మహాలక్ష్మి రేస్‌కోర్సులో హెలిపోర్ట్
సాక్షి, ముంబై: నగరంలోని మహాలక్ష్మి రేస్‌కోర్సులో థీమ్‌పార్కు ఏర్పాటు చేయాలన్న శివసేన ఆశలు సాకారమయ్యేలా కనిపించడంలేదు. ఇక్కడ ఓ భారీ హెలిపోర్ట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో సర్కార్ బిజీగా ఉన్నట్లు సమాచారం. మొన్నటి వరకు ఇక్కడ వృద్ధులు విశ్రాంతి తీసుకునేందుకు ఉద్యానవనాలు, పిల్లలు ఆడుకునేందుకు థీమ్‌పార్కు ఏర్పాటు సంకల్పించిన ప్రభుత్వం ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేగాక హెలిపోర్ట్ నిర్మాణానికి సరిపడా స్థలం కావాలంటే మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అధీనంలో ఉన్న స్థలాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది.
మహాలక్ష్మి రేసుకోర్సులో మొత్తం 222 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని రేస్ కోర్సు కోసం లీజుకు ఇచ్చిన 99 సంవత్సరాల గడువు ముగిసింది. దీంతో ఇక్కడ అంతర్జాతీయస్థాయిలో థీమ్‌పార్కు ఏర్పాటు చేయాలని కోరుతూ అందుకు సంబందించిన మ్యాపును అప్పట్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు ఈ థీమ్‌పార్కు ఎంతో వినోదాత్మకంగా, ఆహ్లాదాన్ని పంచుతుందని ఉద్ధవ్ అప్పట్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకు సానుకూలంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ధనవంతులు రాకపోకలు సాగించేందుకు, హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్‌ల కోసం భారీ హెలిపోర్టును నిర్మించాలని భావిస్తోంది.
హెలిపోర్టు ప్రతిపాదనలు
* బీఎంసీ అధీనంలో ఉన్న 19 ఎకరాల స్థలంలో హజీ అలీ దిశలో హెలిపోర్టుకు వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తారు.
* హెలిపోర్టును రెస్‌కోర్సు మధ్యలో ఏర్పాటు చేస్తారు.
* 600 మీటర్ల పొడువు రన్ వే నిర్మిస్తారు.
* వీఐపీల కోసం రెండు విశ్రాంతి గదులు, అలాగే హెలికాప్టర్ల కోసం నాలుగు బెర్తులు నిర్మిస్తారు.
* హెలిపోర్టు నిర్మాణం కోసం రూ.42 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
థీమ్ పార్కు ప్రతిపాదనలు
* అంతర్జాతీయ స్థాయిలో నిర్మించే ఈ థీమ్‌పార్కు పేదలు, మధ్య తరగతి ప్రజలు, పిల్లలు ఆనందంగా, ఆహ్లదంగా గడిపేందుకు వీలుగా ఉంటుంది.
* ఈ థీమ్‌పార్కులో సైక్లింగ్, జాగింగ్, స్కేటింగ్ కోసం ట్రాక్ నిర్మిస్తారు.
* బోటింగ్, గాలిపటాలు ఎగురవేసేందుకు ప్రత్యేకంగా ఓ జోన్ ఏర్పాటు చేస్తారు.
* సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేస్తారు.
* సాంస్కృతిక కార్యక్రమాల కోసం యాంపీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తారు.
* పిల్లల కోసం ఉద్యానవనం, పెద్దల కోసం ధ్యాన కేంద్రం ఏర్పాటు చేస్తారు.
* నగరవాసుల్లో ఆరోగ్యస్పృహ పెంపొందించేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు.