లతో పనిలేదు’ ‘వెబ్‌3 స్ట్రాటజీ మాకు అవసరం లేదు’ అన్నట్లుగా ఉండేది. 90ల నుంచి 2020 వరకు సాంకేతికతకు సంబంధించిన అభిరుచులు, అభిప్రాయాలలో ఎంతో మార్పు వచ్చింది. ‘మాకు అవసరం లేదు’ అన్నచోటే ‘మాకు తప్పనిసరిగా అవసరం’ అనే మాట వినిపిస్తోంది.

వెబ్‌3 సాంకేతిక విషయంలోనూ ఇదే మార్పు చోటు చేసుకుంది. ‘ఇలా వచ్చి అలా వెళ్లి పోయే ట్రెండ్‌ ఇది’ అనుకున్న కంపెనీలు కూడా వెబ్‌3 సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. యూత్‌తో కనెక్ట్‌ కావడానికి ‘వెబ్‌3’ అనేది బలమైన సాధనం అని నమ్ముతున్నాయి. వెబ్‌3 మార్కెటింగ్‌పై రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నాయి. వెబ్‌3 బ్రాండ్స్‌ జెన్‌ జెడ్‌ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి సంప్రదాయ విధానాలకు భిన్నంగా కొత్తదారిలో పయనిస్తున్నాయి.


బ్లాక్‌చెయిన్‌–బేస్డ్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్స్, వర్చువల్‌ వరల్డ్స్‌ అభివృద్ధి వల్ల డిజిటల్‌ స్పేస్‌లో ఎక్కువ సమయం గడుపుతోంది యువతరం. వెబ్‌–3 బేస్డ్‌ గేమ్స్, వర్చువల్‌ వరల్డ్స్‌ యువ ప్లేయర్స్‌కు అటానమస్, వోనర్‌షిప్, మానిటైజేషన్‌ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లాంటి సెంట్రలైజ్‌డ్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద ఆధారపడకుండా కంటెంట్‌ క్రియేట్‌ చేయడానికి, షేర్‌ చేయడానికి, కంటెంట్‌ను మానిటైజ్‌ చేయడానికి వెబ్‌3 టెక్నాలజీ ఉపయోగపడుతుంది. 

‘వెబ్‌3 విశ్వరూపాన్ని మనం ఇంకా చూడనప్పటికీ కొత్తరకం అవకాశాలతో క్రియేటర్‌లను ఆకట్టుకుంటోంది. మధ్యవర్తుల అవసరం లేకుండానే డైరెక్ట్‌–కన్యూ‍్జమర్‌ ఇంటరాక్షన్‌కు వీలు కల్పిస్తుంది. సంప్రదాయ పద్ధతుల కంటే భిన్నంగా ఆదాయ మార్గాలను విస్తరించుకోవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే వెబ్‌3 అనేది సంప్రదాయ మోడల్స్‌ను సవాలు చేసేలా ఉంటుంది. క్రియేటర్‌లు ఒక అడుగు ముందుకు వేసేలా చేస్తుంది’ అంటున్నాడు  ఏఐ పవర్డ్‌ క్రియేటర్‌ టెక్‌ కంపెనీ ‘యానిమెటా’ సీయివో దేవదత్తా.

‘వెబ్‌3 జెన్‌–జెడ్, మిలీనియల్స్‌ను ఆకట్టుకుంటుంది. వెబ్‌3 నుంచి మరిన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు. వెబ్‌3 యాప్‌ ఫౌండర్‌లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన కసరత్తు చేస్తే, ఆసక్తికరమైన ఐడియాలతో ముందుకు వస్తే గేమ్‌లో ముందు ఉంటారు’ అంటున్నాడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘యాప్‌టోపియా’ ఫౌండర్, సీయివో జోనాథన్‌ కె. వెబ్‌ 3 రంగంలో భారత్‌ వేదికగా ఎన్నో కంపెనీలు పని చేస్తున్నాయి. వీటిద్వారా యువతకు ఎన్నో ఉద్యోగావకాశాలు దొరుకుతాయి.

సాలిడిటీ డెవలపర్, మార్కెటింగ్‌ ఆఫీసర్, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్, బ్లాక్‌ చెయిన్‌ ఆఫీసర్, కమ్యూనిటీ మేనేజర్, యూనిటీ డిజైనర్, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్, ఈవెంట్స్‌ మేనేజర్, ఎనలిస్ట్, బీటా టెస్టర్, టెక్నికల్‌ రైటర్, డెవలపర్, డిజైనర్, ఇన్‌ఫ్లూయెన్సర్‌ మేనేజర్‌... ఇలా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

నయా ఇంటర్‌నెట్‌
వరల్డ్‌ వైడ్‌ వెబ్‌(డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ)కు సంబంధించి వెబ్‌ 1 నుంచి వెబ్‌ 2 వరకు జరిగిన ప్రస్థానాన్ని గమనిస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. వెబ్‌ 1 దశలోని వెబ్‌సైట్‌ల నుంచి వెబ్‌2 దశలోని సోషల్‌ మీడియా విస్తృతి  వరకు ఆ మార్పును ప్రతిబింబిస్తాయి. అయితే ‘అభివృద్ధి’గా చూపుతున్న మార్పు బడా కంపెనీలకే మేలు చేసిందనే విమర్శ ఉంది.

ఈ నేపథ్యంలోనే పెద్ద కంపెనీల ఆధిపత్యానికి, నియంత్రణకు వీలు లేని  వెబ్‌3 టెక్నాలజీపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. వెబ్‌3 స్టార్టప్‌లు భారతీయ మార్కెట్‌లో ఊపందుకోవడం ఈ మార్పును సూచిస్తోంది. వెబ్‌ 3లో డీసెంట్రలైజ్‌డ్‌ విధానంలో డేటా ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతుంది. వెబ్‌ 3 అనేది ఒక తరం మార్పునకు ప్రతిబింబం.

‘వెబ్‌ 3కి కొలమానం ఏమిటి?’ అనే విషయానికి వస్తే ఒక యాప్‌లో డాటా, ఐడెంటిటీ, ప్రైవసీ, ప్లే–టు–ఎర్న్‌లాంటి ఎలిమెంట్స్‌ తప్పకుండా ఉండాలి. స్వెట్‌కాయిన్‌ (ఫిట్‌నెస్‌), ట్విగ్‌(ఫైనాన్స్‌)లాంటి వెబ్‌3 రైజింగ్‌ స్టార్స్‌ ఆచరణ  స్థాయిలో వెబ్‌3 ఎలిమెంట్స్‌ను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

మైరాతో అంతర్జాతీయ స్థాయికి...
వెబ్‌ 3 వరల్డ్‌ ఇనోవేషన్‌కు సంబంధించి ఘనంగా చెప్పుకునే వారిలో శిల్పా కర్కెరా ఒకరు. నాగ్‌పుర్‌కు చెందిన శిల్ప ఏఐ అండ్‌ బ్లాక్‌చెయిన్‌ సొల్యూషన్స్, ప్రాడక్ట్‌ కంపెనీ ‘మైరా టెక్నాలజీకి’ ఫౌండర్, సీయివో. ప్రస్తుతం ఈ కంపెనీ ఆరు దేశాల్లో పనిచేస్తోంది.

‘మైరా బ్లాక్స్‌’ అనే బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌తో పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తోంది. ఎన్నో కొత్త కంపెనీలకు టెక్నాలజీ అడ్వైజర్‌గా పనిచేసింది. ‘మీకు సాంకేతిక విషయాలపై ఆసక్తి ఉంటే మీలాగే ఆసక్తి ఉన్నవారితో స్నేహం చేయండి. నిపుణులతో మాట్లాడండి’ అంటుంది శిల్ప.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement