Theme park
-
నరకం చూడాలనుకుంటే.. అక్కడకు వెళ్తే చాలు!
మత గ్రంథాల్లో నరకాన్ని గురించిన వర్ణన తప్ప నరకం ఎలా ఉంటుందో చూసినవాళ్లు లేరు. నరకం ఎలా ఉంటుందో చూడాలని ఉంటే సింగపూర్‌లోని ఈ థీమ్ పార్కుకు వెళ్లాల్సిందే! ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైన థీమ్ పార్కు. ఈ థీమ్ పార్కు పేరు ‘హా పార్ విల్లా’. బయటి నుంచి చూడటానికి ఇది కొంత ఆకర్షణీయంగానే కనిపిస్తుంది గాని, లోపలకు అడుగు పెడితే మాత్రం అడుగడుగునా భయానక దృశ్యాలు ఎదురవుతాయి. బౌద్ధ పురాణాల ప్రకారం నరకంలోని పది న్యాయస్థానాలు, యముడు పాపులను విచారించే దృశ్యాలతో ఉన్న బొమ్మలు, యమభటులు పాపులకు విధించే శిక్షలకు సంబంధించిన శిల్పాలు ఈ పార్కులో కనిపిస్తాయి. వీటిని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. పాప పుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి బతికి ఉన్నప్పుడు పూర్తిగా మంచి పనులు చేసినవారు బంగారు వంతెనను, చెడు కన్నా మంచి పనులు ఎక్కువగా చేసినవారు వెండి వంతెనను దాటుకుంటూ స్వర్గం వైపు వెళుతున్న బొమ్మలు ఉంటాయి. ఇతరులను దుర్భాషలాడటం, తన్నడం, ఇతరులపై దాడులకు దిగడం, ఆహారాన్ని వృథా చేయడం, పుస్తకాలను దుర్వినియోగం చేయడం, నిస్సహాయులను వేధించడం, అత్యాచారాలు చేయడం, దొంగతనం, దోపిడీలు, హత్యలు చేయడం వంటి పాపాలకు సంబంధించిన బొమ్మలు, భూమ్మీద బతికి ఉన్నప్పుడు ఆ పాపాలకు పాల్పడిన వారు అనుభవించే శిక్షలకు సంబంధించిన బొమ్మలు, పాపాలు చేసిన వారు నరకంలో శిక్షలు అనుభవించాక, తిరిగి భూమ్మీద పుట్టినప్పుడు అనుభవించే దయనీయ పరిస్థితులకు సంబంధించిన బొమ్మలు అత్యంత భయంకరంగా ఉంటాయి. సింగపూర్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తుంటారు. చెడు పనులు చేస్తే పర్యవాసానాలు ఎలా ఉంటాయో పిల్లలకు వివరించడానికి వారిని ఇక్కడకు తీసుకొస్తుంటామని, ఇక్కడి బొమ్మలను చూసేటప్పుడు పిల్లలు భయపడినా, తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని సింగపూర్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. సింగపూర్ వచ్చే పర్యాటకులు కూడా ఈ భూతల నరకాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో వస్తుంటారు. -
పిల్లల గణతంత్ర ప్రపంచం!
ఇది ఒక అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్. దీని పేరు చిల్డ్రన్స్ రిపబ్లిక్. ఈ పార్కు లోపలి వాతావరణం పూర్తిగా పేరుకు తగినట్లుగానే ఉంటుంది. అర్జెంటీనాలోని మాన్యువల్ బి గానెట్ నగరంలో ఉందిది. దేశంలోని పిల్లలకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అర్జెంటీనా ప్రభుత్వం 1951 నవంబర్ 26న ఈ పార్కును ప్రారంభించింది. ఈ పార్కు నిర్మించిన 130 ఎకరాల స్థలంలో అంతకు ముందు గోల్ఫ్‌కోర్స్ ఉండేది. ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుని, ఈ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందులో నగరాలు, పట్టణాలు, పల్లెల నమూనాలు, తాజ్‌మహల్ స్ఫూర్తితో నిర్మించిన ‘ప్యాలెస్ ఆఫ్ కల్చర్’, పిల్లల బ్యాంకు, ఆక్వేరియం, పిల్లల పార్లమెంటు వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్కులోని పిల్లల బృందాలు పిల్లల పార్లమెంటు కోసం తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటారు. అందరూ కలసి ఉమ్మడి ప్రయోజనాల కోసం పనులు చేస్తారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!) -
పచ్చగా.. రెక్కలొచ్చెనా..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం తోపాటు జీహెచ్ఎంసీలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. వీటిని కొనసాగిస్తూనే మరిన్నింటితో ప్రజలకు మంచి వాతావరణం తోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా థీమ్, ట్రీ పార్కులతో పాటు ప్రధాన రహదారుల మార్గాల్లోని సెంట్రల్ మీడియన్లలోనూ పచ్చదనం కార్యక్రమాలను తలపెట్టింది. రూ.137 కోట్లు వెచ్చింది 57 థీమ్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా చేపట్టిన పనుల్లో 6 పార్కుల పనులు పూర్తయ్యాయి. ట్రీపార్కులు.. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ప్రజలకు ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ట్రీపార్కుల ఏర్పాటు చేపట్టారు. ఇప్పటి వరకు 406 ట్రీ పార్కుల్ని ఏర్పాటు చేశారు. వీటిలో ఎల్బీనగర్ జోన్లో 104, చార్మినార్ జోన్లో 23, ఖైరతాబాద్ జోన్లో 86, శేరిలింగంపల్లి జోన్లో 97, కూకట్పల్లి జోన్లో 56, సికింద్రాబాద్ జోన్లో 40 ఉన్నాయి. సెంట్రల్ మీడియన్లలో సైతం.. వివిధ రకాల పార్కులతో పాటు రోడ్ల మధ్యన సెంట్రల్ మీడియన్లలో ఇతరత్రా ఖాళీ ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పెంపు చర్యలు చేపట్టారు. వీటిలో పూలమొక్కలు సైతం పెంచుతున్నారు. మొక్కలతో వాహన కాలుష్యం తగ్గడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు గ్లేర్ కొట్టకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 186 సెంట్రల్ మీడియన్ల లొకేషన్లలో 176 కిలోమీటర్ల మేర పచ్చదనం పెంచి అందంగా కనిపించేలా చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. గత సంవత్సరం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దశాబ్ద కాలానికి (2011–21) సంబంధించి వెల్లడించిన నివేదికలో దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే పచ్చదనం విస్తీర్ణం అత్యధికంగా 48.66 చదరపు కిలోమీటర్లు పెరిగింది. నగరంలో పచ్చదనం 5.23 శాతం నుంచి దాదాపు 13 శాతానికి పెరిగింది. ట్రీసిటీగా కూడా గుర్తింపు పొందడం తెలిసిందే. ఆ నివేదిక స్ఫూర్తితో పచ్చదనం పెంపునకు బల్దియా పాటుపడుతోంది. (చదవండి: పని మీది.. పరిష్కారాలు నావి!) -
Atmakur: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం కొత్త అందాలను సంతరించుకుంది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్భుత పచ్చందాల పార్క్‌గా గుర్తింపు పొందింది. దశాబ్దం కిందట ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ థీమ్ ప్రాజెక్ట్ నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోలేక పోయింది. 2019లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో స్మృతి వనానికి మహర్దశ వచ్చింది. ఆరునెలల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్లు విడుదల చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆయా పనులన్నీ ప్రస్తుతం పూర్తి కావడంతో స్మృతివనం కొత్త సొబగులద్దుకుంది. ఆరుబయలు ఆడిటోరియం... పచ్చదనాల ల్యాండ్‌స్కేప్ చిన్నపాటి శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా స్మృతివనంలో పచ్చటి కార్పెట్ గ్రాస్‌తో పరుచుకున్న తిన్నెలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూర్చుని కార్యక్రమం తిలకించే విధంగా మినీ వేదిక ఏర్పాటు చేశారు. దీని వెనుక ఒక తెర కూడా ఉండడంతో ఏవైనా రికార్డు చేసిన వీడియోలు, సినిమాలు ప్రదర్శించుకోవచ్చు. అలాగే ఈ ల్యాండ్ స్కేప్ మధ్యలో రెండు గ్రానైట్ శిలా మండపాలు కూడా నిర్మించారు. అక్కడక్కడా గ్రానైట్‌తో ఏర్పాటైన అరుగులు పర్యాటకులు సేదతీరడానికి అనువుగా ఉన్నాయి. కనువిందుగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పర్యావరణంపై పర్యాటకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్మృతివనంలో పర్యావరణ విజ్ఞానకేంద్రానికి శ్రీకారం చుట్టారు. అయితే, నిధుల కొరతతో దశాబ్ద కాలంగా ఆగిపోయిన ఈ పనులు ఇటీవలే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. జీవకళలొలుకుతున్న పులిప్రతిమలు పర్యావరణ విజ్ఞాన కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన చిరుత పులుల ప్రతిమలు నిజం చిరుతలను చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. చెట్టుపై ఎక్కి కూర్చున్నట్లుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో సహజ వాతావరణంలో రాజసంగా నిలుచున్న పెద్దపులి ప్రతిమ వీక్షకులను సంభ్రమాశ్చ్యర్యాలకు గురి చేస్తోంది. అంతే కాకుండా విజ్ఞాన కేంద్రపు గోడలకు వేలాడదీసిన కొన్ని వన్యప్రాణుల చిత్రపటాలు చూడ ముచ్చటగొల్పుతున్నాయి. ఈ చిత్రపటాలన్నీ కూడా చేయితిరిగిన చిత్రకారులతో గీయించ బడిన కళాఖండాలు కావడం విశేషం. పిల్లను మోస్తున్న ఎలుగుబంటి, బరక భూములపై పరుగెత్తుతున్న బట్టమేక పక్షి, గడ్డిమైదానంలో కూర్చున్న కణితి, గాల్లో ఎగిరిపోతున్న కృష్ణ జింకల సమూహం, హనీబాడ్జర్ల చిత్రపటాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. రాతిపై జీవజాలం... వైఎస్ఆర్ స్మృతివనంలో ఉన్న పాదచర మార్గాలలో రాతి స్తంభాలపై పలు వన్యప్రాణులు, పక్షులు, సరీసృపాల శిల్పాలను చెక్కించి ఉంచారు. వీటికి సహజ వర్ణాలతో తీర్చిదిద్దడంతో ప్రత్యక్షంగా వాటిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అదే విధంగా అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో తీసిన వన్యప్రాణుల చిత్రాలను ఫ్లెక్సీలుగా తీర్చి దిద్ది పలుచోట్ల ఉంచారు. ఇవి కూడా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?) -
‘ది రిగ్’ థీమ్ పార్క్.. 2030 వరకు వేచి చూడాల్సిందే!!
Saudi Arabia's The Rig Theme Park: విద్యార్థులకు బోరింగ్‌గా అనిపించే విజ్ఞాన యాత్రను వినోదభరితంగా మార్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇకపై పరిశ్రమలోని చాంబర్లను, పెద్ద మెషిన్లను చూడటానికి నడుచుకుంటూ కాదు, రోలర్ కోస్టర్ రైడ్ చేస్తూ చూడొచ్చు. ఆశ్చర్యపోతున్నారా! ఫొటోలో కనిపిస్తున్నట్లు చమురు పరిశ్రమను తలపించే ఈ నిర్మాణం, నిజానికి ఓ థీమ్ పార్క్.. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే ప్రతిష్ఠాత్మక ప్రయత్నాలలో భాగంగా, ఈ థీమ్ పార్కును నిర్మించనుంది. పేరు ‘ది రిగ్’.. సుమారు 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో వినోదాన్ని అందించే ఎన్నో రైడ్లు ఉన్నాయి. పార్క్ చుట్టూ నీరు ఉండటంతో వాటర్ రైడ్స్‌కు కొరత లేదు. అండర్ వాటర్ రైడ్స్, బంగీ జంపింగ్, స్కై డైవింగ్ వంటి వినోదాలు కూడా ఉన్నాయి. ఇక బస చేయడానికి వీలుగా మూడు హోటళ్లు, 11 రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. పార్క్‌లోనే కాదు.. థీమ్ పార్క్‌కు వెళ్లే మార్గం కూడా ఉత్సాహాన్ని నింపేలా నిర్మించారు. హెలికాప్టర్ రైడ్, బోట్ రైడ్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. బాగుంది కదూ! మీరు కూడా అక్కడికి వెళ్లాలనుకుంటే కాస్త వేచి చూడక తప్పదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ థీమ్ పార్కును 2030లో ప్రారంభించనున్నట్లు సమాచారం. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
నవ్వొద్దని ప్రభుత్వం ఆంక్షలు, కానీ..
టోక్యో: కరోనా లాక్డౌన్లు ముగిసి ప్రపంచమంతటా అన్‌లాక్‌లు షురూ అయ్యాయి. తాజాగా జపాన్‌లో పర్యాటక ప్రాంతాలు తెరుచుకుంటున్నాయి. మ్యూజియంలు, ఒపేరా హౌజ్, థీమ్స్ పార్కుల్లోకి సందర్శకులు ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోలర్ కోస్టర్‌లో రైడ్ చేసే పర్యాటకులు బిగ్గరగా అరవొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, రోలర్ కోస్టర్‌లో ప్రయాణం చేసేటప్పుడు అత్యంత థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే టూరిస్టులు నిశ్శబ్దంగా ఉండటం కష్టమని భావించిన థీమ్ పార్క్ ఒకటి వినూత్నంగా ఆలోచించి ఓ పరిష్కారం కనుగొంది. టూరిస్టులు ఫేస్ మాస్కుపైన స్క్రీమింగ్ స్టిక్కర్లు ధరించేలా ఏర్పాట్లు చేసింది. దాంతో రోలర్ కోస్టర్‌లో వెళ్లేటప్పుడు ఆ ఎగ్జయిట్మెంట్ మిస్ కాబోదని చెప్పింది. వీటిని ధరించడం ద్వారా పర్యాటకులు బిగ్గరగా నవ్వుతున్న (అరుస్తున్న) అనుభూతికి లోనవుతారని పేర్కొంది. తమ ఉద్యోగులతో తొలుత ఈ ప్రయోగం చేయగా విజయవంతమైందని థీమ్ పార్క్‌ను నిర్వహిస్తున్న గ్రీన్లాండ్ రిసార్ట్స్ యూట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. గట్టిగా నవ్వడంలో ఇదో నూతన విధానం అని పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
వైరల్ : పార్క్‌లో కుటుంబంపై బౌన్సర్ల వీరంగం
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం సరదాగా కాన్పూర్‌లోని బ్లూ వరల్డ్ థీమ్ వాటర్ పార్క్‌కు వెళ్లిన ఓ కుటుంబంపై బౌన్సర్లు విరుచుకుపడ్డారు. పార్క్‌లో అనుమతి లేకుండా రైడ్ చేశారని ఆరోపిస్తూ బౌన్సర్లు ఆ కుటుంబంతో వాగ్యూద్ధానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. బౌన్సర్లు ఆ కుటుంబ సభ్యులను కిందపడేసి మరి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ కుటుంబానికి చెందిన మహిళ జుట్టు పట్టి లాగుతూ అమానుశంగా దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వారు ఏం చర్చించారో స్పష్టంగా లేకపోయినప్పటికీ.. వారి మధ్య అసభ్యకరమైన దూషణలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పార్క్‌లో ఓ కుటుంబంపై బౌన్సర్లు దాడి
-
బొట్టు.. బొట్టు.. ఒడిసి పట్టు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వర్షపునీటిని సంరక్షించేందుకు జలమండలి మహోద్యమానికి శ్రీకారం చుడుతోంది. ‘జలం.. జీవం’ పేరిట అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల వారికి తేలిగ్గా అర్థమయ్యేలా బెంగళూరు తరహాలో ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్క్’ను ఏర్పాటు చేయనుంది. ఈ పార్కులో ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు.. ఇలా ఎక్కడైనా ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు వీలుండే 26 రకాల పిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రూ.1.6 కోట్లతో జూబ్లీహిల్స్ రోడ్‌నెం.25లోని విశ్వేశ్వరయ్య పార్క్‌లో రెండెకరాల్లో ఈ థీమ్‌పార్క్‌ను నెలకొల్పనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి జూన్ రెండోవారం నాటికి పార్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో ఏర్పాటు చేసే రిసోర్స్ కేంద్రం ద్వారా.. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు ఇలా అన్ని వర్గాలకు భిన్న రూపాల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకోవడం, అందుకు సంబంధించిన సాంకేతిక వివరాలను అందజేస్తారు. 9% ఇంకుతోంది గ్రేటర్ పరిధిలో ఏటా కురుస్తున్న వర్షపాతంలో 9% నీరు నేల పైపొరలను తడుపుతుండగా.. మరో 9% భూగర్భంలోకి ఇంకుతోంది. ఇక 42% మేర నీరు ఆవిరవుతుండగా మరో 40 శాతం వృథాగా దారులపై పారుతోంది. ఈ 40 శాతం వరద నీటిని ఒడిసిపడితే చాలు గ్రేటర్లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 7,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో ఏటా కురిసే 830 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతాన్ని ఒడిసిపడితే.. అది సుమారు 15 టీఎంసీల నీటికి సమానం. దీంతో కోటి జనాభా ఉన్న నగరానికి ఏడాదంతా తాగునీటి అవసరాలు తీరతాయని అధికారులు చెబుతున్నారు. రుణాలిప్పిస్తాం.. వడ్డీ భరిస్తాం గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి సంరక్షణకు జలమండలి చేపట్టిన జలం.. జీవం కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్, మన పొరుగునే ఉన్న బెంగళూరు, లాతూర్ నగరాల్లో నీటి కరువు నేపథ్యంలో జలమండలి నగరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రప్రథమంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి వినియోగదారులకు రుణాలు అందజేయడంతోపాటు వడ్డీ భారాన్ని జలమండలే భరిస్తోంది. అత్యుత్తమ ఇంకుడు గుంతలు నిర్మించిన వారికి జలపుర స్కారాలు ప్రదానం చేయడంతో పాటు ఈ కార్యక్రమంపై నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న మార థాన్ రన్లకు అన్ని వర్గాల నుంచి స్పందన కనిపిస్తోంది. ఈ పార్క్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం. – ఎం.దానకిశోర్, జలమండలి, ఎండీ -
థీమ్ పార్క్‌లో లేజర్‌వార్
మీకు స్టార్‌వార్స్ సినిమా గురించి తెలుసు కదా.. అనుకున్న వెంటనే ఒక గ్రహం నుంచి ఇంకోదానికి.. ఒక గెలాక్సీ నుంచి ఇంకోదానికి వెళ్లిపోతూంటారు దీంట్లో. అంతేనా.. చేతిలో చిన్న పరికరం (ట్రైకార్డర్) ఉంటే చాలు.. ఒంటిలో ఉన్న జబ్బులేమిటి అన్నది తెలుసుకోవడమే కాకుండా.. ఆ వెంటనే చికిత్సలు కూడా ఠకీఠకీమని అయిపోతూంటాయి. నక్షత్రాలు, గ్రహాలు, వింత జంతువులు సెకనుసెకనుకూ కనిపించే ఈ సినిమా ప్రపంచం ఇప్పుడు వాస్తవంగా కొలువుదీరింది. ‘స్టార్ వర్డ్స్: గెలాక్సీ ఎడ్జ్’ పేరుతో వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్స్‌లో రూపుదిద్దుకుంటోంది. అనహీమ్ అనే ప్రాంతంలో ఇటీవల జరిగిన డీ23 ప్రదర్శనలో వాల్ట్ డిస్నీ చైర్మన్ బాబ్ బాపెక్ దీని వివరాలను వెల్లడించారు. ఈ అద్భుత ప్రపంచం. సినిమాలో మాదిరిగానే ఒకవైపున ఫస్ట్ ఆర్డర్.. ఇంకోవైపున రెనెసైన్స్ వర్గాలు లేజర్కత్తులతో యుద్ధాలు చేస్తూంటారు. ఇంకోవైపున గ్రహాంతర వాసుల మధ్య వ్యాపారాలు జరుగుతూంటాయి. థీమ్‌పార్క్‌ను సందర్శించే వారు.. అందులో ఉన్న దుకాణాల్లో ఉండే వాళ్లు అందరూ స్టార్వార్స్లోని పాత్రల మాదిరిగానే దుస్తులు ధరించి తిరగవచ్చు. మొత్తం థీమ్‌పార్క్‌లో ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ ఆధారంగా జరుగుతూంటుంది కాబట్టి.. మొత్తం సినిమా వాతావరణాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు. దీంతోపాటు ఈ థీమ్‌పార్క్‌లో రెండు ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి. అతిథులు మిలీనియం ఫాల్కన్ అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తూ శత్రుమూకలపై లేజర్ల కిరణాలతో దాడులు చేయవచ్చు. రెండో ఆకర్షణలో అతిథులకు ఓ పనిని అప్పగిస్తారు. దీనికోసం స్టార్‌వార్స్‌లో మాదిరిగా స్టార్ డిస్ట్రాయర్ అనే యుద్ధనౌకను మీకు అప్పగిస్తారు. దాంట్లో వెళుతూ ఇచ్చిన పని పూర్తి చేయాలన్నమాట. ప్రస్తుతానికి నిర్మాణంలో ఉన్న ఈ గెలాక్సీ ఎడ్జ్ థీమ్ పార్క్ ముందుగా వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో 2019లో తెరుచుకుంటుంది. ఆ తరువాత డిస్నీల్యాండ్ రిసార్ట్‌లోనూ దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకో విషయం ఈ రెండు థీమ్‌పార్క్‌లు 2019లో ఓపెన్ కానున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నగరమే ఓ వనం!
సిటీల్లో పచ్చదనానికి అర్బన్ లంగ్‌స్పేస్‌లు శబ్ద.. వాయు.. జల.. ఇలా వివిధ రూపాల్లో కాలుష్యం కోరలు చాస్తోంది. సమస్త మానవాళి మనుగడే ప్రశ్నార్థకం చేస్తోంది. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తోంది. మహానగరాలు, పట్టణాల్లో రోజురోజుకూ చెట్ల శాతం తగ్గిపోతుండటం.. వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో కాలుష్యం భయంకరంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో ప్రకృతి సమతుల్యతను పరిరక్షించేందుకు రాష్ట్రం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ‘‘అర్బన్ లంగ్‌స్పేస్’’ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ప్రజల జీవనానికి ప్రకృతిని అనుసంధానించి నగర వనాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 33,800 హెక్టార్ల విస్తీర్ణంలో 80 వనాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్ణయించింది. హైదరా బాద్‌తోపాటు ఆయా జిల్లాల్లో అర్బన్ లంగ్‌స్పేస్ కోసం ఫారెస్ట్ బ్లాక్‌ల కింద కొంత భూమిని విడిగా కేటాయించనుంది. పట్టణ శివారు ప్రాంతాలకు 4, 5 కి.మీ లోపు ఈ బ్లాక్ లను ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్లాక్ ల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, యోగా షెడ్, పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. మిగతా ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించనున్నారు. థీమ్ పార్కులతో కొత్త శోభ.. వీటితో పాటు థీమ్ పార్కులనూ ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కుల్లో డిజర్ట్ గార్డెన్, బ్యాంబు గార్డెన్, రాశి/నక్షత్రవనం, బటర్‌ఫ్లై గార్డెన్, కార్తీక వనం, నవగ్రహ వనం, సప్తర్షి వనం, హెర్బల్ గార్డెన్, అశోక వనం వంటి వాటిని అంతర్భాగంగా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి జిల్లాల పరిధిలో 36 వనాల్లో 7,700 హెక్టార్ల విస్తీర్ణంలో పనులు సాగు తున్నాయి. ఇప్పటివరకు 12 వనాలను ప్రజలకు అందు బాటులోకి తెచ్చారు. వీటిలో దూలపల్లి, నారపల్లి, మేడిపల్లి, నగరం, కండ్లకోయ, రాయగిరి, కేబీఆర్ పార్కు వంటివి ముఖ్యమైనవి. నగరంలోని అన్ని కాలనీలకూ నగర వనాలను అందుబాటులోకి తేవాలనేది అటవీ శాఖ ఉద్దేశం. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో కనీసం 11 జిల్లాల్లో ఈ అర్బన్ లంగ్‌స్పేస్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎన్ని హెక్టార్లలో... 33,800 ఎన్ని వనాలు... 80 -
సెలవులకు కొత్త ‘థీమ్’!
దేశంలో థీమ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ.. ♦ గతేడాది అమ్యూజ్మెంట్ పార్క్‌ల ఆదాయం రూ. 2,930 కోట్లు! ♦ ఏటా 5 కోట్ల మంది సందర్శన; 10–15 శాతం వృద్ధి ♦ వచ్చే మూడేళ్లలో రూ.4వేల కోట్ల ఆదాయంపై దృష్టి ♦ హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్, యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా? హైదరాబాద్, బిజినెస్ బ్యూరో రోలర్ కోస్టర్, ఫ్లై థీమ్ స్పేస్, ఫ్లాట్ రైడ్స్, ఫెర్సీస్ వీల్స్, వెట్–ఓ–వైల్డ్, డ్రాప్ టవర్... ఇవి హాలీవుడ్ సినిమా పేర్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవన్నీ వినోదభరిత క్రీడల పేర్లు. గతేడాది ఈ క్రీడలపై పెట్టిన ఖర్చు ఏకంగా రూ.2,930 కోట్లు! సినిమా అయితే రెండున్నర గంటల్లో పూర్తవుతుంది. ఇవి మాత్రం రోజంతా... ఇంకా చెప్పాలంటే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రాంతాలు. ఈ అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్‌లు వినోద, ఆహ్లాదభరితమైన ప్రాంతాలే కాదు.. కాసులు కురిపించే భారీ పరిశ్రమలు కూడా!!. రూ.2,930 కోట్లకు పరిశ్రమ.. ప్రపంచవ్యాప్తంగా అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్ పరిశ్రమ విలువ రూ.2.7 లక్షల కోట్లుగా ఉంది. మన దేశంలో 2015లో రూ.2,660 కోట్లుకు చేరిన పరిశ్రమ 2016 నాటికి రూ.2,930 కోట్లకు వృద్ధి చెందినట్లు ‘ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ ఇండస్ట్రీస్‘ (ఐఏఏపీఐ) చెబుతోంది. వచ్చే మూడేళ్లలో ఏటా 17.5 శాతం వృద్ధితో రూ.4 వేల కోట్లను అధిగమిస్తుందని పేర్కొంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 80 వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు. ఏటా 5 కోట్ల మంది సందర్శన.. ప్రస్తుతం దేశంలో 125 అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్‌లున్నాయి. యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా, ఎస్సెల్ వరల్డ్, నిక్కో పార్క్, వండర్లా, కిష్కింద వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి. శరవేగంగా జరుగుతున్న నగరీకరణ, చిన్న కుటుంబాలు, మిగులు ఆదాయం వంటివి అమ్యూజ్మెంట్ పార్క్‌ల సందర్శకుల్లో వృద్ధికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏటా దేశంలో 5 కోట్ల మంది పార్క్‌లను ఈ సందర్శిస్తున్నారని.. ఏటా 10–15 శాతం వృద్ధి నమోదవుతోందని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి చెప్పారు. పరిశ్రమకు 55 శాతం ఆదాయం టికెట్ల అమ్మకాల ద్వారా, 35 శాతం ఆదాయం ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ), మిగిలింది బ్రాండింగ్ ద్వారా వస్తోంది. ద్వంద్వ పన్నులే అడ్డు.. ప్రస్తుతం అమ్యూజ్మెంట్ పార్క్ పరిశ్రమ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్‌లు రెండింటినీ చెల్లించాల్సి వస్తోంది. మలేíసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఈ పరిశ్రమకు పన్నులు 10 శాతం కంటే తక్కువుంటాయి. మన దేశంలో మాత్రం 25–50 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ద్వంద్వ పన్ను విధానమే పరిశ్రమ వృద్ధికి అడ్డుగా మారుతోందని ఐఏఏపీఐ జనరల్ సెక్రటరీ అనిల్ పద్వాల్ తెలిపారు. వాస్తవానికి అమ్యూజ్మెంట్ పార్క్ పరిశ్రమ పర్యాటక రంగంలో భాగం. ఆయా పార్క్‌లతో విదేశీ పర్యాటకులు మన దేశానికొస్తున్నారు. ఏటా టూరిజం వృద్ధి చెందుతోంది కూడా. అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు ప్రధానంగా కావాల్సింది భూమి, యంత్ర సామాగ్రి, జల వనరులు, రవాణా సౌకర్యం. ప్రధాన నగరాల్లో భూముల విలువలు పెరగడం, పూర్తిగా యంత్ర సామగ్రిపై ఆధారపడటంతో పార్క్‌ల ఏర్పాటు ప్రారంభ పెట్టుబడులు అధికంగా ఉంటాయని అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థల కేటాయింపులు, పన్ను ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయన కోరారు. త్వరలో అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో ఈ రంగంలో పారదర్శకత నెలకొని, పెట్టుబడులు మరింత వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణంలో మరో 12 పార్క్‌లు.. వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా మరో 12 అమ్యూజ్మెంట్ పార్క్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వండర్లా, అట్లాంటా, ల్యాండ్‌మార్క్ వంటి కంపెనీలు స్థల సమీకరణ పూర్తి చేసి పార్క్ నిర్మాణ పనులు జరుపుతుంటే.. డిస్నీల్యాండ్, య్యాడ్ల్యాబ్స్ ఇమాజికా వంటి సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రాథమిక చర్చల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో వండర్లా, ఓషన్ వరల్డ్, మౌంట్ ఓపెరా వంటి అమ్యూజ్మెంట్ పార్క్‌లున్నాయి. ఏటా వీటిని 10 లక్షల మంది సందర్శిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా నగరంలో యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా, డిస్నీల్యాండ్ సంస్థలు థీమ్ పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. రూ.25 వేల కోట్లతో 1,300 ఎకరాల్లో డిస్నీ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. స్థల సమీకరణ కోసం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను పరిశీలిస్తోంది. యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా నగర శివారులో స్థల సమీకరణ కూడా పూర్తి చేసిందని.. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనుందని తెలిసింది. భలే పార్క్‌లు, బోలెడన్ని రైడ్లు ⇔ వండర్లా హాలిడేస్ లిమిటెడ్‌కు కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్యూజ్మెంట్ పార్క్‌లున్నాయి. 35 ఎకరాల్లోని కొచ్చి పార్క్‌లో 58 రైడ్స్, 82 ఎకరాల్లోని బెంగళూరు పార్క్‌లో 62 రైడ్స్, 50 ఎకరాల్లోని హైదరాబాద్ పార్క్‌లో 43 రైడ్స్ ఉన్నాయి. ఏటా వీటిని 26 లక్షల మంది సందర్శిస్తున్నారు. ⇔ ఎస్సెల్ గ్రూప్ పాన్ ఇండియా పర్యాటన్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఐపీపీఎల్) పేరుతో అమ్యూజ్మెంట్ పార్క్‌లను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ముంబైలో 64 ఎకరాల్లో ఎస్సెల్ వర ల్డ్, 22 ఎకరాల్లో వాటర్ కింగ్డమ్ థీమ్ పార్క్‌లున్నాయి. ఎస్సెల్ వరల్డ్‌లో 90 రైడ్స్ ఉన్నాయి. ఏటా 18 లక్షల మంది సందర్శిస్తున్నారు. వాటర్ కింగ్ డమ్‌లో 30 రైడ్స్ ఉన్నాయి. దీన్ని ఏటా 11 లక్షల మంది సందర్శిస్తున్నారు. ⇔ నిక్కో పార్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ (ఎన్పీఆర్ఎల్) కోల్‌కతాలో నికోపార్క్ను నిర్వహిస్తోంది. 40 ఎకరాల్లో ఉన్న ఈ పార్క్‌లో 35 రకాల రైడ్స్ ఉన్నాయి. ఏటా 15 లక్షల మంది విజిట్ చేస్తున్నారు. ⇔ మహారాష్ట్ర రాయ్‌ఘడ్‌లోని ఖోపొలి ప్రాంతంలో 300 ఎకరాల్లో యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా థీమ్ పార్క్ ఉంది. ఇందులో థీమ్, వాటర్, స్నో పార్క్ మూడు కలిపి ఉండటం దీని ప్రత్యేకత. ఏటా ఈ పార్క్‌ను 12 లక్షల మంది సందర్శిస్తున్నారు. -
అమెరికాలో బాంబు కలకలం!
అమెరికా వాషింగ్టన్ డీసీలోని ప్రముఖ థీమ్ పార్క్ ‘సిక్స్ ఫ్లాగ్స్ అమెరికా’ వద్ద బుధవారం బాంబు కలకలం రేగింది. ఈ థీమ్ పార్కు వద్ద బాంబులు ఉన్నట్టు అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు వదంతులపై ప్రస్తుతం పోలీసు అధికారులకు సహకరిస్తున్నామని, థీమ్ పార్కు పూర్తిగా సురక్షితంగా ఉన్నదని నిర్ధారించుకునేవరకు దీనిని మూసివేస్తున్నామని పార్కు అధికారులు ట్విట్టర్ లో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు థీమ్ పార్కు వద్ద రెండు అనుమానిత ప్యాకేజీలు లభించాయని, దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రిన్స్ జార్జ్ కౌంటీ అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి మార్క్ బ్రాడీ తెలిపారు. మొదటి అనుమానిత ప్యాకేజీని తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు ఏమీ కనిపించలేదని, రెండో దానిని ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేస్తున్నారని ఆయన చెప్పారు. -
చైనాలోనూ మిక్కీ డోనాల్డ్
-
కళ్యాణం తో వైభోగం
♦ సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ ♦ కెమెరాతో చిత్రీకరణ ♦ రామనవమి నాడు వరాల జల్లు! ♦ థీమ్ పార్కుపై మళ్లీ కదలిక ♦ జటాయువు మండ పానికి మెరుగులు ఈ ఏడాది శ్రీరామనవమి నాటితో భద్రాచలం దశ మారనుంది. 15వ తేదీన ఆలయానికి మహర్దశ పట్టనుంది. శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి వరాలు కురిపిస్తారని మంత్రి తుమ్మల ప్రకటించారు. దీనిలో భాగంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దేవాదాయశాఖ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు భద్రాద్రి పరిసరాల్లో పర్యటిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎంకు నివేదిక అందజేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భద్రాచలం : భద్రాద్రి రాములోరి క్షేత్రం రూపురేఖలు మార్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమవుతోంది. శ్రీరామ నవమి రోజు శ్రీ సీతారాముల కల్యాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం వస్తారు. భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారని ఇప్పటికే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. యాదాద్రి, వేములవాడ ఆలయాలకు వందల కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి క్షేత్రానికి కూడా ఆ స్థాయిలోనే నిధులు ఇస్తారని జిల్లా ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. పనుల నిర్వహణపై దేవాదాయశాఖ ఆర్కిటెక్ట్, స్థపతి, ఇతర ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు భద్రాచలం, పర్ణశాల ప్రాంతాన్ని ఓ దఫా పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి సూచన మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫొటోగ్రఫీ నిపుణులు డ్రోన్ కెమెరాతో గుడి పరిసరాలను చిత్రీకరించారు. భద్రాచలం రామాలయం, మిథిలా స్టేడియం ప్రాంగణం, గోదావరి స్నానఘట్టాల పరిసరాలను డ్రోన్ కెమెరా వీడియో తీసింది. పర్ణశాల కుటీరం పరిసరాలు, భద్రాలానికి సమీపంలో ఏపీలో విలీనమైన జటాయువు మండప ప్రాంతాన్ని చిత్రీకరించారు. భద్రాద్రి దేవస్థానం డీఈ రవీందర్ తగు సూచనలు చేశారు. భద్రాద్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ఆనందసాయికి వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, డ్రోన్ కెమెరాల ద్వారా భౌగోళిక స్థితిగతులను కూడా అంచనా వేసి, దేవాదాయశాఖ ద్వారా ప్రభుత్వానికి తగు నివేదిక అందజేయనున్నారు. ఆ పంచాయతీలూ వస్తే అభివృద్ధి పుంతలు ఏపీలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలు తిరిగి తెలంగాణలోకి వస్తే భద్రాచలం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని పరిశీలకులు అంటున్నారు. పట్టణానికి సమీపంలోని ఆదర్శనగర్ కాలనీ పక్కన దేవస్థానానికి చెందిన సుమారు 11 ఎకరాల్లో రామాయణం థీమ్ పార్కుతో పాటు, ట్రైబల్ హట్ (గిరిజన మ్యూజియం) నెలకొల్పేందుకు సర్వం సిద్ధమైంది. కానీ రాష్ట్ర విభజనతో ఈ ప్రాంతం ఏపీలోకి వెళ్లింది. థీమ్ పార్కుకు రూ. రూ.21.54 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర టూరిజం శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ట్రైబల్ హట్ కోసం రూ.2.05 కోట్ల ఏపీటీడీసీ నిధులు అప్పట్లోనే మంజూరయ్యాయి. శిల్పాల ఏర్పాటు కోసం పెద్ద పెద్ద రాళ్లు తెప్పించి, పనులు కూడా ప్రారంభించారు. కానీ ఈ భూములు ఏపీలో విలీనం కావటంతో పనులకు అవాంతరం ఏర్పడింది. తాజాగా ఈ పంచాయతీలు తిరిగి తెలంగాణకు వస్తాయని నేరుగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో థీమ్ పార్కు, ట్రైబల్ హట్ నిర్మాణాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే థీమ్ పార్కును అక్కడ కాకుండా పర్ణశాల లేదా జటాయువు మండపం పరిసరాల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. జటాయువు మండప పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించటం దీనిలో భాగమేనని దేవస్థానం అధికారులు అంటున్నారు. రెండో ప్రాకార మండపానికి ప్రాధాన్యం ఆలయాభివృద్ధిలో భాగంగా రామాలయం చుట్టూ 150 అడుగుల మేర రెండో ప్రాకారాన్ని నిర్మించేందుకు వైదిక కమిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. రామాలయానికి ఎదురుగా ఉన్న నృసింహస్వామి ఆలయానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆలయం నుంచి గోదావరికి దారి, తాతగుడి వరకు రహదారి విస్తరిస్తే ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వైదిక కమిటీ సూచిస్తోంది. ఆర్కిటెక్ట్ ఆనందసాయికి నివేదిక అందజేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు భద్రాచలం ప్రాంతవాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. -
వీడియో గేమ్ థీమ్ పార్క్!
దుబాయ్: పిల్లలతో పాటు పెద్దలు సైతం ఇష్టంగా ఆడుకునే వీడియో గేమ్‌ల థీమ్‌తో ఓ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ థీమ్ పార్క్‌లో స్ట్రీట్ ఫైటర్, మెటల్ గేర్ సాలిడ్, ఫైనల్ ఫాంటసీ లాంటి పాపులర్ గేమ్‌లలోని క్యారెక్టర్లతో పాటు మరెన్నో వీడియో గేమ్‌ల దృష్యాలు కనిపించనున్నాయి. 'హబ్ జీరో' పేరుతో మిరాస్ కంపెనీ నిర్మిస్తున్న ఈ వీడియోగేమ్ థీమ్ పార్క్ దుబాయ్‌లో ఈ సమ్మర్లోనే మొదలవుతోంది. వీడియో గేమ్ అభివృద్ధి సంస్థలు క్యాప్కామ్, కొనామి, స్క్వేర్ ఎనిక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వంటి సంస్థలతో ఈ పార్క్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాన్ని మిరాస్ కుదుర్చుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా వీడియో గేమ్‌లకు సంబంధించిన ఇండోర్ థీమ్ పార్క్ 'హబ్ జీరో' మంచి ఆధరణ పొందుతుందని మిరాస్ సంస్థ నమ్మకంగా ఉంది. వీడియో గేమ్‌లపై వినియోగదారులు 2014 సంవత్సరంలో సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని, ఇది సంవత్సరానికి 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని మిరాస్ వెల్లడించింది. -
‘రేస్’ కోర్స్ మాదే..
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం, మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ల మధ్య మహాలక్ష్మి రేస్ కోర్సు స్థల వివాదం ముదరనుంది. వాస్తవానికి ఆ స్థలం మొత్తం తమదేనని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇందులో కొంత స్థలం బీఎంసీకి ఎలా, ఎప్పుడు మార్పిడి జరిగిందని ప్రశ్నించింది. అందుకు వందేళ్ల కిందటి రుజువులు, దస్తావేజులు, రికార్డులు వెలికితీయాలని బీఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వివాదంతో శివసేన కొంత ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఎంసీకి చెందిన స్థలంలో పిల్లలు ఆడుకునేందుకు థీం పార్క్ నిర్మించాలని శివసేన ప్రతిపాదించింది. దీన్ని అడ్డుపెట్టుకుని శివసేన అక్కడ బాల్ ఠాక్రే భారీ స్మారకాన్ని నిర్మించాలనే యోచనలో ఉంది. మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో మొత్తం ఎనిమిదిన్నర లక్షల చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో 5.96 లక్షల చదరపు మీటర్ల స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది ఉండగా, మిగతా 2.58 లక్షల చదరపు మీటర్ల స్థలం బీఎంసీ పరిపాలన విభాగానికి చెందింది. ఈ మొత్తం స్థలాన్ని 1914లో రాయల్ వెస్టర్న్ క్లబ్‌కు 99 సంవత్సరాల కోసం ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. 2013లో లీజు గడువు ముగిసింది. ఇక గడువు పొడిగించి ఇవ్వకూడదని బీఎంసీ డిమాండ్ చేసింది. నగరాభివృద్ధి ప్రణాళికలో ఈ స్థలం క్రీడా మైదానానికి రిజర్వు చేయడంతో ఇక్కడ భారీ థీం పార్క్ నిర్మించాలని శివసేన పేర్కొంది. ఇక్కడ బాల్ ఠాక్రే స్మారకాన్ని నిర్మించాలని శివసేన భావిస్తోంది. కాని ప్రభుత్వం హెలీపోర్టు నిర్మించాలని యోచిస్తోంది. దీంతో ఈ మొత్తం స్థలాన్ని తమకే అందజేయాలని విమానాశ్రయ అభివృద్ధి సంస్థ డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి ఈ స్థలమంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వం అంటోంది. ఇందులో కొంత భాగం బీఎంసీ పేరిట ఎలా మార్పిడి జరిగిందని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీంతో ఇరు సంస్థల మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. అందుకు వందేళ్ల కిందటి రికార్డులు సమర్పించాలని బీఎంసీ పరిపాలన విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. -
మహాలక్ష్మి రేస్‌కోర్సులో హెలిపోర్ట్
సాక్షి, ముంబై: నగరంలోని మహాలక్ష్మి రేస్‌కోర్సులో థీమ్‌పార్కు ఏర్పాటు చేయాలన్న శివసేన ఆశలు సాకారమయ్యేలా కనిపించడంలేదు. ఇక్కడ ఓ భారీ హెలిపోర్ట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో సర్కార్ బిజీగా ఉన్నట్లు సమాచారం. మొన్నటి వరకు ఇక్కడ వృద్ధులు విశ్రాంతి తీసుకునేందుకు ఉద్యానవనాలు, పిల్లలు ఆడుకునేందుకు థీమ్‌పార్కు ఏర్పాటు సంకల్పించిన ప్రభుత్వం ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేగాక హెలిపోర్ట్ నిర్మాణానికి సరిపడా స్థలం కావాలంటే మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అధీనంలో ఉన్న స్థలాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. మహాలక్ష్మి రేసుకోర్సులో మొత్తం 222 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని రేస్ కోర్సు కోసం లీజుకు ఇచ్చిన 99 సంవత్సరాల గడువు ముగిసింది. దీంతో ఇక్కడ అంతర్జాతీయస్థాయిలో థీమ్‌పార్కు ఏర్పాటు చేయాలని కోరుతూ అందుకు సంబందించిన మ్యాపును అప్పట్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు ఈ థీమ్‌పార్కు ఎంతో వినోదాత్మకంగా, ఆహ్లాదాన్ని పంచుతుందని ఉద్ధవ్ అప్పట్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకు సానుకూలంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ధనవంతులు రాకపోకలు సాగించేందుకు, హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్‌ల కోసం భారీ హెలిపోర్టును నిర్మించాలని భావిస్తోంది. హెలిపోర్టు ప్రతిపాదనలు * బీఎంసీ అధీనంలో ఉన్న 19 ఎకరాల స్థలంలో హజీ అలీ దిశలో హెలిపోర్టుకు వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తారు. * హెలిపోర్టును రెస్కోర్సు మధ్యలో ఏర్పాటు చేస్తారు. * 600 మీటర్ల పొడువు రన్ వే నిర్మిస్తారు. * వీఐపీల కోసం రెండు విశ్రాంతి గదులు, అలాగే హెలికాప్టర్ల కోసం నాలుగు బెర్తులు నిర్మిస్తారు. * హెలిపోర్టు నిర్మాణం కోసం రూ.42 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. థీమ్ పార్కు ప్రతిపాదనలు * అంతర్జాతీయ స్థాయిలో నిర్మించే ఈ థీమ్‌పార్కు పేదలు, మధ్య తరగతి ప్రజలు, పిల్లలు ఆనందంగా, ఆహ్లదంగా గడిపేందుకు వీలుగా ఉంటుంది. * ఈ థీమ్‌పార్కులో సైక్లింగ్, జాగింగ్, స్కేటింగ్ కోసం ట్రాక్ నిర్మిస్తారు. * బోటింగ్, గాలిపటాలు ఎగురవేసేందుకు ప్రత్యేకంగా ఓ జోన్ ఏర్పాటు చేస్తారు. * సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేస్తారు. * సాంస్కృతిక కార్యక్రమాల కోసం యాంపీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తారు. * పిల్లల కోసం ఉద్యానవనం, పెద్దల కోసం ధ్యాన కేంద్రం ఏర్పాటు చేస్తారు. * నగరవాసుల్లో ఆరోగ్యస్పృహ పెంపొందించేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు.