మత గ్రంథాల్లో నరకాన్ని గురించిన వర్ణన తప్ప నరకం ఎలా ఉంటుందో చూసినవాళ్లు లేరు. నరకం ఎలా ఉంటుందో చూడాలని ఉంటే సింగపూర్‌లోని ఈ థీమ్ పార్కుకు వెళ్లాల్సిందే! ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైన థీమ్ పార్కు. ఈ థీమ్ పార్కు పేరు ‘హా పార్ విల్లా’. బయటి నుంచి చూడటానికి ఇది కొంత ఆకర్షణీయంగానే కనిపిస్తుంది గాని, లోపలకు అడుగు పెడితే మాత్రం అడుగడుగునా భయానక దృశ్యాలు ఎదురవుతాయి. బౌద్ధ పురాణాల ప్రకారం నరకంలోని పది న్యాయస్థానాలు, యముడు పాపులను విచారించే దృశ్యాలతో ఉన్న బొమ్మలు, యమభటులు పాపులకు విధించే శిక్షలకు సంబంధించిన శిల్పాలు ఈ పార్కులో కనిపిస్తాయి. వీటిని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.
పాప పుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి బతికి ఉన్నప్పుడు పూర్తిగా మంచి పనులు చేసినవారు బంగారు వంతెనను, చెడు కన్నా మంచి పనులు ఎక్కువగా చేసినవారు వెండి వంతెనను దాటుకుంటూ స్వర్గం వైపు వెళుతున్న బొమ్మలు ఉంటాయి. ఇతరులను దుర్భాషలాడటం, తన్నడం, ఇతరులపై దాడులకు దిగడం, ఆహారాన్ని వృథా చేయడం, పుస్తకాలను దుర్వినియోగం చేయడం, నిస్సహాయులను వేధించడం, అత్యాచారాలు చేయడం, దొంగతనం, దోపిడీలు, హత్యలు చేయడం వంటి పాపాలకు సంబంధించిన బొమ్మలు, భూమ్మీద బతికి ఉన్నప్పుడు ఆ పాపాలకు పాల్పడిన వారు అనుభవించే శిక్షలకు సంబంధించిన బొమ్మలు, పాపాలు చేసిన వారు నరకంలో శిక్షలు అనుభవించాక, తిరిగి భూమ్మీద పుట్టినప్పుడు అనుభవించే దయనీయ పరిస్థితులకు సంబంధించిన బొమ్మలు అత్యంత భయంకరంగా ఉంటాయి. సింగపూర్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తుంటారు.
చెడు పనులు చేస్తే పర్యవాసానాలు ఎలా ఉంటాయో పిల్లలకు వివరించడానికి వారిని ఇక్కడకు తీసుకొస్తుంటామని, ఇక్కడి బొమ్మలను చూసేటప్పుడు పిల్లలు భయపడినా, తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని సింగపూర్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. సింగపూర్ వచ్చే పర్యాటకులు కూడా ఈ భూతల నరకాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment