సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో వర్షపునీటిని సంరక్షించేందుకు జలమండలి మహోద్యమానికి శ్రీకారం చుడుతోంది. ‘జలం.. జీవం’ పేరిట అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల వారికి తేలిగ్గా అర్థమయ్యేలా బెంగళూరు తరహాలో ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్క్’ను ఏర్పాటు చేయనుంది.
ఈ పార్కులో ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు.. ఇలా ఎక్కడైనా ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు వీలుండే 26 రకాల పిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రూ.1.6 కోట్లతో జూబ్లీహిల్స్ రోడ్‌నెం.25లోని విశ్వేశ్వరయ్య పార్క్‌లో రెండెకరాల్లో ఈ థీమ్‌పార్క్‌ను నెలకొల్పనున్నారు.
ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి జూన్ రెండోవారం నాటికి పార్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో ఏర్పాటు చేసే రిసోర్స్ కేంద్రం ద్వారా.. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు ఇలా అన్ని వర్గాలకు భిన్న రూపాల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకోవడం, అందుకు సంబంధించిన సాంకేతిక వివరాలను అందజేస్తారు.
9% ఇంకుతోంది
గ్రేటర్ పరిధిలో ఏటా కురుస్తున్న వర్షపాతంలో 9% నీరు నేల పైపొరలను తడుపుతుండగా.. మరో 9% భూగర్భంలోకి ఇంకుతోంది. ఇక 42% మేర నీరు ఆవిరవుతుండగా మరో 40 శాతం వృథాగా దారులపై పారుతోంది. ఈ 40 శాతం వరద నీటిని ఒడిసిపడితే చాలు గ్రేటర్‌లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
7,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్‌ఎండీఏ పరిధిలో ఏటా కురిసే 830 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతాన్ని ఒడిసిపడితే.. అది సుమారు 15 టీఎంసీల నీటికి సమానం. దీంతో కోటి జనాభా ఉన్న నగరానికి ఏడాదంతా తాగునీటి అవసరాలు తీరతాయని అధికారులు చెబుతున్నారు.
రుణాలిప్పిస్తాం.. వడ్డీ భరిస్తాం
గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి సంరక్షణకు జలమండలి చేపట్టిన జలం.. జీవం కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్, మన పొరుగునే ఉన్న బెంగళూరు, లాతూర్ నగరాల్లో నీటి కరువు నేపథ్యంలో జలమండలి నగరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దేశంలో ప్రప్రథమంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి వినియోగదారులకు రుణాలు అందజేయడంతోపాటు వడ్డీ భారాన్ని జలమండలే భరిస్తోంది. అత్యుత్తమ ఇంకుడు గుంతలు నిర్మించిన వారికి జలపుర స్కారాలు ప్రదానం చేయడంతో పాటు ఈ కార్యక్రమంపై నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న మార థాన్ రన్‌లకు అన్ని వర్గాల నుంచి స్పందన కనిపిస్తోంది. ఈ పార్క్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం. – ఎం.దానకిశోర్, జలమండలి, ఎండీ
Comments
Please login to add a commentAdd a comment