World Kitchen Garden Day: ఇంతింతైన ఇంటిపంటల సంస్కృతి.. | world kitchen garden day special story sakshi fun day | Sakshi
Sakshi News home page

World Kitchen Garden Day: ఇంతింతైన ఇంటిపంటల సంస్కృతి..

Published Sun, Aug 28 2022 11:04 AM | Last Updated on Sun, Aug 28 2022 12:51 PM

world kitchen garden day special story sakshi fun day - Sakshi

‘ఆహారమే ప్రథమ ఔషధం’ అన్న పెద్దల మాటను కరోనా .. ప్రజలకు జ్ఞాపకం చేసింది. అంతేకాదు, సేంద్రియ ఇంటిపంటలు మిద్దెతోటల సాగు దిశగా పట్టణ ప్రజలను పురికొల్పింది. సీనియర్‌ కిచెన్‌ గార్డెనర్ల సలహాలు, సూచనలకు గిరాకీ పెంచింది. సాధారణ గృహిణులైనప్పటికీ సీనియర్లు ప్రత్యేక యూట్యూబ్‌ చానల్స్‌ ప్రారంభించారు. తరచూ వీడియోలు పోస్ట్‌ చేస్తూ మంచి వ్యూస్‌ పొందుతున్నారు.

తమ సలహాలకు ఆర్థిక విలువ చేకూరటం కూడా వారికి సంతోషాన్నిస్తోంది. ఇంటిపట్టునే ఉండి ఉద్యోగాలు చేసుకునే సదుపాయం యువతకు అందుబాటులోకి రావటం వల్ల కూడా ఆర్గానిక్‌ కిచెన్‌ గార్డెనింగ్‌ (అర్బన్‌ అగ్రికల్చర్, సిటీ ఫార్మింగ్‌) వ్యాపకం తెలుగునాట ఆరోగ్యదాయకంగా విస్తరిస్తోంది! ఆగస్ట్‌ 28న ‘వరల్డ్‌ కిచెన్‌ గార్డెన్‌ డే’ సందర్భంగా ఈ కవర్‌ స్టోరీ..  

పల్లెల్లో నాగలి పట్టిన రైతులు, రైతు కూలీలు ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తూ ఉంటే.. వారు పండించే ఆహారోత్పత్తులను తింటూ పట్టణాలు, నగరాల్లో నివసించే వారు పరోక్షంగా వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. రైతులు ఉత్పత్తిదారులైతే, వినియోగదారులు సహ–ఉత్పత్తిదారులన్న మాట. ‘భోజనం చేయటం కూడా వ్యవసాయక చర్యే’ అని ప్రసిద్ధ పర్యావరణవేత్త వెండెల్‌ బెర్రీ అన్నది ఇందుకే! 

ప్రజలు తినగోరే వ్యవసాయోత్పత్తులకే మార్కెట్‌లో గిరాకీ ఉంటుంది. వాటినే గ్రామాల్లో రైతులు పండిస్తూ ఉంటారు. మనం గ్రహించినా, గ్రహించకపోయినా.. మనందరం వ్యవసాయంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్లమే. నగరవాసుల్లో ఉంటూlతమ కోసం సేంద్రియ పద్ధతుల్లో ఆరోగ్యదాయకమైన ఇంటి పంటలు పండించుకొని తినే ‘అర్బన్‌ ఫార్మర్స్‌’ సంఖ్య మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. 

మన నగరాల్లో సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల సాగు వేగంగా విస్తరిస్తోంది. పెరట్లో, బాల్కనీల్లో, భవనాలు, మిద్దెల మీద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాలు వాడకుండా సాగు చేయటం బాగా పెరిగింది. అంతేకాదు, కరోనా నేపథ్యంలో నగర పరిసరాల్లో అంతకుముందు ఖాళీగా ఉన్న ఫామ్‌ హౌస్‌ భూములు, కమ్యూనిటీ ఖాళీ స్థలాల్లోనూ ప్రకృతి,సేంద్రియ సేద్యం ఊపందుకుంది. 

నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో నివసించే వారిలోనూ సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటలపై ఆసక్తి గత రెండేళ్లలో అనేక రెట్లు పెరిగింది. ప్రధానంగా సొంత భవనాల్లో నివాసం ఉండే మధ్య తరగతి లేదా ఉన్నత–మధ్య తరగతి సాగుదారులు ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరు, పుణే, త్రివేండ్రం, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్, వరంగల్‌ వంటి అనేక భారతీయ నగరాల్లో ఈ ధోరణి మనకు ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రజలకు, పర్యావరణానికీ ఆరోగ్యదాయకంగా నిలిచే సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల సాగు సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో తామర తంపరగా విస్తరిస్తోంది. 
ప్రచారోద్యమానికి శ్రీకారం
సాక్షి మీడియా గ్రూప్‌ ‘రేపటికి ముందడుగు’ నినాదంతో దశాబ్దం క్రితమే సేంద్రియ ‘ఇంటిపంట’ల ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇంటిపంటల సాగులో కొత్త టెక్నిక్స్‌ను పరిచయం చేయటమే కాకుండా, సుసంపన్నమైన ప్రజల ఇంటిపంటల సాగు అనుభవాలతో కూడిన కథనాలను శ్రద్ధగా ప్రచురించటం గత పదకొండేళ్లుగా ‘సాక్షి’ చేస్తోంది. ఇంటిపంటల సాగుదారుల కథనాలతో పాటు వారి ఫోన్‌ నంబర్లు ప్రచురించడం ద్వారా ఈ అనుభవాలను ఇతరులు నేర్చుకోవడానికి  వీలు కలిగింది. ఈ కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో లోగిళ్లు సేంద్రియ ఇంటిపంటలతో కళకళలాడుతున్నాయి. 

‘సాక్షి’ ఇంటిపంటల కథనాల ప్రేరణతో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యాన శాఖ హైదరాబాద్‌లో ఇంటిపంటల సాగు ప్రారంభానికి అవసరమైన సరంజామాను సబ్సిడీపై అందించటం ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉద్యాన శాఖ అప్పట్లోనే అర్బన్‌ అగ్రికల్చర్‌ విభాగాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం సబ్సిడీ కిట్లు ఇవ్వటం లేదు కానీ, ఔత్సాహికులకు నెలకు రెండు రోజులు శిక్షణ ఇస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అడపా దడపా కిచెన్‌ గార్డెనింగ్‌పై శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సమృద్ధిగా సమాచారం అందుబాటులో ఉండటంతో చిన్నా చితకా పట్టణాలు, గ్రామాల్లో నివాసం ఉండే ఆరోగ్యాభిలాషులు చాలా మంది స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతోనే సేంద్రియ ఇంటిపంటల సాగుకు ఉపక్రమిస్తున్న ట్రెండ్‌ కనిపిస్తోంది.

సొంతూళ్లకు చేరిన ప్రైవేటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కూడా ఇంటిపంటల వ్యాప్తికి దోహపడిందనే చెప్పాలి. రోజువారీ తినే కూరగాయలు, పండ్లల్లో చాలా వరకు తమ మిద్దె, ఇంటిపైనే పండించుకుంటున్న ప్రొఫెషనల్‌ కిచెన్‌ గార్డెనర్స్‌ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఉన్నారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి వారైతే చాలా ఏళ్లుగా నూటికి నూరు శాతం తమ మిద్దెతోటపైనే ఆధారపడుతున్నారు.  హైదరాబాద్‌ జిల్లాలో ఇళ్లపైన కంటెయినర్లలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసే వంద మందిపై జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌) అధ్యయనం చేసింది.

తాము రోజువారీగా తినే కూరగాయల్లో 81%, పండ్లలో 10% వరకు తమ ఇంటిపైనే పండించుకుంటున్నామని 50% కన్నా ఎక్కువ మంది చెప్పారు. కొంతమంది కూరగాయల కన్నా పండ్లపైనే దృష్టి పెడుతుండటం విశేషం. తింటున్న పండ్లలో 85%, కూరగాయల్లో 7% మేరకు తామే కుండీలు, మడుల్లో ఇంటి దగ్గర పండించుకుంటున్నామని 25% మంది చెప్పారు.

ఏభయ్యేళ్లు దాటిన వారు 46% మంది ఇంటిపంటలు పండిస్తున్నారు. వీరిలో 35 ఏళ్లు దాటిన వారు 34%. పది కన్నా ఎక్కువ రకాల కూరగాయలు, పండ్లను 15% మంది సాగు చేస్తున్నారు. 5 రకాలను 45% మంది, 10 రకాలను 40% మంది సాగు చేస్తున్నారు. 91% మేరకు మట్టి కుండీలను వాడుతుండటం విశేషం.  
బెంగళూరు భళా
వంటింటి వ్యర్థాలతో ఇంటి వద్దే కంపోస్టు తయారు చేయటం, ఇళ్లపై కంటెయినర్లలో సేంద్రియ కూరగాయలు, పండ్లు పెంచుకోవడంలో బెంగళూరు మన దేశంలోనే ముందంజలో ఉందని చెప్పొచ్చు. భారతీయ సిటీ ఫార్మింగ్‌ పితామహుడుగా పేరుగాంచిన డా. విశ్వనాథ్‌ బెంగళూరు వారే. వ్యవసాయ శాస్త్రవేత్తగా రిటైరైన తర్వాత, గత ఏడాది కరోనాతో చనిపోయేంత వరకు, 20 ఏళ్ల పాటు వేలాది మందికి టెర్రస్‌ ఫార్మింగ్‌లో శిక్షణ ఇచ్చిన ఘనత ఆయనది.

అంతేకాదు, టెర్రస్‌ కిచెన్‌ గార్డెన్స్‌లో పెంచి తాము తినగా మిగిలిన కూరగాయలు, పండ్లు.. వాటితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 3 నెలలకోసారి ప్రత్యేక మేళాలు నిర్వహించుకునే ఉన్నత స్థాయికి సిటీ ఫార్మింగ్‌ చైతన్యం బెంగళూరులో వికసించింది. 
ఇంటిపంటలతో ప్రయోజనాలోన్నో
పట్టణ వ్యవసాయం బహుళ ప్రయోజనాలను చేకూర్చగలదని బెంగళూరులోని భారతీయ మానవ ఆవాసాల సంస్థ (ఐఐహెచ్‌ఎస్‌) భావిస్తోంది. బెంగళూరు, పుణేలో సేంద్రియ ఇంటిపంటల సాగు తీరుతెన్నులపై ఈ సంస్థ ఇటీవల పరిశోధన చేపట్టింది. మరింత వైవిధ్యమైన – పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం, వైద్య ఖర్చులు తగ్గించడం, తడి వ్యర్థాలను పునర్వినియోగించడం, వర్షపు నీటి సంరక్షణకు దోహదం చేస్తుంది.

పట్టణ పౌరులు ప్రకృతితో తిరిగి కనెక్ట్‌ అవ్వడానికి, సుస్థిర జీవనంపై లోతైన అవగాహన కలిగించుకోవడానికి అర్బన్‌ అగ్రికల్చర్‌ సహాయపడుతుంది. ప్రజలకు చేకూరుతున్న ఈ ప్రయోజనాలు పైకి కొట్టొచ్చినట్టు కనిపించనివైనప్పటికీ భారతీయ నగరాల సుస్థిర భవిష్యత్తుSదృష్ట్యా విధానాల రూపకల్పనకు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు ఐఐహెచ్‌ఎస్‌ నిపుణులు స్వర్ణిక శర్మ. 
ఆరోగ్యవంతమైన నగరాల కోసం..
ప్రపంచవ్యాప్తంగా అర్బన్‌ అగ్రికల్చర్‌ ద్వారా ప్రజలకు సుమారు 15% ఆహారం అందుతోందని అంచనా. 70 కోట్ల మంది నగరవాసులకు ఈ ఫుడ్‌ అందుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఊపందుకున్న నగరీకరణ వల్ల 2030 నాటికి 60% మంది అర్బన్‌ ప్రాంతాల్లోనే నివాసం ఉంటారు. కాబట్టి, నగరాలు, పట్టణాల శివారు ప్రాంత భూముల్లోను, కాంక్రీటు జంగిల్‌గా మారిన నగరాలు, పట్టణాల్లోని భవనాలపైన, బాల్కనీల్లో, ఖాళీ స్థలాల్లో వీలైన చోటల్లా అలంకరణ మొక్కలకు బదులు ఆహార మొక్కలు, పండ్ల చెట్లు పెంచటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 

సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తాజాగా, స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ‘అర్బన్‌ అగ్రికల్చర్‌’తో ఒనగూడే ప్రయోజనాలు పుష్కలం. ఆహార కొరత తీర్చటం, ఆరోగ్యాన్ని జీవన నాణ్యతను మెరుగుపరచడం, పర్యావరణంపై అవగాహనను పెంపొందించటం వంటి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అర్బన్‌ అగ్రికల్చర్‌ దోహదపడుతుంది. 

అందుకే ఐక్యరాజ్య సమితి ఆహార–వ్యవసాయ సంస్థ (యు.ఎన్‌. ఎఫ్‌.ఎ.ఓ.) అర్బన్‌–పెరీ అర్బన్‌ అగ్రికల్చర్‌ పాలసీపై పాలకులకు తాజాగా సరికొత్త సూచనలు చేసింది. అర్బన్‌ ప్లానింగ్‌లో ఈ స్పృహను మిళితం చేయాలని, ‘గ్రీన్‌ సిటీ’లకు బదులు ‘ఎడిబుల్‌ సిటీలు’గా తీర్చిదిద్దాలని ఎఫ్‌.ఎ.ఓ. సూచిస్తోంది. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సేంద్రియ ఇంటిపంటలు,మిద్దె తోటల ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలను పూర్తి స్థాయిలో గుర్తించి ప్రోత్సహించాలి. 

యూట్యూబర్ల హవా 

తెలుగు నాట రూఫ్‌టాప్‌ కిచెన్‌ గార్డెనర్లు అర్బన్‌ అగ్రికల్చర్‌ను స్థిరమైన దిగుబడులు పొందే రసాయన రహిత పద్ధతులు, సరికొత్త నమూనాలతో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. సందేహాలు తీర్చటం, అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి తొలి దశలో ఫేస్‌బుక్‌ గ్రూపులు కీలకపాత్ర పోషించాయి. తర్వాత లేక్కలేనన్ని వాట్సప్, టెలిగ్రామ్‌ గ్రూపులు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉండి పనులు చేసుకునే అవకాశం అందిరావటం వల్ల నగరాలు, పట్టణ వాసులు ఆరోగ్య పరిరక్షణోద్యమంగా సేంద్రియ ఇంటిపంటలు,మిద్దె తోటల సాగును చేపట్టారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు ప్రత్యేకించి ఔషధ మొక్కల సాగు సైతం తెలుగు నాట ఇప్పుడు ఉధృతమైంది.  

ఈ పూర్వరంగంలో యూట్యూబ్‌ చానళ్లు రంగంలోకి రావటంతో ఇది సరికొత్త ఉపాధి మార్గంగానూ మారింది. అంతకుముందు గత కొన్ని ఏళ్ల నుంచి అనుభవం గడించిన వారిలో కొందరు యూట్యూబ్‌ చానళ్లు ప్రారంభించి తమ అనుభాలను వీడియోల ద్వారా పంచుతూ ప్రాచుర్యం పొందుతున్నారు. ఓ తాజా సర్వే ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 168 యూట్యూబ్‌ చానల్స్‌ ఉన్నట్లు లెక్క తేలింది. సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటలపై సమగ్ర సమాచారాన్ని, అనుభవ జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నాయి.  

ఆండ్రాయిడ్‌ ఫోన్, కొన్ని యాప్‌ల ద్వారానే వీడియోలను ప్రొడ్యూస్‌ చేసే సాంకేతికత అందుబాటులోకి రావటం కలసివచ్చింది. తరచూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. కిచెన్‌ గార్డెనింగ్‌లో ఏ సందేహం ఉన్నా నివృత్తి చేయటానికి ఇప్పుడు వీడియోలు యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. రోజుకో వీడియో పెడుతున్న వారూ ఉన్నారు. సృజనాత్మకతో కూడిన నాణ్యమైన వీడియోలు లక్షలాది వ్యూస్‌ నమోదు చేసుకుంటున్నాయి.

యూట్యూబర్లుగా మారిన సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటల సాగుదారులు తమ అనుభవాలను ఇతరులకు అందుబాటులోకి తేగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు.. ఈ వీడియోల ద్వారా నెలవారీగా గణనీయమైన ఆదాయాన్ని సైతం పొందుతుండటం సంతోషదాయకం. వీరిలో హైదరాబాదీయులు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ! 

టెర్రస్‌ మీద 9 ఏళ్లుగా వందల కుండీలు, మడుల్లో ఎంతో వైవిధ్యభరితమైన పండ్ల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సాగు చేస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని కుటుంబానికి అందిస్తున్నారు హైదరాబాద్‌ బీరంగూడకు చెందిన గృహిణి లత. పత్రికలు, టీవీ చానళ్లలో ఆమె కృషి గురించి కథనాలు వచ్చాయి. సలహాలు, సూచనల కోసం కరోనా కాలంలో ఫోన్లు, వాట్సప్‌ మెసేజ్‌లు వెల్లువయ్యాయి. ప్రతిసారీ వివరించి చెప్పాల్సి రావటం కష్టంగా ఉండటంతో ‘లతాస్‌ టెర్రస్‌ గార్డెన్‌’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాను అంటారామె సంతృప్తిగా. ఆరోగ్యానికి ఆహారమే మూలం అని గ్రహిస్తున్న ప్రజలు ఆర్గానిక్‌ టెర్రస్‌ గార్డెనింగ్‌ విలువ తెలుసుకుంటున్నారని ఆమె అంటున్నారు. 

కిచెన్‌ వేస్ట్‌ బయటపడేయకుండా మట్టి కొంచెం, పేడ కొంచెం కలుపుకుంటే 20 రోజుల్లో కంపోస్టు తయారవుతుందని హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ కిచెన్‌ గార్డెనర్‌ నూర్జహాన్‌ అంటారు. నలుగురికీ మాట సాయం అందించే సాధనంగా ‘నూర్జహాన్‌ టెర్రస్‌ గార్డెన్‌’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించారు. రోజు మార్చి రోజు వీడియోలు పెడుతున్నారు. ఇప్పటికి 754 వీడియోలున్నాయి. తన మేడపై దశాబ్దాలుగా గడించిన ఇంటిపంటల సాగు అనుభవ జ్ఞానాన్ని ప్రజలకు వివరంగా తెలియజెప్తున్నానన్న ఆనందం కలుగుతోందని నూర్జహాన్‌ సంతోషిస్తున్నారు.  
పంతంగి రాంబాబు
    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement