ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా
పాఠకులు తెలుపుకుంటున్న కృతజ్ఞతలు
థాంక్యూ అమ్మమ్మా!
నేను ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పలనుకుని చెప్పలేకపోయింది మా అమ్మమ్మకే. తన ప్రవర్తన ద్వారా మాకు ఒక జీవన విధానాన్ని నేర్పించిందామె. ముఖ్యంగా జీవన సహచరుడితో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో, కొట్టకుండా... తిట్టకుండానే పిల్లలను క్రమశిక్షణతో ఎలా పెంచాలో మా అమ్మమ్మ మా అందరితో మెలిగిన తీరు నుంచే మేము నేర్చుకున్నాం. పోదుపు పాఠాల సంగతి సరేసరి. మేమందరం చిన్నప్పుడు మా ప్రతి సెలవులకూ మా అమ్మమ్మ వాళ్లింటికే వెళ్లేవాళ్లం.
తన పిల్లలతో΄ాటు మమ్మల్ని అందరినీ చదువుల వైపు, ఉద్యోగాల వైపు ముఖ్యంగా నిజాయితీతో కష్టపడి పనిచేయాలనే తలంపు వైపు, కుల మతాలకు తావులేని ఆదర్శాలవైపు తమ జీవన విధానంతోనే మళ్లించిన మా అమ్మమ్మ, తాతయ్యలు శ్రీమతి వావిలాల సీతాదేవి, వెంకటేశ్వర్లు గార్లకు కృతజ్ఞతలు ఎలా చెప్పలో మాకు అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు తెలిసినా, చెప్పడానికి భౌతికంగా వారు మా మధ్య లేదు. అయితేనేం, మా జ్ఞాపకాలలో పదిలంగా ఉన్న మా అమ్మమ్మ, తాతయ్యలకు ఈ రోజున గుండెలనిండుగా థాంక్స్ చెప్పుకునే అవకాశం మాకు కల్పించిన సాక్షికి కూడా థాంక్స్.
– తెల్కపల్లి ఇందిరా ప్రియదర్శిని, కంభం
మా వారికే నా థాంక్స్
నేను థాంక్స్ చెప్పేది ముందుగా మా వారికే. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల రీత్యా పెళ్లయ్యే సమయానికి నేను అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేయగలిగాను. అయితే ఇంకా చదువుకోవాలని ఉందన్న నా మనసు గ్రహించింది మా వారు జేవీఎస్ రామారావు గారే. ఇంటిలో పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, నేను చదువుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో΄ాటు మా అత్తగారు, మా మామగారు, వదినగారు కూడా చదువుకుని ఉద్యోగం చేయడంలో ఎంతగానో సహకరించారు. ఇప్పుడు నేను మూడు పీజీలు, రెండు డిగ్రీలు, రెండు డిపామాలు, ఎం.ఈడీ. చేసి ఉద్యోగం చేస్తూ కూడా మరికొద్దికాలంలోనే పీహెచ్‌డీ కూడా పూర్తి చేయబోతున్నానంటే అందుకు మా వారి ప్రోత్సాహ సహకారాలే కారణం. అందుకే మా వారికే నా ధన్యవాదాలు.
– డి.ఎల్. అనూరాధ, భద్రాద్రి కొత్తగూడెం
తండ్రి తర్వాత తండ్రి లాంటి...
నేను నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత అంతగా రుణ పడిన ఏకైక వ్యక్తి మా మేనమామ కొన్నూరు సత్యారెడ్డిగారే. నా చిన్నప్పుడు నా సోదరుడి అనారోగ్య పరిస్థితుల్లో, నా తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారికి అండగా ఉంటూ, నన్ను గుండెలపై పెట్టి పెంచుకున్న ఆ రోజులను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయన ప్రేమతో పెట్టిన గోరుముద్దలతో పెరిగిన ఈ దేహం పడిపోయే వరకూ ఆయన పేరు కాపాడుకుంటూ నిలబడే ఉంటుంది. నన్ను పెంచి పెద్ద చేసి, విలువలు నేర్పి, ఇంతవాణ్ణి చేసిన నా మేనమామకు సాక్షి పత్రిక వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నందుకు సంతోషిస్తున్నాను.
– లంకల అన్వేశ్వర్ రెడ్డి, కుమార లింగం పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment