కళ్యాణం తో వైభోగం
♦ సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్
♦ కెమెరాతో చిత్రీకరణ
♦ రామనవమి నాడు వరాల జల్లు!
♦ థీమ్ పార్కుపై మళ్లీ కదలిక
♦ జటాయువు మండ పానికి మెరుగులు
ఈ ఏడాది శ్రీరామనవమి నాటితో భద్రాచలం దశ మారనుంది. 15వ తేదీన ఆలయానికి మహర్దశ పట్టనుంది. శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి వరాలు కురిపిస్తారని మంత్రి తుమ్మల ప్రకటించారు. దీనిలో భాగంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దేవాదాయశాఖ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు భద్రాద్రి పరిసరాల్లో పర్యటిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎంకు నివేదిక అందజేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
భద్రాచలం : భద్రాద్రి రాములోరి క్షేత్రం రూపురేఖలు మార్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమవుతోంది. శ్రీరామ నవమి రోజు శ్రీ సీతారాముల కల్యాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం వస్తారు. భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారని ఇప్పటికే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. యాదాద్రి, వేములవాడ ఆలయాలకు వందల కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి క్షేత్రానికి కూడా ఆ స్థాయిలోనే నిధులు ఇస్తారని జిల్లా ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. పనుల నిర్వహణపై దేవాదాయశాఖ ఆర్కిటెక్ట్, స్థపతి, ఇతర ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు భద్రాచలం, పర్ణశాల ప్రాంతాన్ని ఓ దఫా పరిశీలించారు.
ఆర్కిటెక్ట్ ఆనందసాయి సూచన మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫొటోగ్రఫీ నిపుణులు డ్రోన్ కెమెరాతో గుడి పరిసరాలను చిత్రీకరించారు. భద్రాచలం రామాలయం, మిథిలా స్టేడియం ప్రాంగణం, గోదావరి స్నానఘట్టాల పరిసరాలను డ్రోన్ కెమెరా వీడియో తీసింది. పర్ణశాల కుటీరం పరిసరాలు, భద్రాలానికి సమీపంలో ఏపీలో విలీనమైన జటాయువు మండప ప్రాంతాన్ని చిత్రీకరించారు. భద్రాద్రి దేవస్థానం డీఈ రవీందర్ తగు సూచనలు చేశారు. భద్రాద్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ఆనందసాయికి వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, డ్రోన్ కెమెరాల ద్వారా భౌగోళిక స్థితిగతులను కూడా అంచనా వేసి, దేవాదాయశాఖ ద్వారా ప్రభుత్వానికి తగు నివేదిక అందజేయనున్నారు.
ఆ పంచాయతీలూ వస్తే అభివృద్ధి పుంతలు
ఏపీలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలు తిరిగి తెలంగాణలోకి వస్తే భద్రాచలం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని పరిశీలకులు అంటున్నారు. పట్టణానికి సమీపంలోని ఆదర్శనగర్ కాలనీ పక్కన దేవస్థానానికి చెందిన సుమారు 11 ఎకరాల్లో రామాయణం థీమ్ పార్కుతో పాటు, ట్రైబల్ హట్ (గిరిజన మ్యూజియం) నెలకొల్పేందుకు సర్వం సిద్ధమైంది. కానీ రాష్ట్ర విభజనతో ఈ ప్రాంతం ఏపీలోకి వెళ్లింది. థీమ్ పార్కుకు రూ. రూ.21.54 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర టూరిజం శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.
ట్రైబల్ హట్ కోసం రూ.2.05 కోట్ల ఏపీటీడీసీ నిధులు అప్పట్లోనే మంజూరయ్యాయి. శిల్పాల ఏర్పాటు కోసం పెద్ద పెద్ద రాళ్లు తెప్పించి, పనులు కూడా ప్రారంభించారు. కానీ ఈ భూములు ఏపీలో విలీనం కావటంతో పనులకు అవాంతరం ఏర్పడింది. తాజాగా ఈ పంచాయతీలు తిరిగి తెలంగాణకు వస్తాయని నేరుగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో థీమ్ పార్కు, ట్రైబల్ హట్ నిర్మాణాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే థీమ్ పార్కును అక్కడ కాకుండా పర్ణశాల లేదా జటాయువు మండపం పరిసరాల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. జటాయువు మండప పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించటం దీనిలో భాగమేనని దేవస్థానం అధికారులు అంటున్నారు.
రెండో ప్రాకార మండపానికి ప్రాధాన్యం
ఆలయాభివృద్ధిలో భాగంగా రామాలయం చుట్టూ 150 అడుగుల మేర రెండో ప్రాకారాన్ని నిర్మించేందుకు వైదిక కమిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. రామాలయానికి ఎదురుగా ఉన్న నృసింహస్వామి ఆలయానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆలయం నుంచి గోదావరికి దారి, తాతగుడి వరకు రహదారి విస్తరిస్తే ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వైదిక కమిటీ సూచిస్తోంది. ఆర్కిటెక్ట్ ఆనందసాయికి నివేదిక అందజేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు భద్రాచలం ప్రాంతవాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.