‘రేస్’ కోర్స్ మాదే.. | BMC have no rights on mahalakshmi race course:state government | Sakshi
Sakshi News home page

‘రేస్’ కోర్స్ మాదే..

Jul 4 2014 11:00 PM | Updated on Sep 2 2017 9:48 AM

రాష్ట్ర ప్రభుత్వం, మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ల మధ్య మహాలక్ష్మి రేస్ కోర్సు స్థల వివాదం ముదరనుంది.

సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం, మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ల మధ్య మహాలక్ష్మి రేస్ కోర్సు స్థల వివాదం ముదరనుంది. వాస్తవానికి ఆ స్థలం మొత్తం తమదేనని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇందులో కొంత స్థలం బీఎంసీకి ఎలా, ఎప్పుడు మార్పిడి జరిగిందని ప్రశ్నించింది. అందుకు వందేళ్ల కిందటి రుజువులు, దస్తావేజులు, రికార్డులు వెలికితీయాలని బీఎంసీని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ వివాదంతో శివసేన కొంత ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఎంసీకి చెందిన స్థలంలో పిల్లలు ఆడుకునేందుకు థీం పార్క్ నిర్మించాలని శివసేన ప్రతిపాదించింది. దీన్ని అడ్డుపెట్టుకుని శివసేన అక్కడ బాల్ ఠాక్రే భారీ స్మారకాన్ని నిర్మించాలనే యోచనలో ఉంది. మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో మొత్తం ఎనిమిదిన్నర లక్షల చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో 5.96 లక్షల చదరపు మీటర్ల స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది ఉండగా, మిగతా 2.58 లక్షల చదరపు మీటర్ల స్థలం బీఎంసీ పరిపాలన విభాగానికి చెందింది.

 ఈ మొత్తం స్థలాన్ని 1914లో రాయల్ వెస్టర్న్ క్లబ్‌కు 99 సంవత్సరాల కోసం ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. 2013లో లీజు గడువు ముగిసింది. ఇక గడువు పొడిగించి ఇవ్వకూడదని బీఎంసీ డిమాండ్ చేసింది. నగరాభివృద్ధి ప్రణాళికలో ఈ స్థలం క్రీడా మైదానానికి రిజర్వు చేయడంతో ఇక్కడ భారీ థీం పార్క్ నిర్మించాలని శివసేన పేర్కొంది. ఇక్కడ బాల్ ఠాక్రే స్మారకాన్ని నిర్మించాలని శివసేన భావిస్తోంది.

 కాని ప్రభుత్వం హెలీపోర్టు నిర్మించాలని యోచిస్తోంది. దీంతో ఈ మొత్తం స్థలాన్ని తమకే అందజేయాలని విమానాశ్రయ అభివృద్ధి సంస్థ డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి ఈ స్థలమంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వం అంటోంది. ఇందులో కొంత భాగం బీఎంసీ పేరిట ఎలా మార్పిడి జరిగిందని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీంతో ఇరు సంస్థల మధ్య  కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. అందుకు వందేళ్ల కిందటి రికార్డులు సమర్పించాలని బీఎంసీ పరిపాలన విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement